– 2018, జూన్‌ 2 నుంచి అమలు చేస్తామన్న సీఎం
– అదే ఏడాది మే 18న బిశ్వాల్‌ కమిటీ నియామకం
– గడువు దాటి 27 నెలలైనా అమలుపై స్పష్టత కరువు
– ఉమ్మడి ఏపీలోనూ ఇంత జాప్యం లేదు
– సర్కారు తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి
– ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి

హైదరాబాద్‌ : ‘తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018, జూన్‌2న మధ్యం తర భృతి (ఐఆర్‌) ప్రకటన చేస్తాం. ఆగస్టు15 నాటికి పీఆర్సీ నివేదిక ఇవ్వడంతో పాటు అమలు కావాలి.’అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు 2018, మే 16న ఉద్యోగు, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. అందుకు అనుగుణం గానే తెలంగాణలో తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని 2018, మే 18న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. తొలి పీఆర్సీ కమిటీ చైర్మెన్‌గా ఐఏఎస్‌ మాజీ అధికారి సిఆర్‌ బిశ్వాల్‌, సభ్యులుగా ఐఏఎస్‌ మాజీ అధికారులు సి ఉమామహేశ్వరరావు, మహమ్మద్‌ అలీరఫత్‌లను నియమిం చింది. రాష్ట్రంలో తొలి పీఆర్సీ 2018, జులై1 నుంచి అమలు కావాలి. ఆ గడువు ముగిసి 27 నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదని, ఎప్పుడు అమలవుతుందో స్పష్టత కరువైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్సీని మరిచారా?అని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీని కూడా అమలు చేయడం లేదంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలుస్తున్నది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అమలవుతున్నది. ఈనెల 5న ఏపీ ప్రభుత్వానికి పీఆర్సీని నివేదికను ఆ కమిటీ అందజేసింది. దసరా కానుకగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. తెలంగాణలో మాత్రం కనీసం ఐఆర్‌ కూడా అమలుకు నోచుకోవడం లేదు. మూడు డీఏల బకాయిలు ఇవ్వాల్సి ఉన్నది. ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీ ఇచ్చింది. అదీ అమలు కాలేదు. ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఇలా సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో సర్కారు తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

జీతాలు పెంచడం ఇష్టంలేకే…
పీఆర్సీ కమిటీ గడువును డిసెంబర్‌ వరకు రాష్ట్ర ప్రభు త్వం పొడిగించింది. ఇదేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వేతన సవరణకు కమిటీ గడువు పెంపునకు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. సర్వీసు అంశాలను పరిశీలించేందుకే పీఆర్సీ కమిటీ గడువును పెంచామని చెప్పింది. పీఆర్సీ నివే దిక సిద్ధంగానే ఉన్నా ఇంత వరకు ప్రభుత్వానికి సమర్పిం చలేదు. ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు పెంచడం ఇష్టం లేనందు వల్లే నివేదికను ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించడం లేదని సమాచారం. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ఇచ్చిన హామీలు 29నెలలైనా అమలు కాలేదు. హు జూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పీఆర్సీ ప్రక టిస్తారని ఉద్యోగులు ఆశించారు. ఫలితాల తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని 2019, నవంబర్‌ 10న సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. పది రోజుల్లో నివేదిక రూపొందించాలని పీఆర్సీ కమిటీని ఆదేశించారు. గుట్టుచప్పుడు కాకుండా పీఆర్సీ కమిటీ గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్‌ 3006ను 2019, నవంబర్‌ 19న జారీ చేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు పీఆర్సీ అమలుపై ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకపోవడం గమనార్హం. 2021, ఫిబ్రవరి లేదా మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనైనా పీఆర్సీ ప్రకటిస్తుందా? లేదా?అన్నది కీలకంగ మారింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపోటములపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
ఉద్యమాలకు సిద్ధమవుతాం : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

పీఆర్సీని 2018, జులై ఒకటి నుంచి అమలుచేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్య మాలకు సిద్ధమవుతాం. ఉద్యోగ సంఘాలను ఒకవేదిక మీద కు తెచ్చేందుకు ఐక్యవేదికను ఏర్పాటుచేశాం. అన్ని సంఘా లతోనూ సంప్రదింపులు చేస్తున్నాం. దసరా కానుకగా పీ ఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.

త్వరలో ఐక్యవేదిక సమావేశం :
జి సదానందంగౌడ్‌, ఎస్టీయూ అధ్యక్షులు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల, కాంట్రాక్టు అధ్యాపక సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని చర్చించి ఉద్యమాలు చేపట్టే విధంగా చర్చిస్తాం. జిల్లా స్థాయి నుంచి ఉద్యోగులను ఉద్యమాలకు సిద్ధం అయ్యేలా కార్యాచరణ రూపొందిస్తాం.

Courtesy Nava Telangana