-100 డయల్‌కు 6,41,955 కాల్స్‌

ఢిల్లీలోని నిజాముద్దిన్‌లో ఒక మత సమావేశానికి హాజరై వచ్చిన దాదాపు వేయి మంది తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర పోలీసుల వేట ముమ్మరమైంది. హైదరాబాద్‌ నుంచి ఈ సమావేశానికి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారని అనుమానిస్తున్న పోలీసు అధికారులు వారి ఆచూకీ కోసం నగరంలో జల్లెడ పడుతున్నారు. ఇటీవల ఢిల్లీ నిజాముద్దిన్‌లోని మస్కత మసీదు వద్ద జరిగిన మతపరమైన సదస్సుకు అంతర్జాతీయంగానే గాక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో ఒక వర్గానికి చెందినవారు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఇండోనేషియన్‌ల ద్వారా చాలా మందికి కరోనా వైరస్‌ సోకిందనీ, అందులో పాల్గొన్న తెలంగాణ వాసులూ దీని బారిన పడ్డారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్‌లో ఒక వృద్ధుడు ఈ సమావేశానికి వెళ్లి వచ్చాకే అక్కడ సోకిన కరోనా వైరస్‌ కారణంగా మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి కూడా ఈ విధంగానే కరోనా సోకి ఇంటికి రాగా అతని మరో నలుగురు కుటుంబసభ్యులు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరందరిని మొత్తానికి పోలీసులు గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నిజాముద్దిన్‌లో సమావేశానికి వెళ్లివచ్చిన వారు అనేక మంది ఉన్నారనీ, వారంతా ఎక్కడ ఉన్నారు?

ఇంకెంత మందిని వారు కలిశారు? వారిలో ఎంత మందికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానాలు అధికారులకు ఉన్నాయి. దీంతో నిజాముద్దిన్‌ సమావేశానికి వెళ్లి వచ్చిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరంతో పాటు రాష్ట్రంలో అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ మొదలైన జిల్లాలకు చెందినవారు ఈ సమావేశంలో ఎక్కువగా పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వేట సాగిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గత 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పోలీసుల నుంచి సహాయాన్ని కోరుతూ 100 డయల్‌కు 6,41,955 కాల్స్‌ వచ్చాయని పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా జనాలు పెద్ద సంఖ్యలో గుమి గూడటంపై వచ్చాయని చెప్పారు. అలాగే తమకు సౌకర్యాలు సరిగా లేవనీ, నిత్యావసర సరుకులు దొరకడం లేదని తదితర సమస్యలతో కాల్స్‌ వస్తున్నాయనీ, వాటన్నింటిని పోలీసులు ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిలో అటెండ్‌ అవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్టు తెలిపారు. కాగా ఇంత చెబుతున్నా కొన్ని ప్రాంతాలలో జనం రోడ్లపైకి పెద్ద సంఖ్యలో రావడం మానడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై మరింత కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేశారు.

Courtesy Nava Telangana