• పరీక్షలకూ ధరల నిర్ణయం.. జీవో జారీ చేసిన సర్కారు
 • లక్షణాలుంటేనే పరీక్షలు .. అదీ వైద్యుల సిఫారసుతోనే

కరోనా టెస్టుకు   2,200
ఇంటి దగ్గరే చేస్తే  2,800
ఆస్పత్రిలో చికిత్సకు రోజుకు  4,000
ఐసీయూలో అయితే  7,500
వెంటిలేటర్‌పై ఉంచితే  9,000
ఇవీ మార్గదర్శకాలు

 1. చికిత్స అవసరమైన రోగులనే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి. వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని ఇళ్లకు పంపాలి
 2. చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన ధరలే వసూలు చేయాలి. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌, ఇంజెక్షన్లు వాడితే, వాటి ధరలను వసూలు చేసుకోవచ్చు.
 3. రియల్‌ టైమ్‌ డేటాను ప్రభుత్వ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాలి.
 4. ఇళ్ల వద్ద సౌకర్యాలు లేనివారిని ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపాలి.
 5. వ్యాపారంగా మార్చి, మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
 6. పీపీఈ కిట్లు, ఖరీదైన మందులు, పరీక్షలు అవసరమైతే ఆ ఖర్చు ప్యాకేజీకి అదనం.

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేటులో పరీక్షలు, చికిత్సకు సర్కారు అనుమతించింది. పరీక్షలు, చికిత్సలకు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి జీవో నెంబరు 248 జారీ చేశారు. దాని ప్రకారం.. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్ష ధర రూ. 2200గా సర్కారు నిర్ణయించింది. ల్యాబ్‌ వద్దకు వెళ్లి నమూనాలిస్తేనే ఈ ధర.

అదే ఇంటిదగ్గరే నమూనాల సేకరణకు అయితే రూ.  2800గా ధర ఖరారు చేశారు. వైరస్‌ సోకిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేస్తారు. ఇక, చికిత్సల విషయానికి వస్తే.. వైరస్‌ సోకినవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే సాధారణ చికిత్సకు రోజుకు రూ. 4 వేలు, వెంటిలేటర్‌ లేకుండా ఐసీయూలో చికిత్సకు రోజుకు రూ.7500, వెంటిలేటర్‌పై ఉంచితే రోజుకు రూ.9 వేలుగా ధరలను నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో సాధారణ చికిత్సకు ఉపయోగించే మందుల వంటివి ఉంటాయి. అవి కాకుండా.. రెమ్డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి హైఎండ్‌ ఔషధాలు, ఇతరత్రా  హైఎండ్‌ పరీక్షలకు (సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, పెట్‌ స్కాన్‌ వంటివి) అయ్యే ఖర్చులను అదనంగా చెల్లించుకోవాలని సర్కారు పేర్కొంది.

అందరికీ చెయ్యరు..
అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్లి ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేయించుకోవడం కుదరదు. లక్షణాలున్న వారికే.. అదీ వైద్యుడి సిఫారసు మేరకే చేస్తారు. పరీక్షలు చేసే ముందే ప్రైవేటు ఆస్పత్రులు/ల్యాబ్‌లు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలి. పరీక్షలు చేసిన తర్వాత వాటి నివేదికలను కూడా పంపాలి.

ఆస్పత్రులకు ఇవీ మార్గదర్శకాలు
ప్రైవేటు ఆస్పత్రులు కరోనా  చికిత్స అందించేందుకు విధిగా ప్రజారోగ్య సంచాలకులకు దరఖాస్తు చేసుకోవాలి. తగిన పరిశీలన అనంతరం.. సదరు ఆస్పత్రులకు అనుమతులతో పాటు పోర్టల్‌ పాస్‌వర్డ్‌ కూడా ఇస్తారు. వారివద్ద నమోదైన పాజిటివ్‌ వివరాలను అందులో అప్‌లోడ్‌ చేయాలి. వాటి ఆధారంగా ట్రేసింగ్‌ను వైద్య ఆరోగ్య సిబ్బంది చేపడతారు.

 1. చికిత్స అవసరమైన రోగులనే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి. లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇళ్లకు పంపాలి
 2. చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన ధరలే వసూలు చేయాలి. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌, ఇంజెక్షన్లు వాడితే వాటి ధరలను వసూలు చేసుకోవచ్చు.
 3. ఆస్పత్రిలోని బెడ్ల సంఖ్య, రోగుల సంఖ్య డిస్‌ప్లే చేయాలి. ఆ వివరాలు ఆరోగ్యశాఖకు ఇవ్వాలి.
 4. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌ ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌ డేటాను ప్రభుత్వ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాలి.
 5. ఇళ్ల వద్ద తగిన సౌకర్యాలు లేనివారిని ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపాలి.

ప్రైవేటు ఆస్పత్రులన్నీ విధిగా ఈ నియామాలు పాటించాలి. దీన్ని వ్యాపారంగా మార్చి, మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి పూర్తిగా మూసివేస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు బృందం ఏర్పాటు చేయనున్నారు.

 మొత్తం 18 ప్రైవేటు ల్యాబులు
కరోనా పరీక్షలకు సంబంధించి తెలంగాణలో ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి పొందిన ల్యాబ్‌లు 18 ఉన్నాయి. కొన్ని ల్యాబ్‌లు ఆస్పత్రుల్లో ఉండగా, మరికొన్ని విడిగా ఉన్నాయి. అవేంటంటే..

1.విజయా డయాగ్నస్టిక్స్‌(హిమాయత్‌నగర్‌) 2. విమ్టా ల్యాబ్స్‌, చర్లపల్లి. 3. డాక్టర్‌ రెమీడిస్‌ ల్యాబ్స్‌, పంజాగుట్ట 4. పాత్‌ కేర్‌ ల్యాబ్‌, మేడ్చల్‌, 5. మెడిసిస్‌ పాత్‌ ల్యాబ్‌, సికింద్రాబాద్‌ 6 బయోగ్నోసిస్‌ టెక్నాలజీ, మల్కాజ్‌గిరి 7.టెనెట్‌ డయాగ్నస్టిక్స్‌, బంజారాహిల్స్‌ 8. అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ సైన్స్‌, శేరిలింగంపల్లి 9.అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌, సికింద్రాబాద్‌, 10. మాదాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్‌ ఇండియా లిమిటెడ్‌. 11.సికింద్రాబాద్‌లోని లూసిడ్‌ మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌ 12. లెప్రా సొసైటీ-బ్లూ పీటర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, చర్లపల్లి

ఆస్పత్రుల్లోని ల్యాబ్స్‌

 1. అపోలో ల్యాబ్‌, జూబ్లీహిల్స్‌., 2. ఏఐజీ ఆస్పత్రి, గచ్చిబౌలి, 3. స్టార్‌ ఆస్పత్రి, బంజారాహిల్స్‌. 4. యశోద ఆస్పత్రి, సికింద్రాబాద్‌. 5. సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 6. విరించి హాస్పిటల్‌, బంజారా హిల్స్‌

పేద, మధ్యతరగతి వారికి భారమే
కొవిడ్‌-19 చికిత్సకు నిర్ణయించిన ధరలు, పేద, మధ్యతరగతి వారు కట్టలేని విధంగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం పత్రికాప్రకటను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఇప్పటికే కార్పోరేట్‌ ఆస్పత్రులు కొవిడ్‌ పేరుతో మాములు కన్నా చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యు.జగన్‌ ఆరోపించారు. సాధారణ జబ్బులతో వెళ్లినా రకరకాల టెస్టులు చేయిస్తున్నారని, పీపీఈ కిట్ల పేరుతో ప్రతి రోగికీ బిల్లు వేసి, దోచుకుంటున్నారని విమర్శించారు.

ప్రైవేటు ఆస్పత్రుల తర్జన భర్జన
హైదరాబాద్‌ సిటీ : ప్రైవేట్‌ ల్యాబ్‌లు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సలకు సర్కారు ఖరారు చేసిన చార్జీలపై కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులు అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆ ధరలకు చికిత్స చేస్తే తమకు గిట్టుబాటు కాదని నగరంలోని ఒక ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. దీనిపై సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ సభ్యులంతా కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలంగాణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ అంధ్యక్షుడు, కిమ్స్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఒక్కొక్క రోగికి ఎంత వైద్య ఖర్చు అవుతుందనే విషయాలపై ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందిస్తామని ఆయన చెప్పారు.

Courtesy Andhrajyothi