ఎర్రమంజిల్‌ వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్య వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా
మాస్టర్‌ ప్లాన్‌లను అందజేసిన ప్రభుత్వం వారసత్వ కట్టడాల పరిరక్షణ వ్యవహారంలో ప్రభుత్వ వాదనకు.. వాస్తవాలకు పొంతన ఉండటంలేదని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఐదు మాస్టర్‌ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయంటున్న ప్రభుత్వం మొదటి మాస్టర్‌ ప్లాన్‌లో గుర్తించిన వారసత్వ కట్టడాలకు రక్షణ ఉంటుండగా రెండో ప్లాన్‌లో లేదని ఎలా చెబుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ భవన నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ మొత్తం 5 మాస్టర్‌ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల మాస్టర్‌ ప్లాన్‌ ఉండేదని, ప్రస్తుతం ఆవల కూడా ఉందన్నారు. వాస్తవంగా జరిగిన మార్పులన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చలేదని, ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌ను కొత్తగా రూపొందిస్తున్నారని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మొదటి మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న అంశాలు చివరిదానిలోనూ కొనసాగుతాయా అని ప్రశ్నించగా అవునని న్యాయవాది సమాధానం చెప్పడంతో ఇదిచాలని వ్యాఖ్యానించింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ 2010 మాస్టర్‌ ప్లాన్‌కు, 2013లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు మధ్య ఉన్న తేడాను చెప్పడానికి శుక్రవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. రాతపూర్వక వాదనలు సమర్పిస్తానన్న న్యాయవాది అభ్యర్థనకు అనుమతించి తీర్పును వాయిదా వేసింది. రాత పూర్వక వాదనలను శుక్రవారంలోగా అందజేయాలని ఇరుపక్షాలకూ సూచించింది.

Courtesy eenadu