• ఆలోగా మా డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలి
  • 23న వరంగల్‌లో సభ
  • తర్వాత ప్రత్యక్ష కార్యాచరణే
  • విద్యుత్తు కార్మికుల అల్టిమేటం
  • హైదరాబాద్‌లో ఆర్టిజన్ల మహాధర్నా

హైదరాబాద్‌:  డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని 21 కార్మిక సంఘాలతో కూడిన ‘తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ (టీఈటఫ్‌)’ హెచ్చరించింది. ఈ నెల 23లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్తు సంస్థలకు అల్టిమేటం ఇచ్చింది. 71 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఈటఫ్‌ ఈ నెల 4 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రెండు డిమాండ్లను పరిష్కరించాలంటూ చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముందు బుధవారం టీఈటఫ్‌ మహాధర్నా నిర్వహించింది. జిల్లాల నుంచి వచ్చిన కార్మికులతో మింట్‌ కాంపౌండ్‌ జనసంద్రంగా మారింది. ప్రభుత్వం ఆర్టిజన్లను క్రమబద్ధీకరించిందని చెబుతుంటే.. యాజమాన్యాలు మాత్రం స్టాండింగ్‌ ఆర్డర్‌ మాత్రమే అమలు చేస్తామని చెబుతున్నాయని టీఈటఫ్‌ చైర్మన్‌ పద్మారెడ్డి, కన్వీనర్‌ శ్రీధర్‌ మండిపడ్డారు. ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు/ కార్మికులందరికీ ఒకే రూల్‌ ఉండాలని, రెండు సర్వీసు రూల్స్‌ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

పాత పింఛను విధానంలో నియమితులైన వారిని కొత్త విధానంలోకి ఎలా తెస్తారని నిలదీశారు. ఆర్టిజన్లకు 2018 వేతన సవరణతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్‌ అమలు చేయాలన్నారు. విద్యుత్తు శాఖలో పీస్‌ రేట్‌ విధానంతో పనిచేస్తున్న ఎస్పీఎం, ఎంఆర్టీ, స్టోర్‌ వర్కర్లు, స్పాట్‌ బిల్లింగ్‌, పీసీఏ, పీఏఏ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలో మాస్టర్‌ ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి యూనియన్‌ ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టిజన్‌ కార్మిక కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయాలని అన్నారు. ఈ నెల 23న వరంగల్‌లో బహిరంగ సభ అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లో ఏళ్ల త రబడి పనిచేస్తున్న ఆన్‌మెన్‌ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. టీఈటఫ్‌ నాయకులు గాంబో నాగరాజు, సాయిలు, శ్రీధర్‌గౌడ్‌, వజీర్‌, కుమారాచారి, గోవర్ధన్‌తో పాటు నేతలు మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు ఇచ్చిన ప్రతి హామీని యాజమాన్యం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాధర్నాలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చిన ఆర్టిజన్లను మార్గమధ్యంలో అరెస్టు చేశారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు వర్షంలో సైతం మహాధర్నా కొనసాగించారు. మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Courtesy Andhrajyothi…