• రాష్ట్రానికి చేరకుండానే ఎగరేసుకుపోతున్న కేంద్రం
  • ధ్రువీకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
  • రాష్ట్రం కోసం మరో మెషిన్‌ తెప్పిస్తున్న ఇన్ఫోసిస్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి తెప్పించిన కోబాస్‌ 8800 యంత్రంపై కేంద్రం కన్ను పడింది. రోజుకు 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ఈ యంత్రాన్ని కోల్‌కతాకు తరలించేందుకు ప్ర యత్నిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోం ది. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా చేయడం లేదన్న విమర్శలు, ఆరోపణలకు ఒక్కసారే చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎ్‌సఆర్‌) కింద ఈ యంత్రాన్ని బుక్‌ చేయించింది.

అమెరికాకు చెందిన రోచే కంపెనీ దీన్ని తయారు చేసింది. మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని రాంకీ సంస్థతో మాట్లాడి సీఎ్‌సఆర్‌ కింద ఈ యంత్రాన్ని తెప్పించాలని కోరారు. దాంతో ఆ సంస్థ ‘కోబాస్‌ 8800’ యంత్రాన్ని బుక్‌ చేసింది. ఆ యంత్రం విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ యంత్రంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. హైస్పీడ్‌ ఆర్టీపీసీఆర్‌ మెషిన్‌ అని అధికారులు అంటున్నారు.

4 రోజుల క్రితమే చెన్నైకి చేరిన యంత్రం
కోబాస్‌ యంత్రం 4 రోజుల క్రితమే చెన్నైకి చేరింది. దీని కోసం నిమ్స్‌లో భారీ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా తెలంగాణ కోసం సీఎ్‌సఆర్‌ కింద కోబాస్‌ 8800 యంత్రాన్నే బుక్‌ చేశారు. ఆ రెండు మెషిన్లతోపాటు రాష్ట్రంలో సీసీఎంబీ, ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కలిపి ఒక్కరోజులోనే సుమారు 15 వేల టెస్టులు జరుగుతాయని సర్కారు భావించింది.

అయితే సర్కారు ఒకటి తలిస్తే… మరొకటి అయింది. చెన్నై చేరిన కోబాస్‌ 8800 యంత్రం తమకు కావాలని కేంద్రం పట్టుబట్టి మరీ కోల్‌కతాకు తరలిం చేందుకు ప్రయత్నిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ధ్రువీకరించారు. రాష్ట్రం కోసం తీసుకొచ్చిన యంత్రాన్ని కేంద్రం కోల్‌కతాకు తరలిస్తోందన్నారు.

Courtesy Andhrajyothi