• గాంధీ వర్ధంతి రోజు భారీ బహిరంగ సభ?
  • గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ అంటూ నినాదం
  • జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఆహ్వానం

హైదరాబాద్‌ : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం, లౌకికవాద శక్తుల్లో, ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో వారితో పాటుగా ఉద్యమించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఉద్యమానికి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ తర్వాత వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ భారీ విజయాలు సాధించడంతో సానుకూల వాతావరణం లేదని గ్రహించి, మౌనం వహించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా నాలుగు సీట్లు దక్కాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో మాతృసంస్థ ఆర్‌ఎ్‌సఎస్‌ కీలక సమావేశాన్ని కూడా హైదరాబాద్‌ నగరంలోనే ఏర్పాటు చేశారు. వేలమందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌కు రాష్ట్రంలో బీజేపీకి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో తాను జరిపే పోరాటంతో లౌకిక వాదులు, ముస్లిములు వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి అండగా నిలబడతారని కేసీఆర్‌ భావిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై యావద్దేశం నిరసనలతో వేడెక్కిన రాజకీయాలను సానుకూలంగా మలచుకొనేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత సిద్ధమయ్యారు. బీజేపీ విస్తరణను అడ్డుకొనేందుకు ఇదే అదునుగా భావిస్తూ, విపక్షాలను సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీఏఏ చట్టంతో ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించి, ప్రజల్లో అవగాహన కలిగించాలని, తద్వారా బీజేపీయేతర పక్షాలను ఐక్యం చేయాలని కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ, బెంగాల్‌, బిహార్‌, ఏపీలు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ చట్టాన్ని నిలువరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అసద్‌ నేతృత్వంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు కేసీఆర్‌ను కలిసింది అందుకే. మహబూబ్‌నగర్‌లో ఈ అంశంపై అసద్‌ పెట్టిన సభకు భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 27న నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల తరుణంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమకు బాగా కలిసి వస్తుందని ముస్లిం నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్‌ సభకు వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్‌లో భారీ సభను కేసీఆర్‌ ఏర్పాటు చేస్తారు. డిసెంబరు 29న బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో జరిగే సభకు రావాలని అసద్‌ సీఎంను కోరినట్లు తెలుస్తోంది.

గాంధీ కావాలా? గాడ్సేకావాలా?
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌సీఆర్‌లను వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ జనవరి 30న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తారు. మహాత్మాగాంధీ కావాలా? గాడ్సే కావాలా? అనే నినాదంతో నిరసన బహిరంగసభను సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ముస్లిం మత నాయకులు, ప్రతినిధులను దేశం నలు మూలల నుంచి ఆహ్వానించే బాధ్యతను అసదుద్దీన్‌ ఒవైసీకి అప్పగించారు. టీఆర్‌ఎస్‌ సభకు సోనియా, మమత, నితీశ్‌, పినరై విజయన్‌, హేమంత్‌ చౌదరిలను ఆహ్వానించనున్నారు.

(Courtesy Andhrajyothi)