Image result for మిర్చి"అధికార పార్టీ నేతలే విత్తన డీలర్లు
గోదావరి లోయలో దగా పడిన రైతులు
నకిలీ విత్తనాలతోనే తెగులు
రైతుల ఆరోపణ
నష్టం వంద కోట్లకు పైగానే
ముఖం చాటేసిన విత్తన కంపెనీలు కొండూరి రమేశ్‌బాబు

గోదావరి లోయలో మిర్చి రైతుల కన్నీటికి కారణమైన జెమినీ వైరస్‌ వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మిర్చి విత్తనాల వ్యాపారంతో కోట్లు గడిస్తున్న వ్యాపారులు, ‘బాండ్‌’ పేరుతో కాంట్రాక్టు మిర్చి వ్యవసాయం చేయిస్తున్న ఆర్గనైజర్లు అధికార పార్టీకి చెందిన వారు కావటం విశేషం. గిరిజన ప్రాంతంలోని పూర్వపు ఖమ్మం, వరంగల్‌ జిల్లాలోని వేలాది ఎకరాల్లో సోకిన వైరస్‌తో మిర్చి పైరు పూర్తిగా మాడిపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట ప్రాంతాల్లో కనిపించిన వైరస్‌ సమీప ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మడం తోనే జన్యుపరమైన లోపాలతో వైరస్‌ వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ను గత నెలలోనే గుర్తించిన రైతులు మార్కెట్‌లో దొరికే అన్ని రకాల క్రిమి సంహారక మందులనూ పిచికారీ చేసినా ప్రయోజనం లేక పోగా పెట్టుబడులు పెరిగి పోయి మరింత నష్టపోయారు. రైతులు ఆందోళన బాట పట్టిన తర్వాత కలెక్టర్‌ చొరవతో స్పందించిన వ్యవసాయ శాఖ ఒక బృందాన్ని వెంకటాపురం ప్రాంతానికి పంపింది. వైరస్‌ సోకిన చేలను ఈ బృందం ఇటీ వల పరిశీలించింది. వైరస్‌ సోకిన మిర్చి మొక్కలను ప్రయో గశాలకు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత కారణాలను వివరిస్తామని చెప్పి వారు చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకూ ఎటువంటి నివేదిక రాలేదు.

గులాబీ నేతల విత్తన దందా…
ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా విత్తనాల వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేత కొన్ని ప్రముఖ మిర్చి విత్తనాల కంపెనీలకు రెండు జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్‌ గానూ, ఏజన్సీ ప్రాంతంలో డీలర్‌గానూ వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ ఎమ్మెల్సీకి ఆయన సోదరుడు కావటంతో ఆయన విత్తనాలను అధిక ధరలకు అమ్మినా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వైరస్‌ సోకిన యూఎస్‌ 341, యూఎస్‌4884, వండర్‌ హాట్‌, డీడీ, ఇండికా డీలక్స్‌ వంటి విత్తనాలకు ఆయనే డీలర్‌ కావటం విశేషం. బహుళ జాతికి చెందిన మేలురకం మిర్చి విత్తనాలను రూ. 20 నుంచి 25 వేలకు అమ్మాల్సి ఉండగా ఏజెన్సీ ప్రాంతంలో కిలో రూ. 42,000 లకు, 70 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 4,100 కు అమ్మటం ద్వారా ఆ వ్యాపారి కోట్లకు పడగలెత్తారు. రైతులకు కనీసం రశీదు కూడా ఇవ్వకుండా కొందరు దళారులను నియమించుకుని ఆయన అక్రమ వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ సోకిన చేలను పరిశీలించి అందుకు కారణాలను విశ్లేషించాల్సిన బహుళ జాతి కంపెనీల వారెవరూ ఇప్పటి వరకూ రాక పోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరమైన కారణాలతో వైరస్‌ సోకిందనే నివేదిక వస్తే రైతులకు కంపెనీలు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ విత్తనాలు చెలామణి చేయటంతో పాటు అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్న వ్యవహారం బయట పడుతుందనే కంపెనీల వారికి డీలర్‌ ఇప్పటి వరకూ సమాచారం అందించలేదని వారు ఆరోపిస్తున్నారు. మిర్చి విత్తనాల వ్యాపారి అధికార పార్టీకి చెందిన వారు కావటంతో వైరస్‌ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య డిమాండ్‌ చేశారు. వెంకటాపురంలో ఆయన ఇటీవల ధర్నా చేశారు.

బాండ్‌ పేరుతో కాంట్రాక్టు వ్యవసాయం…
బాండ్‌ పేరుతో కాంట్రాక్టు వ్యవసాయం చేయిస్తున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా నేత కావటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు వ్యవ సాయ చట్టం ప్రకారం రైతులతో రాత పూర్వక ఒప్పందం చేసుకోవాల్సిన ఆర్గనైజర్‌ కేవలం నోటి మాటలతోనే వేలాది ఎకరాల్లో కాంట్రాక్టు వ్యవ సాయం చేయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారని రైతులు అంటున్నారు. వైర స్‌ సోకిన మిర్చి పైరులో సగానికి పైగా కాంట్రక్టు వ్యవసాయం పరిధి లోనిదైనా నష్ట పరిహారం చెల్లించకుండా ఆర్గనైజర్‌ తప్పించుకుం టున్నారని వారు ఆరోపిస్తున్నారు. వైరస్‌తో తమకు సంబంధం లేదని ఆయన చెప్పటంతో రైతులు మరింత ఆందోళనకు గురయ్యారు.

(Courtesy Nava Telangana)