సాహిత్యానికి ఎల్లలు లేవు. కథలు, కవితలు, పాటలు ఇలా భిన్న సాహిత్యాలు నేడు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. పిల్లల్లో సామాజిక స్పృహను, వారిలో సృజనాత్మకతను పెంపొందించే ఉద్దేశంతో బాలసాహిత్యమూ పురుడుపోసుకున్నది. ముఖ్యంగా తెలుగుభాషలో పూర్వకాలం నుండే బాలసాహిత్యం వర్థిల్లిందని అనేక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా బాలల కోసం రాసిన, ప్రచు రించిన సాహిత్యాన్ని బాల సాహిత్యంగా నిర్వచించవచ్చు. బాలల్లో సాహిత్యాసక్తిని పెంపొందించడానికి ఎందరో సాహితీవేత్తలు తమ కలాలను బాలసాహిత్యానికి అంకితం చేశారు. నవంబర్14 బాలల దినోత్సవం సందర్భంగా కొంతమంది బాల సాహితీవేత్తల పరిచయం.

పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన, సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీమజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. పిల్లల కోసం విరివిగా రచనలు చేస్తూ మార్గనిర్దేశనం చేస్తున్న బాలసాహితీ వేత్తలు ఎందరో. బాలసాహిత్య సృజనలో భాగమై తెలంగాణ నేలమీద పుట్టి పెరిగిన బాల సాహితీవేత్తల్ని, వారివారి సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నదే ఈ ప్రయత్నం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన కథా రచయిత జి. సురమౌళి పిల్లల కోసం రాసిన నవల కలిసి బ్రతుకుదాం. దీనికి 1958లో భారత ప్రభుత్వం వారి ఉత్తమ రచన బహుమతి కూడా లభించింది. 1960లో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి రాసిన బాలల బొమ్మల భాగవతము, డా.పి. యశోధా రెడ్డి నక్కబావ, పేదరాసి పెద్దమ్మ కథలు, జి.రాములు గాంధీ సూక్తులు, బాలబాట అర్థశతకం వంటివి. వీళ్ళే కాకా డెబ్బయ్యవ దశకానికి వస్తే ఎర్రోజు సత్యం, డా.జె. బాపురెడ్డి పిల్లల కోసం గేయాలు, కవితలు రాశారు. డా. బి. దామోదర్ రావు, రేగులపాటి కిషన్‌రావులు, దూడం నాంపల్లి, రావికంటి వసునందన్, ప్రస్తుత తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు నాటి బాల రచయితల్లో ముఖ్యులు. బాలల కోసం సాహిత్య రచన, అనువాదాలు చేసి, పుస్తకాలను అచ్చువేసి చరిత్రలో నమోదు కాని రచయిత పొట్లపల్లి రామారావు. 1955 నుండి రచనా వ్యాసంగం ప్రారంభించిన డా. గూడూరి రాఘవేంద్ర 1954 నుండి 1958 మధ్యకాలంలో ప్రధానంగా పిల్లల కోసం రాశారు. సుప్రసిద్ధ రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఇల్లందల సరస్వతీదేవి పిల్లల కోసం రచనలు చేశారు. 1976లో బాలబందు పురస్కారాలను ఇచ్చి సత్కరించగా మొదటగా అందుకున్న ఆరుగురిలో సరస్వతీదేవి ఒకరు.
1959 ప్రాంతంలో రచనలు చేసిన మరో బాల సాహితీవేత్త తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ. తెలంగాణ ప్రాంతం నుండి బాల సాహిత్యం రాసిన ప్రముఖుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ మలయశ్రీ పిల్లల కోసం 34 రచనలు చేసిన బాల సాహితీవేత్త. కథల తాతయ్యగా సుపరిచితులు ఎన్నవెల్లి రాజమౌళి. ఎ.వి. జనార్దన్ రావు ఉర్దూ, తెలుగు భాషల్లో నిష్ణాతులు. పిల్లల కోసం కథలు, గేయాలు, వ్యాసాలు, నాటికలు రాశారు. ఐతా చంద్రయ్య కథకుడిగా, అనువాదకుడిగా బాల సాహితీవేత్తగా పరిచితులు. పిల్లల కోసం రచనలు చేస్తున్న బాల సాహితీవేత్త డా. వి.ఆర్. శర్మ. సిద్దిపేటకు చెందిన అమ్మన చంద్రారెడ్డి ఆటవిడుపు పేర బాల గేయాలను తెచ్చారు. బాలల కోసం రచనలు చేసిన మరో రచయిత కమలేకర్ నాగోజీరావు. వరంగల్‌లో పుట్టిన డా. అమరవాది నీరజ చిరుకానుక, తేనె చినుకులు కథా సంపుటాలను ప్రచురించారు. రేవులపాటి కిషన్‌రావు సీనియర్ బాల సాహితీవేత్తల్లో ఒకరు. పిల్లల కోసం పలు గేయ, కథా సంపుటాలు వెలువరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన బోయ జంగయ్య పిల్లలకోసం కథా సంపుటాలను ప్రచురించారు.
అమ్మిన శ్రీనివాసరాజు బాలల కోసం గేయాలు, కథలు, వ్యాసాలు రాశారు. వందకు పైగా కథలు, మూడు వందలకు పైగా వ్యాసాలు ఈయన సృష్టి. మరో రచయిత గుర్రాల లక్ష్మారెడ్డి పిల్లల కోసం కథలు, గేయాలు, నాటికలు, పద్యాలు రాశారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీమతి శారదా అశోకవర్థన్ బాలల కోసం కథలు, కవితలు, గేయాలు, నాటికలు, పాటలు ప్రచురించారు. బాల సాహితీవేత్తగా సుపరిచితులు తిరునగరి వేదాంతసూరి. పిల్లల కోసం వేదాంతసూరి 16 పుస్తకాల్ని రాశారు.
డా. పత్తిపాక మోహన్ పిల్లల కోసం మన కవులు పేర 1998 నుంచి వార్త దినపత్రికలో శీర్షిక రాశారు. 2000లో ఈ వ్యాసాలన్ని పుస్తకరూపంలో అచ్చయ్యాయి. వరంగల్‌కు చెందిన పి. జ్యోతి దగ్గర రెండు సంపుటాలకు సరిపడా కథలు ఉన్నాయి.
పిల్లల కోసం రాయడం బాధ్యతగా భావించే రచయిత పుప్పాల కృష్ణమూర్తి. మెదక్ జిల్లాకు ఉండ్రాళ్ల రాజేశం తెలంగాణ ప్రాంతం నుంచి ఇటీవల ఎక్కువగా రాస్తున్న బాల సాహితీవేత్తల్లో ఒకరు. తెలంగాణ ప్రజల భాషలో, అందులోనూ బడిపిల్లల భాషలో వారికోసం కథలు తెచ్చిన రచయిత పెండెం జగదీశ్వర్. బాల సాహిత్యం బాలలకు వినోద, విజ్ఞాన, వికాసాన్ని అందించేదిగా ఉండాలి అన్నది పెందోట వెంకటేశ్వర్లు అభిమతం. వరంగల్ జిల్లాకు చెందిన ప్రతాపురం రామానుజాచారి పిల్ల ల కోసం సుమారు 350కి పైగా కథలు రాశా రు. బాల సాహిత్య వికాసం కోసం కృషి చేస్తున్న వారి లో ఖమ్మం జిల్లాకు చెందిన పైడిమర్రి రామకృష్ణ ఒకరు. ఇదే జిల్లాకు చెందిన వైరాలో పుట్టిన బి. మధుసూధన రాజు పిల్లల కోసం కథలు, గేయాలు, నాటికలు రాశారు.

తెలంగాణలో బాలల కోసం రచనలు చేయడమేకాక, వారి గురించి నిరంతరం చింతించే వారిలో డా. భూపాల్ ప్రముఖుడు. 86 చిన్న కథలతో వీరు ప్రచురించిన ఉగ్గుపాలు కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. మరో బాల సాహితీవేత్త మేకల మదన్‌మోహన్ రావు బాలసాహిత్యంలోని అన్ని ప్రక్రియల్ని చేపట్టారు. బాల సాహిత్యం అన్ని ప్రక్రియలకు మూలం అనే యాదగిరిరెడ్డి పిల్లల కోసం కథలు, గేయరూపకాలు రాశారు. సూర్యాపేటకు చెంది న డాక్టర్ సిరి వృత్తిరీత్యా దంతవైద్యురాలు. పిల్లలకోసం వందలాది కథల్ని, గేయాలను రచించారు. ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పిల్లలకోసం కథలు రాయడమేకాక, సేకరించిన కథలను అచ్చువేశారు. ఈ తరం విమర్శకుల్లో తొలి వరుసలో ఉన్న ఎం. నారాయణ శర్మ 1998 ప్రాంతంలో పిల్లల కోసం శతకాలను పరిచయం చేశారు. పిల్లల కోసం కథలు చెప్పడం, రాయడం ఇష్టం అంటారు సీనియర్ రచయిత వాసాల నరసయ్య. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. సిరిసిల్లకు చెందిన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కవిగా, సినీగేయ రచయితగా, బాలసాహితీవేత్తగా సుప్రసిద్ధులు.
వేములవాడకు చెందిన గర్శకుర్తి రాజేంద్ర ఎనభయ్యవ దశకంలో పిల్లల కోసం రచనలు చేశారు. వేములవాడకే చెందిన ఎర్రోజు ఆదినారాయణ బాల గేయాలను రచించగా, అల్లె శంకర్ కోతి గీతాలు రచించారు. కామారెడ్డికి చెందిన సిరిగాద శంకర్ బాల గేయాల సంపుటి పాప, మరో సంపుటి ఇటీవల తెచ్చారు.వీధుల రాంబాబు పిల్లల కోసం రాసిన కథలను 2011లో బంతిపూల మాల పేరుతో వెలువరించారు. సిద్దిపేటకు చెందిన వరుకోలు లక్ష్మయ్య బాలల కోసం గేయాలు రాసిన ఉపాధ్యాయులు. గృహిణిగా ఉంటూనే పిల్లల కోసం చక్కని గేయరచనలు చేసిన రచయిత్రి ఎడ్ల లక్ష్మి. సిద్దిపేటకు చెందిన ఈవిడ చిత్రకారిణి కూడా. తన గేయాలకు తానే చిత్రాలు గీసుకోవడం వీరి ప్రత్యేకత. డబ్బీకార్ సురేందర్ దాగుడు మూతలు కవితా సంపుటి అచ్చువేశారు. సామలేటి లింగమూర్తి పాటల పల్లకి, తెలంగాణ మధురగేయాలు గేయ సంపుటాలు వెలువరించారు.

సిరిసిల్ల జిల్లా సింగారానికి చెందిన వాసరవేణి పరశురాములు నవతరం బాలసాహితీ వేత్తల్లో ఒకరు. బాల సాహిత్య రచన, పరిరక్షణ, ప్రచారం, అనువాదాలనగానే గుర్తొచ్చే పేరు అనీల్ బత్తుల. అరుదైన పిల్లల పుస్తకాలను సేకరించి పెట్టిన అనీల్ పుస్తక ప్రియులకు సుపరిచితులు. డా. కె.బి. గోపాలం పిల్లలకోసం వైజ్ఞానిక రచనలు చేశారు. మూఢనమ్మకాల వంటి వాటిని నిర్మూలించే దిశగా హేతువుతో పిల్లల కోసం రచనలు, అనువాదాలు చేసినవారు డా. దేవరాజు మహారాజు.
వీరితో పాటు తెలంగాణ రచయితలలో తోకల రాజేశం, ముత్యబోయిన మలయశ్రీ, తుమ్మూరి రామ్మోహన్‌రావు వంటివారు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి డాక్టర్ బి. దామోదరరావు, వావిలాల భూపతిరెడ్డి, కొండ్ల రామచంద్రం, పిన్నంశెట్టి వసుంధర రవీంద్ర, దూడం నాంపల్లి, యనగంటి మల్లేశం, పుల్లూరి జగదీశ్వర్ రావు, రాకుమార, వాసాల వరప్రసాద్, వాసాల వేంకటేశ్వర్లు, బి.వి. ఎన్. స్వామి, బెజ్జారపు వినోద్ కుమార్, గరిశకుర్తి శ్యామల, శ్రీమంతుల సదానంద్, సామ లక్ష్మారెడ్డి, మాడిశెట్టి గోపాల్ వంటి వారిని పేర్కొనవచ్చు. నిజామాబాద్ జిల్లాలో గెంట్యాల ప్రసాద్, గణపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, కాసర్ల నరేష్ రావు, అమరేశం రాజేశ్వరశర్మ, తల్లావఝుల మహేష్ బాబు, అయాచితం నటేశ్వర శర్మ, సూరారం శంకర్లు బాల సాహిత్య సృజన చేసిన ప్రముఖులు.
వరంగల్ నుండి ఎ.బాబూరావు, వెంకటేశ్వశర్మ, పరశురామ్, ఎస్.రాములు, పి. మీనాక్షి, రాజశేఖరశర్మ వంటి వారు బాల సాహిత్య రచనలో ఉన్నారు. గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ, వలస పైడి, నామని సుజనాదేవి, సి.వి. జయవీరరాజు, మిట్టపల్లి శివాజి, ముఖద్దర్, తన్యాల ఆచార్యులు, వాడపల్లి అజయ్ బాబు వంటి వారు వరంగల్‌లో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బొబ్బిలి జోసఫ్, ఎం. శ్రీనివాస్, ఉర్మిళ్ళ సునంద, పబ్బతి సుమిత్రాదేవి వంటి వారు పిల్లలకోసం రచనలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా బాల సాహితీవేత్తల్లో జి.ఎస్.సాయినాథ్, గంథం నరసయ్య, వోలేటి రాధాకృష్ణమాచార్యులు, అలుగుబెల్లి రామచంద్రరెడ్డి, దొడ్డి రామ్మూర్తి, దుర్గాబాయి, బండారు జయశ్రీ, డా. షేక్ అబ్దుల్ గనీ, డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లను పేర్కొనొచ్చు. డా. దొరవేటి చెన్నయ్య పిల్లల కోసం బూచోడొచ్చాడు, చదివేస్తే చరితార్థులు, ఆచార్య దేవోభవ వంటి రచనలు చేశారు.
సిహెచ్ భాస్కర్ బాలల కోసం రంగారెడ్డి జిల్లా నుంచి రాసిన వారిలో ఒకరు. నందిగామ కిశోర్, గుర్రాల లక్ష్మారెడ్డి, బీంపల్లి శ్రీకాంత్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి పిల్లలకోసం రచనలు చేసిన వారు. ఇతర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారు, హైదరాబాద్ సంబంధించిన వారిలో పిల్లల కోసం రచనలు చేస్తున్న వారు మాడభూషి లలిత, గౌరవరాజు సతీష్, డి.ఆంజయ్య, కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర మొదలగు వారు ఉన్నారు. పిల్లల కోసం రచనలే కాకుండా వారిని ఆవైపు మళ్ళిస్తున్నవారిలో ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు గరిపల్లి అశోక్ ముందు వరుసలో ఉంటారు.

తెలంగాణలో పుట్టి పెరగకున్నా బాలల కోసం తపస్సులాగా రచనలు చేసిన వారెందరో ఉన్నారు. వారిలో అన్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి, రెడ్డి రాఘవయ్య, చొక్కాపు వెంకట రమణ, శ్రీమతి డి. సుజాతాదేవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. రావూరి భరద్వాజ, తురగా జానకీరాణి, చిల్లర భవానీదేవి , పుట్టగుంట సురేష్ కుమార్, జొన్నలగడ్డ రాజగోపాల్ రావు దంపతులు, వాణిశ్రీ, క్రి.శే డా.వేదగిరి రాంబాబు, డా. కందేపి రాణిప్రసాద్, గోవిందరాజు రామకృష్ణారావు, జిన్నలగడ్డ మార్కండేయులు, డి.వి.ఆర్. భాస్కర్, ముదునూరు వెంకటేశ్వరరావు, కైపు ఆదిశేషా రెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు, మాచిరాజు కామేశ్వరరావు, రంగనాధ రామచంద్రారావు, యు.విజయశేఖరరెడ్డి, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, కన్నెగంటి అనసూయ తదితరులున్నారు.

శిక్షణా శిబిరాలు నిర్వహించడం హర్షనీయం

బాలల కోసం రాసే ఏ రచనైనా బాలసాహిత్యమే. బాలల కోసం రాసే సైన్సు వ్యాసాలు, ఫజిల్స్, సూక్తులు, మంచిమాటలు, ఏకపాత్రాభినయాలు, సాంఘీక, చారిత్రక విశేషవ్యాసాలు, దేశనాయకుల కథనాలు, దేవతల, దేవుల్ల విశేషాలు, జంతు, పక్షుల, మొక్కల, వృక్షాల వివరాలు ఏదైతేనేం.. బాలల కోసం రాసేదంతా బాలసాహిత్యమే. డాక్టర్ రావూరి భరద్వాజ కాదేదీ కథకు అనర్హమంటూ నీటి కథ, నిప్పు కథ,బొగ్గు కథ. చీమ కథ, ఉడుత కథ అంటూ మనచుట్టూ ఉండే అనేక వస్తువులని బాలలకు పరిచయం చేశారు. బాలలు తమకోసం తామే సృష్టించుకుంటున్న సాహిత్యం కూడా బాలసాహిత్యమే. నేడు బాలలు తాము రాసిన బాలసాహిత్యాన్ని పుస్తకాలరూపంలో తీసుకురావడం హర్షనీయం. బాలోత్సవ్ కార్యక్రమాల ద్వారా, తెలంగాణ సాహిత్య అకాడమీ సహకారంతో పలు సాహితీసంస్థలు జిల్లా, మండల స్థాయి బాలలకు బాలసాహిత్య రచనలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ బాలసాహిత్య వారసులను సంపాదించుకుంటున్నాం.

పైడిమర్రి రామకృష్ణ కోశాధికారి – బాలసాహిత్య పరిషత్

బాల సాహిత్యం వికాసం చెందాలి

ఏ దేశంలో సమృద్ధిగా బాల సాహిత్యం వికాసం చెంది వర్దిల్లదో, ఆ దేశ ఉజ్వల భవిష్యత్తును కలగనలేం. ఏ జాతి బాలలను విస్మరిస్తుందో ఆ జాతి ఎదుగుదలను ఊహించలేం. అలాగే, పిల్లలకు పుస్తకాలు అందని లోకాన్ని కూడా కలగనలేం. ఊహించలేం. బాల్యం నుండి మంచి సాహిత్యాన్ని అందిస్తే ఆ బాల్యం భవిష్యత్తులో చక్కని దేశాన్ని, భవిష్యత్తును నిర్మిస్తుంది. బడి, గుడి, చర్చి, మసీదు ఏదైనా కావచ్చు. అక్కడికి వచ్చే బాల బాలికల కోసం ఆధ్యాత్మిక సంపదతో పాటు చక్కని సాహిత్యాన్ని అందుబాటులో ఉంచితే అది ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. పిల్లలున్న ఇండ్లల్లో తినుబండారాలకు కొదవ ఉండదు, మరి బాల సాహిత్యం విషయంలో ఆ పద్ధతిని ఎందుకు పాటించకూడదు.

ఎదుగుతున్న తరానికి సమృద్ధిగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు డాక్టర్లను సంప్రదిస్తాం, వాళ్ళ సలహాల మేరకు ఆహారాన్ని అందిస్తాం. అదేవిధంగా పుస్తకాలను అందించాల్సిన బాధ్యత తల్లితండ్రులుగా, సామాజికులుగా మనకు ఉంది. అప్పుడే శారీరకంగానే కాక మానసికంగా పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇవాళ ప్రతి సృజనాత్మక, వైజ్ఞానిక రచనను, విషయాలను, వస్తువులను తెలిపే రచనను బాల సాహిత్యంగా చెబుతున్నాం. నిజానికి బాలల కోసం సృష్టిస్తున్న సాహిత్యం క్షమతా పూర్ణంగా, స్వభావ పూర్ణంగా ఉండాలి. బాలల ఆకాంక్షలకు అనుగుణంగా, సమస్యలకు సమాధానంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం వాళ్ళకు నచ్చుతుంది. ఆ దిశగా తెలుగులో బాల సాహిత్యం వికాసం చెందాల్సి ఉంది.

డా. పత్తిపాక మోహన్ బాల సాహితీవేత్త & తెలుగు సంపాదకులు నేషనల్ బుక్ ట్రస్ట్,
మధుకర్ వైద్యుల….