• గాంధీ వైరాలజీ ల్యాబ్‌ పరీక్షలో వెల్లడి
  • 48 గంటల తర్వాత మళ్లీ నమూనాల సేకరణ
  • తుది నిర్ధారణకు పుణె ల్యాబ్‌కు.. అక్కడా ‘నెగెటివ్‌’ వస్తే డిశ్చార్జి
  • నిలకడగా ఆరోగ్యం, అదుపులో జ్వరం

అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మార్చి : రాష్ట్రంలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడి (24) తాజా శాంపిల్స్‌ నెగెటివ్‌ అని వచ్చాయి. మరోసారి నిర్ధారణకు అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు.

ఈ క్రమంలో బాధితుడి జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది. తాజాగా న్యూమోనియా తగ్గుముఖం పట్టడంతో నమూనాలు తీసి గాంధీ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నెగెటివ్‌ అని తేలడంతో ఆసుపత్రి వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. 48 గంటల అనంతరం నమూనాలు సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. అక్కడినుంచి నివేదిక నెగెటివ్‌ అని వస్తే సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేసే అవకాశముంది. ఇంటికి పంపినా 14 రోజులు ఐసోలేషన్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించనున్నారు. కరోనా లక్షణాలతో సోమవారం 11 మంది రాగా.. నమూనాలు సేకరించారు. సోమవారం ఎయిర్‌పోర్టులో 3,517 మందికి స్ర్కీనింగ్‌ చేశారు. 51 మందికి అనుమానిత లక్షణాలు గుర్తించగా, 40 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు.

మరో రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేయండి
కరోనాను నిర్ధారించేందుకు రాష్ట్రంలో మరో రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సోమవారం వైరస్‌ నియంత్రణ చర్యలపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ రాష్ట్రాల సీఎ్‌సలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పలు విజ్ఞప్తులు చేశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు థర్మల్‌ స్కానర్స్‌ ఏర్పాటు చేయాలని, ఎన్‌95 మాస్కులను పంపాలని కోరారు.

హెల్ప్‌ డెస్క్‌లో నిర్లక్ష్యం
కరోనా అనుమానిత లక్షణాల పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక నోడల్‌ కేంద్రం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి రోజూ పదుల సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, ఎవరిని కలవాలి? వైద్యం ఎక్కడ అందుతుందన్నది వారికి తెలియడం లేదు. హెల్ప్‌ డెస్క్‌నుంచి కూడా వారికి సమాచారం అందడం లేదు. దూరప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Courtesy Andhrajyothi