•  సీఏఏను రద్దు చేయాలి.. కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం
  • అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని నిర్ణయం
  • 24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
  • ప్రతి వార్డుకూ ప్రత్యేక అధికారి నియామకం
  • విధివిధానాల ఖరారుకు రేపు మునిసిపల్‌ సదస్సు
  • రాజీవ్‌ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి
  • వడ్డీ లేని రుణం తదితర పథకాలపై సమీక్ష
  • వేలం ద్వారా రాజీవ్‌ స్వగృహ ఇళ్ల అమ్మకం
  • బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త సవరణ బిల్లు
  • అభయ హస్తంపై సమీక్ష.. బాధ్యత హరీశ్‌కు

హైదరాబాద్ : భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపవద్దని రాష్ట్ర మంత్రి మండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అన్ని మతాలనూ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఏఏ, పట్టణ ప్రగతి నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రమాదంలో పడేసేలా ఉందని, కాబట్టి దాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ తరహాలోనే రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. అలాగే.. 24వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. విధివిధానాల ఖరారుకుమంగళవారం (ఫిబ్రవరి 18) బేగంపేటలోని ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి మునిసిపల్‌ సదస్సును నిర్వహించనున్నారు. రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థకు పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణాల్లో పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధంగా ప్రగతి జరగాలని పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సేవలు అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని చెప్పారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అభినందించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు..

పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నాహకంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో.. మేయర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహణ. అందులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌, శ్మశాన వాటికల సందర్శనకు తీసుకెళ్లాలి.

వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతి వార్డుకూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి. ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియను వచ్చే ఐదు రోజుల్లో పూర్తిచేయాలి.

జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. పనులకు నిధుల కొరత ఉండదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించాలి.

పట్టణ ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యదిక ప్రాధాన్యం ఇవ్వాలి. డ్రైనేజీలు శుభ్రం చేయాలి. మురికి గుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు,పట్టణాల్లో స్థలా లు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందుకోసం గ్రామాలను ఎంపిక చేయాలి.

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి.

పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలు పూర్తిగా పూడ్చేయాలి. దహన/ఖనన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి. పొదలు, మురికి తుమ్మలను నరికి వేయాలి. వెజ్‌/నాన్‌ వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలి. క్రీడాప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌ లు ఏర్పాటు చేయాలి. డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ నిర్మించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. వీఽధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించే వరకూ వారిని ఇబ్బంది పెట్టవద్దు. పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేయాలి.

పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగు పరచడానికి ఆధునిక పద్థతులను అవలంబించాలి. ప్రమాదరహిత విద్యుత్‌ వ్యవ స్థ ఉండాలి. ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలి.

తెలంగాణ లోకాయుక్త చట్టం సవరణ కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్‌ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అభయహస్తంపై సమీక్ష బాధ్యత హరీశ్‌కు
రాజీవ్‌ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్నంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్‌ రావు, ఐఏఎస్‌ అధికారి సందీప్‌ సుల్తానియాలకు అప్పగించింది. రెండున్నరేళ్లుగా అభయహస్తం పథకాన్ని నిలిపివేయడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అలాగే.. రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్‌ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది.

Courtesy Andhrajyothi