• ఆదాయం తగ్గడంతో సవరణకు నిర్ణయం..
  • లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న పలు రంగాలు
  • ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం 55 వేల కోట్లే
  • ఇందులో 24 వేల కోట్లు అప్పులు తెచ్చినవే
  • ఖర్చు చేసింది 53 వేల కోట్లు
  • మిగిలిన 6నెలల్లోనూ ఆదాయం పెరిగేది డౌటే
  • 1.30 లక్షల కోట్లకు బడ్జెట్‌ను కుదించే యోచన

హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌ స్వరూపం మారబోతోంది. బడ్జెట్‌లో అంచనా వేసిన నిధుల్లో సుమారు రూ.50 వేల కోట్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్‌ కారణంగా అంచనా మేరకు ఆదాయం రాకపోవడం.. ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను సవరించాలని సర్కారు భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను రూ.1.82 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే మొదటి ఆరు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఈ బడ్జెట్‌ అంచనాలను అందుకోవడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌లో మార్పులకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఈ ఏడాది మొదట్లోనే లాక్‌డౌన్‌ అమలు వంటి చర్యల కారణం గా పలు రంగాలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ ఇంకా కొన్ని రంగాలు ఆర్థికంగా కోలుకోలేకపోతున్నాయి.  ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 55,782 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఇందులో రూ.24,719 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకున్న నిధులే. అంటే ఆదాయంలో 40 శాతానికి పైగా అప్పుల ద్వారా వచ్చినవే ఉన్నాయి. మరోవైపు ఈ 6 నెలల్లో రూ.53,313 కోట్ల నిధులను ఖర్చు చేశారు.

ఇంకా 50-70 వేల కోట్ల రాబడి అంచనా
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల్లో ఇంకా రూ.50 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల మేర ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. అయినా.. మొత్తం బడ్జెట్‌ రూ.1.30 లక్షల కోట్లకే పరిమితం కానుంది. అంటే.. అసెంబ్లీ ఆమోదించిన రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌లో కనీసం రూ.50 వేల కోట్లను తగ్గించుకోవాల్సి ఉం టుంది. మొదటి 6 నెలల్లో రుణాలను ఎక్కువగా తీసుకున్నందున.. వచ్చే ఆరు నెలల్లో ఆ మేర రుణాలను తీసుకోవాలంటే సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 5 శాతానికి పెంచడంతో.. ఆ వెసులుబాటును ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభు త్వం రుణాలను తీసుకుంటోంది. మరోవైపు భూము ల విక్రయం ద్వారా రూ.30 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని బడ్జెట్‌లో నిర్ణయించగా.. ఇప్పటివరకు ఈ రూపంలో ఎలాంటి ఆదాయం రాలేదు.  దాంతో బడ్జెట్‌ అంచనాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. అయితే బడ్జెట్‌ను తగ్గించుకోవడం ద్వారా వివిధ రంగాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. రైతుబంధు, పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులను చెల్లించాల్సి ఉంది. దాంతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ.10 వేల కోట్లకు పైగా ఉన్నాయి.

Courtesy Andhrajyothi