తీవ్ర వర్షాభావంతో కోరలు చాస్తున్న కరవు
ఉత్తర, దక్షిణ తెలంగాణల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధులు
మంగమూరి శ్రీనివాస్‌, వి. ఫల్గుణాచారి

రుతుపవనాలు వస్తున్నాయనగానే అందరికంటే ఆతృతగా ఎదురుచూసేది రైతన్నలే. ఈసారి సాధారణ వర్షపాతమే కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించగానే కోటి ఆశలతో నైరుతి కోసం ఎదురు చూసిన రైతన్నకు ఇప్పుడు దిక్కుతోచడంలేదు. ఆకాశంలో కనిపించి మురిపించే మేఘం చుక్క నీరు రాల్చకుండానే తరలిపోతోంది.. పైగా రెండో ఎండాకాలమా? అనిపించేలా ఎండ విరగగాస్తోంది. రాష్ట్రంలో వర్షపాతం లోటు 38 శాతానికి పెరిగింది. కొన్ని మండలాల్లో ఏకంగా 90 శాతం వరకూ నమోదైందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఎండిపోయిన బోర్లు.. బీడువారిని చెరువులు.. నెర్రలు విచ్చిన పొలాలు.. చినుకు మీద ఆశతో వేసిన కొద్దిపాటి పైర్లూ ఎండిపోయి అన్నదాత కుదేలవుతున్నాడు. సాగు విస్తీర్ణం ఏకంగా 3.38 లక్షల హెక్టార్లు తగ్గిపోయినట్లు అంచనా. ఇది రైతు కూలీల ఉపాధి మీదా ప్రభావం చూపిస్తోంది.. రాష్ట్రంలో అచ్చంగా కరవు తాండివిస్తోంది. పొలం పనులతో కళకళలాడాల్సిన గ్రామాలు నీరు లేక నీరుగారిపోయి నిస్తేజంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంపై కరవు మేఘం ఉరుముతోంది.. సాళ్లు దున్ని విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న కర్షకులు కొందరైతే.. వాన పడితే విత్తుదామని ఎదురుచూస్తున్న అన్నదాతలు మరికొందరు. చినుకుజాడ లేక.. నీటి ఊట రాక.. నాగేటి సాలల్లో రైతన్నల కన్నీటి చెమ్మ దర్శనమిస్తోంది. కాలం ఇలాగే కొనసాగితే.. పంట కోసం చేసిన అప్పులు తలకు మించిన భారమవుతాయన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడైనా వస్తుందో రాదోనన్న సంశయం వెంటాడుతోంది. ‘ఈనాడు’ ప్రతినిధులు ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పలు జిల్లాల్లో పర్యటించగా.. అన్నదాతల కష్టాలు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. ఇకనైనా జోరుగా వానలు పడితేనే సాగు.. కొనసాగుతుందని.. లేకుంటే పరిస్థితి ‘చేను’దాటిపోతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

38 శాతానికి చేరిన వర్షపాతం లోటు

కరవు విస్తరించేలా పెరుగుతున్న వర్షాభావ పరిస్థితులు రైతు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలన్నర దాటినా చినుకు జాడ లేకపోవడంతో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. కొత్తగా పంటల సాగుకు కాలం తీరుతోంది. వేసిన కొద్ది పంటల మొలకలూ వాడిపోతున్నాయి. గత నెల 1 నుంచి బుధవారం వరకూ రాష్ట్ర సాధారణ వర్షపాతం లోటు 38 శాతానికి చేరింది. పలు మండలాల్లో 90 శాతం వరకూ ఉంది.
* మొత్తం 33 జిల్లాలకు గాను ఒక్కటంటే ఒక్క జిల్లాలోనైనా వందశాతం (సాధారణ) వర్షపాతం లేదు.
* కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణంకన్నా 13 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. మిగతా 31 జిల్లాల్లో లోటు అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ బుధవారం విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది.
* అత్యధికంగా ఖమ్మంలో 64, నల్గొండలో 63 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం లోటు 60 శాతానికి మించితే కరవు పరిస్థితులున్నట్లు పరిగణిస్తారు.

తగ్గిన సాగు..
* వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 22.65 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ ఇంతకన్నా 3.38 లక్షల హెక్టార్లు తక్కువగా సాగైనట్లు వ్యవసాయశాఖ తాజా నివేదికలో తెలిపింది. ఏ ఒక్క పంటా వందశాతం విస్తీర్ణంలో సాగవలేదు.
* ప్రత్యామ్నాయ పంటల విషయంలో రైతులు ఆసక్తి చూపడం లేదు.

ఎక్కడ చూసినా ఏ‘కరవే’..

* ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో మొత్తం 6 కొత్త జిల్లాలున్నాయి. వీటి పరిధిలో వరి నార్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఇప్పటికే పోసిన నార్లు నీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాధార భూముల్లో పత్తి అధికంగా వేస్తున్నారు. కానీ నీరు లేక పలుచోట్ల ఎండుముఖం పట్టింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల చెరువులుంటే సగానికి సగం చుక్కనీరు లేక ఎండిపోయాయి.
* పెద్దపల్లి జిల్లాలో అతి పెద్దదైన 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 4.85 టీఎంసీల నీరుంది. ఇవి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకే సరిపోవని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం 1,188 జలాశయాల్లో 30 శాతం మేర కూడా నీళ్లు లేవు. పెద్దపల్లి జిల్లాలోని చివరి ఆయకట్టు మండలాలైన ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌లలో సాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి.
* రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అత్యంత ఎక్కువగా 64 శాతం లోటు వర్షపాతం ఉంది. కూసుమంచి, పాలేరు, ఖమ్మం గ్రామీణం, ములకలపల్లిలలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే అన్నిచోట్లా విత్తనాలు నాటి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులే ఉన్నారు.
* రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలంలో 75 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్నవి కూడా పావు ఇంచు మందమైనా నీళ్లు పోయడం లేదు. నార్లు పోసుకున్నప్పటికీ బోర్లలో నీళ్లు లేక.. వర్షాలు కురవక ఎండిపోతున్నాయి. ఈ మండలంలో 87 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

సోయాచిక్కుడు, మినుము, పెసర, వేరుసెనగ వంటి అనేక పంటల సాగుకు కాలం తీరిందని.. ఈ సీజన్‌లో ఇక వర్షాలు పడినా వాటిని వేయొద్దని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్‌ చెప్పారు. వరిలో కూడా సాంబ మసూరి వంటి దీర్ఘకాలం సాగయ్యే విత్తనాలు వేయవద్దని సూచించారు. జొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, సజ్జ, రాగులు వంటి ఆరుతడి పంటలను, ఇతర పంటల స్వల్వకాలిక వంగడాలను మాత్రమే ఇక వేయాలని రైతులకు సూచిస్తూ వ్యవసాయ శాఖ, జయశంకర్‌ వర్సిటీ ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేశాయి.

చినుకు కోసం ఎదురుచూస్తున్న చెరువు….

ఇది వికారాబాద్‌ జిల్లా కేంద్రం శివారులో 174 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శివారెడ్డిపేట చెరువు. దీని నుంచి వికారాబాద్‌ మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు ఇవ్వాలి. కానీ, ప్రస్తుతం ఇందులో చుక్కనీరు లేదు. ఈ జిల్లాల్లో 1206 చెరువులుంటే అన్ని చోట్లా ఇలా ఎండిపోయి కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీరు లేక తాగు, సాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్దెర తీసుకొచ్చాం
చౌహాన్‌ చందర్‌, జీజాబాయి, గుండూర్‌, నిజామాబాద్‌ జిల్లాగతేడాది మినుము సాగు చేశాం. ఈ సారి రెండెకరాల్లో పత్తి వేశాం. ఎండలకు మొక్కలన్నీ వాడిపోతున్నాయి. ఎరువులు, విత్తనాలు ఉద్దెర తీసుకొచ్చాం. పంట పండకపోతే అప్పులు తీర్చేందుకు పిల్లల్ని
పనులకు పంపించక తప్పదు.
పొలాన్ని వదిలి రాళ్ల పనికి వెళ్తున్నాయాదయ్య, రైతు, కైతాపూర్‌, చౌటుప్పల్‌ మండలం, యాదాద్రి జిల్లా

నాకు అర ఎకరా భూమి ఉంది. వర్షాలు లేక నారు కూడా పోయలేదు. వాన వస్తుందేమో దుక్కి సిద్ధం చేసుకోవాలనుకుని ఇన్నాళ్లూ ఎదురుచూశా. ఇక పొలంలో అడుగేసి ఏం లాభం అనుకుని పొట్ట కూటి కోసం రాళ్లపనికి పోతున్నా. ఈ ఏడు ఇలా కాలం వెళ్లదీయాల్సిందే.

వర్షం పడుతుందన్న ఆశతోపంతులు నాయక్‌, సిరికొండ, సూర్యాపేట జిల్లా

తొలకరిలో దుక్కులు దున్ని ఎకరంనర విస్తీర్ణంలో తొందరపడి పత్తి సాగు చేశా. మొలకలు వచ్చాక వర్షాల జాడలేదు. రెండు రోజుల నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. దీంతో మొక్కలు ప్రాణం పోసుకుంటాయని 20-20, యూరియా కలిపి వేస్తున్నాం. ఇవి వేశాక కూడా వర్షాలు అవసరమే. వానదేవుడు ఏం చేస్తాడో ఏమో.

పత్తి గింజలు మాడి పోయాయివీరబాబు, కాచిరాజుగూడెం, ములకలపల్లి మండలం, ఖమ్మం జిల్లా

న్నడూ లేనంత నష్టం ఈ ఏడాది జరిగింది. మొదట కొద్ది వర్షం కురవగానే పత్తి విత్తాను. ఆ తర్వాత ఎండలకు అవి మాడిపోయాయి. మళ్లీ వర్షం కురిసిందని విత్తినా లాభం లేకుండా పోయింది. మరో ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించలేదు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నా. దాదాపు రూ.50 వేల వరకు నష్టపోయా.

బోరు నుంచి గంటసేపే నీరుశ్రీనివాస్‌, రైతు, మల్కాపూర్‌, కరీంనగర్‌ జిల్లా

బోరు నుంచి గంట మాత్రమే నీరు వస్తోంది. తొలుత మూడెకరాల్లో నాట్లు వేసేందుకు సిద్ధమైనా.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నా. ఏం చేస్తాం ఎకరంలోనే నాట్లు వేసుకుంటాం.

(ఈనాడు సౌజన్యంతో)