రైతుబంధు, బీమా వర్తించక…
ఆర్థిక కష్టాల్లో కుటుంబాలు
తెలంగాణలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు
ఆత్మహత్యల్లో అత్యధికం కౌలుదార్లే

సూర్యాపేట జిల్లా భక్తలాపురం గ్రామానికి చెందిన బి.భద్రయ్య ఓ కౌలు రైతు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమి కుటుంబ పోషణకు సరిపోదని, కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. చేసిన రూ.5 లక్షలు అప్పు గుదిబండగా మారగా, వ్యవసాయం గిట్టుబాటుగాక…ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది జరిగి 5 ఏండ్లు అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందక ఆ కుటుంబం నేడు దిక్కూమొక్కూ లేకుండా నిలబడింది. ‘మాకు పైసా కూడా సాయం అందలేదని కన్నీరు పెట్టుకుంటున్న భద్రయ్య భార్య సైదమ్మ గోడు వినేవారే లేరు. తెలంగాణవ్యాప్తంగా ఇలాంటి కన్నీటి గాథలెన్నో ఉన్నాయని జాతీయ ఆంగ్ల మీడియా రాసిన తాజా వార్తా కథనం ఇది.

న్యూఢిల్లీ : రైతు ఆత్మహత్యలపై గణాంకాల్ని విడుదల చేయకుండా మోడీ సర్కార్‌ రెండుమూడేండ్లు తాత్సారం చేసింది. 2017, 2018 లెక్కల్ని 2019లో విడుదలచేసింది. రైతు ఆత్మహత్యల సంఖ్యను సాధ్యమైనంత తక్కువగా చూపాలన్న ప్రయత్నం ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ (ఎన్‌సీఆర్‌బీ) రూపొందించిన గణాంకాల్లో కనపడింది. ఈ గణాంకాల ప్రకారం చూసుకున్నా, దేశంలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలబడటం ఆందోళన కలిగించే అంశం. అంతేగాక కౌలు రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా తెలంగాణలో జరిగాయన్న విషయం బయటకొచ్చింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణలో 2017లో 846మంది, 2018లో 900మంది రైతు ఆత్మహత్యలు జరిగాయి. మహారాష్ట్ర , కర్నాటకల తర్వాత అత్యధిక సంఖ్యలో రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో 2017లో 2239మంది, 2018లో 2426 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నాటకలో 2017లో 1365మంది, 2018లో 1157మంది ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై వాస్తవాల్ని అంగీకరించే పరిస్థితి లేదనీ, ‘రైతు బీమా’ పథకం తీసుకొచ్చినా బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేకపోయారనీ ‘రైతు స్వరాజ్య వేదిక’ కార్యదర్శి బి.కొండల్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. బీమా పథకం కౌలు రైతులకు వర్తించకపోవటం పెద్ద లోపమని అన్నారు. మీడియా కథనాల ప్రకారం…2014 తర్వాత 4వేల మంది రైతు ఆత్మహత్యలు జరిగాయని కొండల్‌ రెడ్డి తెలిపారు. ఇందులో 1808 ఆత్మహత్యలకు నష్టపరిహారం ఇస్తామని ముగ్గురు సభ్యుల కమిటీ ప్రకటించిందనీ, కేవలం 389 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకున్నారనీ ఆయన చెప్పారు. మళ్లీ దీనిపై పదే పదే డిమాండ్‌ చేయగా, అక్టోబరు 2017లో మరో 457 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిందన్న విషయాన్ని కొండల్‌రెడ్డి గుర్తుచేశారు.

న్యాయ పోరాటం చేస్తేగానీ ఇవ్వలేదు : కొండల్‌ రెడ్డి
రైతు ఆత్మహత్యల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని నల్లగొండ జిల్లాలో ‘రైతు స్వరాజ్య వేదిక’, మానవ హక్కుల ఫోరం,తెలంగాణ రైతు సంఘాలు ఎడతెగని పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ అధికారులు అనేక ఏండ్లుగా విషయాన్ని నాన్చుతూనే గడిపారు. చివరికి మేం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 243 బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందజేస్తామని ప్రభుత్వ యంత్రాంగం అంగీకరిం చిందన్న విషయం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కోర్టు తీర్పుతో వారికి నష్టపరిహారం అందింది. ఈ తరహా ఉదా హరణలు మంచిర్యాల, యాదాద్రి…ఇలా అనేక జిల్లాల్లో ఉన్నాయి. రైతు ఆత్మహత్యల్లో 80శాతం కౌలుదార్లవే ఉంటు న్నాయి. వీళ్ల కుటుంబాల్ని పట్టించుకునే నాథుడే లేడు.

బి. సైదమ్మ (సూర్యాపేట) ఆమె ఇద్దరు కుమార్తెలతో..
ఈ దేశంలో మొత్తం సాగు భూమిలో 70శాతం కౌలుదార్లు సాగు చేసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం(సామాజిక ఆర్థిక) 50శాతం గ్రామీణ కుటుంబాలకు స్వంత పంట భూములు లేవు. భూ సంస్కరణలు కాగితాలకే పరిమితం కావటంతో…కోట్లాది మంది వ్యవసాయదారులు కౌలుదార్లుగా మిగిలిపోవాల్సి వస్తోంది. భూమిపై హక్కులు లేక (టైటిల్‌ డీడ్స్‌) బ్యాంకు రుణాలు, రైతు బీమా వంటి పథకాలకు నోచుకోవటం లేదు. రైతు బంధుగానీ, రైతు బీమాగానీ కౌలుదార్లకు వర్తించదని, వాళ్ల సంగతి తమకు అక్కర్లేదన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈనేపథ్యంలో కౌలుదార్ల ఆర్థికసామాజిక స్థితిగతులు మరింత దిగజారాయి.

Courtesy Nava Telangana