• నల్లమలలోనే కాదు.. రాష్ట్రమంతటా
  • శాసనసభ ఏకగ్రీవ తీర్మానం..
  • ప్రవేశపెట్టిన కేటీఆర్‌..
  • శాసన సభ ఆమోదం
  • కేంద్రం ఒత్తిడి తెస్తే సంఘటితంగా ఎదుర్కొందాం: పార్టీలకు కేటీఆర్‌ పిలుపు

నల్లమలతోపాటు రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలు జరపరాదని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. తవ్వకాలు జరపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచనతో పురపాలక, మైనింగ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తొలుత, నల్లమలకే తీర్మానాన్ని పరిమితం చేశారు. కానీ, రాష్ట్రమంతటా యురేనియం తవ్వకాలు జరపరాదని తీర్మానం చేయాలంటూ భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్‌ సభ్యులు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క ఆందోళన చేశారు. ఈ సమయంలో భట్టి, శ్రీధర్‌బాబు వద్దకు వచ్చి మంత్రి కేటీఆర్‌ కాసేపు చర్చించారు. అనంతరం స్పీకర్‌ శ్రీనివాస్‌ రెడ్డికి సూచనలు చేశారు. చివరికి, ప్రశ్నోత్తరాల అనంతరం నల్లమలపై; జీరో అవర్‌ అనంతరం రాష్ట్రమంతటా యురేనియం తవ్వకాలు జరపవద్దని తీర్మానాలు చేశారు. జీవ వైవిధ్యానికి నెలవైన నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తీర్మానంలో పేర్కొన్నారు. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యమై, మనిషి జీవితం నరకప్రాయం అవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయని, తెలంగాణలో తవ్వకాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వారి ఆందోళనలతో అసెంబ్లీ ఏకీభవిస్తోందని వివరించారు. యురేనియం తవ్వకాలను జరపాలనే యోచనను విరమించుకోవాలని తీర్మానాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి: కేటీఆర్‌: రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. యురేనియం అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్ర చట్టం ప్రకారం దేశంలోఎక్కడైనా అన్వేషణ జరిపే అధికారం కేంద్రానికి ఉంది’’ అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అటవీ ప్రాంతంలో అన్వేషణకు రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ కమిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో యురేనియం మైనింగ్‌కు, అన్వేషణకు ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్వేషణ జరిగినా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అలాంటిదేం లేదన్నారు. భవిష్యత్తులోనూ ఎటువంటి అన్వేషణ, మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు. ‘‘ఇవ్వం.. ఇవ్వలేం.. ఇవ్వబోం. ఒకవేళ రాష్ట్రంపై ఒత్తిడి తెస్తే అన్ని పార్టీలు కలిసి సమష్టిగా పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు.

 అన్వేషణను అడ్డుకోవాలి భట్టి : యురేనియం అన్వేషణ, మైనింగ్‌పై తెలంగాణలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తవ్వకాలు జరుపుతున్నారని, బోర్లు వేస్తున్నారని, వీటిని ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘‘నల్లమలతోపాటు ఇతర ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు జరపకుండా తీర్మానం చేయాలని కోరాం’’ అని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రీ అన్నారు.

Courtesy Andhrajyothi…