సాగు భూములకు ఉరేస్తున్న స్థిరాస్తి వ్యాపారం.. భారీగా కొని బీడుగా వదిలేస్తున్న వ్యాపారులు
చేను చెదురుతోంది!
రాష్ట్రంలో వ్యవసాయ భూమి: 1.42 కోట్ల ఎకరాలు
సాగేతర రంగాలకు మళ్లినది: 22.23 లక్షల ఎకరాలు
గత పదేళ్లలో మళ్లింది: 11.95 లక్షలఎకరాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగు భూముల స్వరూపం వేగంగా మారిపోతోంది. ఒకవైపు సాగునీటి వనరులు అందుబాటులోకి వస్తున్న ప్రాంతాల్లో సేద్యం బాగుపడుతుండగా.. మరోవైపు జాతీయ రహదారులు, నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల శివారుల్లోని వ్యవసాయ భూములు సాగేతర రంగాలకు మళ్లుతున్నాయి. రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో దాదాపు 11.95 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది. భూదస్త్రాల నవీకరణ సందర్భంగా ఈ విషయం రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చింది. పంట భూములను వ్యవసాయేతర రంగాలకు మళ్లించే విషయంలో నిబంధనలు పాటించాలని, భూములను రక్షించేందుకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ ఆహార భద్రత చట్టం సూచిస్తోంది.

బీళ్లుగా మారడానికి కారణాలు ఇవే
* ఒకేసారి భారీగా సొమ్ము వస్తుందన్న ఆశతో ఎక్కువమంది రైతులు తమ భూములను విక్రయానికి పెడుతున్నారు.
* బోర్లు అడుగంటిపోవడం, సాగు లాభసాటిగా లేదనేది కొన్ని కారణాలైతే.. మైదాన ప్రాంతాల్లో పంటలను రక్షించుకోవడం కష్టంగా మారిందని కొందరు రైతులు చెబుతున్నారు. సేద్యం చేసేవారు తగ్గిపోతుండడం మరో కారణం.
* హైదరాబాద్‌ చుట్టూ ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని వ్యవసాయ భూములు ఎకరా రూ.కోట్లలో పలుకుతుండటంతో రైతులు విక్రయించేస్తున్నారు.
* నగరం విస్తరిస్తుండటం, పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో భూముల ధరలు పెరుగుతాయన్న నమ్మకంతో ఎక్కువ మంది స్థలాలు కొంటున్నారు.
* నగదును బ్యాంకుల్లో జమ చేయకుండా, చేతిలో ఉంచుకోకుండా ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు.

ఇటు పంట.. అటు బీడు
చేను చెదురుతోంది!
ఒకవైపు వేరుశనగ పంట మరోవైపు ప్లాట్లుగా మారి బీడుగా మారి కనిపిస్తున్న ఈ భూమి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోనిది. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారి పక్కనే భూములు ఇలా ప్లాట్లుగా మారిపోతున్నాయి. మిడ్జిల్‌ మండలంలో 36 వేల ఎకరాల సాగు భూమి ఉండగా కొద్దికాలంలో మూడు వేల ఎకరాలు వ్యవసాయేతర రంగంలోకి మారిపోయాయి. జాతీయ రహదారి వెంట ఉన్న శంషాబాద్‌, కొత్తూరు, షాద్‌నగర్‌, మిడ్జిల్‌, భూత్పూరు, దేవరకద్ర, కొత్తకోట, పెబ్బేరు, గద్వాల, అలంపూర్‌, మానవపాడు మండలాల్లో వేలాది ఎకరాల సాగు భూమి ప్లాట్లుగా మారింది. కరీంనగర్‌, విజయవాడ, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ రహదారుల వెంబడి వేలాది ఎకరాల్లో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన హద్దు రాళ్లు బీడు భూముల్లో దర్శనమిస్తున్నాయి.

Courtesy Eenadu…