వనపర్తి : మాస్టారు రూపంలో ఐదో తరగతి బాలికలకు నరకం చూపాడో దుర్మార్గుడు. గురుకుల శిక్షణ పేరుతో అభంశుభం తెలియని పిల్లలను తన ఇంటికి పిలిపించుకొని మద్యం మత్తులో రోజుకు ఒకరిపై అత్యాచారానికి తెగబడ్డాడు. వరుసగా మూడేళ్లపాటు మూడు బ్యాచ్‌ల విద్యార్థినులపై దారుణానికి తెగబడ్డాడు. ఇన్నాళ్లుగా అతడికి భయపడి మౌనంగా ఉన్న బాలికల్లో కొందరు ధైర్యం చేసి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో అతడి వికృతచేష్టలు బయటి ప్రపంచానికి తెలిశాయి.

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసింది. ఐదో తరగతి పిల్లలకు గురుకుల కోచింగ్‌ ఇస్తానంటూ నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండ లం పెద్దాపురానికి చెందిన శరత్‌, ఊర్లోని ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల క్రితం చేరాడు. విద్యార్థులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు బోధించేవాడు. బోధన అన్నమాటే గానీ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉండేవాడు. ఆ మత్తులోనే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్నాడు.

ఈ విద్యా సంవత్సరం అతడి వద్ద పది మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా ప్రతిరోజు ఒకరిపై అత్యాచారం చేస్తున్న విషయం వెలుగులోకొచ్చింది. కోపోద్రిక్తులైన గ్రామస్థులు, పాఠశాల ప్రిన్సిపాల్‌ రామస్వామిని నిలదీయగా నిందితుడు కొల్లాపూర్‌లో ఓపెన్‌ డిగ్రీ పరీక్ష రాసేందుకు వెళ్లాడని బదులిచ్చాడు. కొందరు గ్రామస్థులు కొల్లాపూర్‌ వెళ్లి శరత్‌ను గ్రామానికి తీసుకొచ్చి చితకబాదారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Courtesy Andhrajyothi