Image result for మృగాళ్ల మధ్య భయమేస్తోంది.. రివాల్వర్‌ ఇవ్వండి"వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను లైసెన్స్‌ కోరిన ఓ అధ్యాపకురాలు

 వరంగల్‌: హైదరాబాద్‌ శివార్లలో మహిళలపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనల నేపథ్యంలో ఓ అధ్యాపకురాలు తీవ్ర భయాందోళనలకు లోనై, తనకు రివాల్వర్‌ లైసెన్స్‌ మంజూరు చేయాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ను కోరారు. ఆమె ఈమేరకు కమిషనర్‌కు శనివారం ఓ లేఖ రాశారు.
‘‘నేను ఖమ్మంలోని డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా ప్రతిరోజూ ఉదయం వరంగల్‌ నుంచి ఖమ్మం వెళుతున్నాను. తాజాగా ఆడవారిపై జరిగిన దాడులతో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఉదయం బయలుదేరి, మళ్లీ అర్ధరాత్రి తిరిగి రావాల్సి వస్తోంది. నవంబరు 28న వరంగల్‌లో యువతి హత్య జరిగిన ప్రాంతం మా ఇంటికి సమీపంలోనే ఉంది. ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణిస్తాను. ఈ ఘటన తర్వాత నేను ఇంటికి సురక్షితంగా వస్తానా అన్న భయం ప్రతిరోజూ వెంటాడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్‌ చేసినా, మొబైల్‌ యాప్‌ ద్వారా తక్షణ సాయం కోరినా క్షణాల్లో పోలీసులు రక్షిస్తారని నేను నమ్మడం లేదు. పోలీసు శాఖపై నమ్మకంలేక ఇలా చెప్పడం లేదు. పోలీసింగ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమైన దేశాల్లోనే సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు వరంగల్‌లో సాధ్యం అవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్‌ కలిగి ఉండటమే సురక్షిత మార్గం అని నమ్ముతున్నాను. మీరు రివాల్వర్‌ లైసెన్స్‌ నిరాకరిస్తే ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో!’’ అంటూ లేఖ రాశారు. దీనిపై వరంగల్‌ సీపీ రవీందర్‌ను వివరణ కోరగా, తమకు లేఖ ఈ మెయిల్‌ ద్వారా వచ్చిందని తెలిపారు. అయితే శనివారమే వరంగల్‌కు చెందిన మరో వ్యక్తి కూడా పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు. మిల్స్‌ కాలనీ పోలీసుస్టేషన్‌ పరిధిలోని రంగశాయిపేట నుంచి వరంగల్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వరకు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పట్ల కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికుడు కోరడం గమనార్హం.

(Courtesy Eenadu)