భోపాల్‌ : సంకల్పం కలిగి ఉంటే కలలను సాకారం చేసుకోవడంలో ఒక వ్యక్తిని ఎలాంటి అడ్డంకులూ ఆపలేవు. మధ్యప్రదేశ్‌లో ఒక సాధారణ టీ విక్రేత కూతురు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగాన్ని సాధించడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. నీమూచ్‌లో టీ అమ్మే వ్యక్తి కూతరు అంచల్‌ గంగ్వాల్‌(24) దీనిని నిరూపించారు. సాధించాలనే తపన ఉంటే పేదరికము అడ్డుకాదనీ, ఎంతటి పెద్ద లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని పలువురికి ఆదర్శంగా నిలిచారు.
నీమూచ్‌లోని బస్టాండ్‌ వద్ద 25 ఏండ్ల నుంచి అంచల్‌ గంగ్వాల్‌ తండ్రి టీస్టాల్‌ను నడుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కూతరు స్కూల్‌ ఫీజులు చెల్లించడానికి కూడా ఆయన వద్ద డబ్బులు ఉండేవి కావు. ఇన్ని కష్టాలను దాటుకొని అంచల్‌ గంగ్వాల్‌ ఈఘనతను సాధించడం గమనార్హం. ” నా కూతురు ఈ ఘనత సాధించడం మా కుటుంబానికి గర్వకారణం. కానీ, కరోనా వైరస్‌ ఆంక్షల కారణంగా ఆమెను చూడటానకి(దుండికల్‌లోని వైమానిక దళం అకాడమీకి) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు మేము వెళ్లలేదు” అని అంచల్‌ గంగ్వాల్‌ తండ్రి సరేశ్‌ గంగ్వాల్‌ తెలిపారు. 2013లో కేదార్‌నాథ్‌ విషాదంలో ప్రజలకు సహాయం చేయడంలో ఐఏఎఫ్‌ సిబ్బంది తెగువ, ధైర్యం చూసి వైమానిక దళంలో చేరాలని తన కూతురు కలలు కన్నదని సురేశ్‌ తెలిపారు. వైమానికదళంలో చేరడానికి తన కూతురు తీవ్రంగా శ్రమించిందనీ, అనేక పుస్తకాల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆరో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. కాగా, అంచల్‌ సాధించిన ఘనత రాష్ట్రానికి గర్వకారణమని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.

Courtesy Nava telangana