ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఎన్నికల హడావిడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు బీఢ్ జిల్లా కలెక్టర్ ఆస్తిక్ కుమార్ పాండే ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన విలేకరులకు వాడిపారేసే ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించిన ఓ జర్నలిస్టు కలెక్టర్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగారు. “ఒక సారి వాడిపడేసే ప్లాస్టిక్‌పై రాష్ట్రంలో నిషేధం ఉంది కదా..మరి ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఎలా ఇస్తారు” అని కలెక్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తప్పుజరిగిందని అంగీకరిస్తూ..దీనికి తానే బాధ్యత తీసుకుంటునట్టు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా..వెంటనే తనపై తాను రూ. 5000 జరిమానా విధించుకున్నారు. అనంతరం నిబంధనలకు ఉల్లంఘించిన అధికారులను పిలిపించి వివరణ కోరారని తెలిసింది. ఎన్నికల విధులలో నిమ్మగైన కారణంగా పొరపాటున ఈ తప్పిదం జరిగిందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

Courtesy Andhrajyothi…