జమ్ముకాశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు వైసిపి, టిఆర్‌ఎస్‌తో పాటు, ఏపిలోని ప్రతిపక్ష పార్టీ టిడిపి కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. మంగళవారం లోక్‌సభలో ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్ముకాశ్మీర్‌ పునర్విభజన బిల్లు, జమ్ము కాశ్మీర్‌ రిజర్వేషన్‌(రెండో సవరణ)బిల్లులపై చర్చ జరిగింది. వీటిపై వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్‌ నేతలు సభలో మాట్లాడారు. తొలుత వైసిపి ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో ఈ రోజు అద్భుతమైనదని అభివర్ణించారు. ఆర్టికల్‌ 370 తాత్కాలికమైనదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు అసెంబ్లీ ఆమోదం ఉందని కాంగ్రెస్‌ సభ్యుడు చెప్పడం పూర్తిగా అవాస్తవమని, మూడొంతుల మంది అసెంబ్లీ సభ్యుల దాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌కి తీర్మానం పంపారని, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజనపై మూడు, నాలుగేళ్లు చర్చ జరిగిందని, శ్రీకృష్ణ కమిటీ కూడా వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై మొదటి సారిగా తాను సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాష్ట్ర విభజన చేశారని విమర్శించారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం నినాదం మంచిదేనని, తమకు కూడా సమ్మతమేనని అన్నారు. జమ్ముకాశ్మీర్‌ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల జమ్ముకాశ్మీర్‌లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, భవిష్యత్తులో జమ్ముకాశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

జమ్ముకాశ్మీర్‌ విభజనతో అభివృద్ధి : గల్లా జయదేవ్‌, టిడిపి
జమ్ముకాశ్మీర్‌ విభజనతో అభివృద్ధి జరుగు తుందని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ముకాశ్మీర్‌లో కొత్త శకం ఆరంభమైందని అన్నారు. జమ్ముకాశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని స్పష్టం చేశారు. ఈ బిల్లు జమ్ముకాశ్మీర్‌ ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని చెప్పారు. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధికి ఇప్పటిదాకా వేల కోట్లు ఖర్చు చేశారని, అయినా అక్కడ ఉగ్రవాదం పెరిగిందే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ బిల్లుతో కాశ్మీర్‌లోని గిరిజన మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. జమ్ముకాశ్మీర్‌లోని సమస్యలకు పరిష్కారం ఉందని అక్కడి ప్రజలకు కేంద్రం భరోసా ఇవ్వాలన్నారు. అభివృద్ధికి ఓ రోడ్‌మ్యాప్‌ రూపొందించి దానిమేరకు ముందుకెళ్లాలని సూచించారు. తద్వారా కాశ్మీర్‌లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని జయదేవ్‌ కోరారు.

అభివృద్ధి కోసం మద్దతిస్తున్నాం : నామా నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్‌
జమ్ముకాశ్మీర్‌లో అభివృద్ధి కోసమే ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తోందని టిఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, వ్యతిరేకించే వారిని ప్రజలు క్షమించరని అన్నారు. గతంలో జరిగిన తప్పేదో జరిగిపోయిందని, దాన్ని సరిదిద్దేందుకు అంతా సంఘీభావం తెలుపు దామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు స్వాగతించదగిన విషయమని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయడం చీకటి రోజు కాదని, అభివృద్ధి వెలుగులు నింపే రోజని అన్నారు. జమ్ముకాశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆయన స్పష్టం చేశారు. యువత ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత కెసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, విద్యుత్‌, సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనా రైతులు ఆనందంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Courtesy prajasakti