న్యూఢిల్లీ: కుష్టువ్యాధి, మలేరియా వంటి వ్యాధులు ఎప్పుడో నిర్మూలించబడ్డాయి. కానీ మోడీ ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం.. పేదలకు సరైన పోషకాహారం లభించకపోవడం కారణంగా దేశంలో అలాంటి వ్యాధులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్షయ (టీబీ) వ్యాధి సైలెంట్‌గా విస్తరిస్తున్నది. కేంద్ర నిర్లక్ష్యానికి తోడు వ్యాధి గురించి సరిగ్గా తెలియకపోవడం కారణంగా దేశంలో టీబీ వ్యాధితో రోజుకు 1000 మందికి పైగా చనిపోతున్నారని ఐరాసతోపాటు పలు సంస్థలు విడుదల చేసిన ఆరోగ్య నివేదికల ద్వారా వెల్లడైంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన ‘భారత్‌ టీబీ నివేదిక-2019’ దీన్ని స్పష్టం చేస్తున్నది. ఈ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో టీబీ బారిన పడుతున్న వారిసంఖ్య ఏటేటా పెరిగిపోతున్నది. 2017లో టీబీ బారిన పడిన వారు 18 లక్షల మంది ఉంటే, 2018లో 21.5 లక్షల మంది పెరగింది. ఏడాదిలోనే టీబీ కేసులు 16 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తంగా టీబీ పెరుగుదల 25 శాతంగా నమోదైంది. టీబీ రోగులలో 15 నుంచి 69 ఏండ్లలోపు వారు 89 శాతం మంది ఉండటం గమనార్హం. టీబీ కేసుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం కేసులు నమోదయ్యాయి. మొత్తంగా యూపీలో 4.2 లక్షల మంది టీబీ రోగులు ఉన్నారు. ఆ తార్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. 2025 నాటికి టీబీ రహిత దేశంగా భారత్‌ అవతరిస్తుందని స్వయంగా మోడీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వాస్తవాలు మాత్రం దానికి విరుద్ధంగా ఉండటం ఆందోళనకరంగా ఉన్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే వైద్య రంగానికి నిధులు పెంచాలని సూచిస్తున్నారు. ఢిల్లీ మున్సిపాలిటీ చెస్ట్‌ క్లీనిక్‌ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌బీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘టీబీ రోగులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్ద లేదు. టీబీ బారిన పడిన వారు పూర్తిగా చికిత్సను పొందిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన టీబీ చికిత్స కేంద్రాల్లోనే మందులు అందుబాటులోలేని ఆరోగ్య కేంద్రాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం గుర్తించనంత కాలం టీబీ రహిత భారత నిర్మాణం అసాధ్యం’ అని చెప్పుకు రావటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది.

Courtesy Navatelangana