పి. చిదంబరం
‘పళని’ పలుకు
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఓడించడమే అంతిమ లక్ష్యం. హిందూ రాష్ట్ర లక్ష్య సాధన పురోగతిని ఆ సంవత్సరంలోగానే నిర్ణయాత్మకంగా అడ్డుకొని తీరాలి. మహా నాయకుడు అబ్రహం లింకన్ 1865లో అమెరికా సంయుక్త రాష్ట్రాల సమైక్యతను కాపాడిన విధంగానే సార్వత్రక ఎన్నికల సంవత్సరమైన 2024 ఏతెంచేలోగానే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని, భారత ప్రజాస్వామ్యాన్ని మనం పదిలం చేసుకోవాలి.

జార్ఖండ్ శాసనసభా ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు (డిసెంబర్‌ 24) పలు దినపత్రికలు రెండు(భారత)దేశ పటాలను ప్రచురించాయి. ఆ రాజకీయ భౌగోళిక పటాలు విశదం చేసిన వాస్తవాలు : భారతీయ జనతా పార్టీ 2018లో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 21 రాష్ట్రాలలో అధికారంలో వున్నది. 2019 సంవత్సరాంతానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 15 కి పడిపోయింది. 2018లో దేశ జనాభాలో 69.2 శాతం, దేశ వైశాల్యంలో 76.5 శాతం బీజేపీ పాలనలో ఉన్నాయి. 2019 సంవత్సరాంతానికల్లా ఆ సంఖ్యలు 42.5 శాతం(జనాభా), 34.6 శాతం(భౌగోళిక వైశాల్యం) తగ్గిపోయాయి.

పెద్ద రాష్ట్రాల(లోక్‌సభ నియోజకవర్గాలు 20 లేదా అంతకు మించి వున్న రాష్ట్రాలు) లో బీజేపీ ముఖ్యమంత్రులు కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే వున్నారు. అవి: కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్. మరో మూడు పెద్ద రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, బిహార్, తమిళనాడు- ఎన్‌డిఏ మిత్ర పక్షాలుగా వున్నాయి. అయితే అవి ఇంకెంతకాలం బీజేపీ బాటలో వుంటాయన్నది నిశ్చితంగా చెప్పలేము.

2019 మేలో 17వ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం ఇతర రాజకీయపక్షాలలో తీవ్ర దిగ్భ్రాంతి, అమిత భయాన్ని కలిగించింది. ఎందుకంటే బీజేపీ తన సొంతంగా 303 స్థానాలను, మిత్రపక్షాలతో కలిసి 353 స్థానాలను గెలుచుకున్నది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఎదురులేని వ్యక్తులు గా, కార్యసాధక రాజకీయ వేత్తలుగా భాసిల్లసాగారు. ఆ నాయకద్వయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతిపక్షాలు సతమతమైపోయాయి. వాటి రాజకీయ ప్రాబల్యం మరింతగా క్షీణించింది.

సరే, నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ లక్ష్య సాధనకు మహోత్సాహంతో ముందడుగు వేశారు. పాలనా వ్యవహారాలలో దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించసాగారు. తాము నిర్దేశించినవి జరిగి తీరాలన్న పట్టుదల చూపసాగారు. వివిధ చర్యలు అత్యంత నిర్బంధపూరితంగా చేపట్టారు. భారత్‌ను ఒక హిందూ దేశంగా రూపొందించడమనే లక్ష్య సాధనలో తాము ఎట్టి పరిస్థితులలోను ఎలాంటి వెనకడుగు వేయబోమని తమ చర్యల ద్వారా దేశ ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించారు. చారిత్రక యుగాలలోని చక్రవర్తుల వలే తాము తమ గమ్యానికి పురోగమిస్తామని తమ వివిధ కార్యాచరణల రూపేణా ప్రజలు, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలకు తిరుగులేని విధంగా విశదం చేశారు. నరేంద్రమోదీ,- అమిత్ షాల మొదటి చర్య ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితం చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడం. ట్రిపుల్ తలాక్‌ను భారత జాతీయ కాంగ్రెస్ గానీ, ఇతర రాజకీయ పక్షాలు గానీ వ్యతిరేకించలేదు. అలా తలాక్ చెప్పిన భర్తను జైలుకు పంపాలన్న నిబంధనను మాత్రమే వ్యతిరేకించాయి. అయితే, పార్లమెంటులో ఆ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ మొదలైన ప్రతిపక్షాలు కాలం చెల్లిన, మహిళల శ్రేయస్సుకు హానికరమైన తలాక్ విడాకుల ఆనవాయితీని సమర్థించేవారుగా అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు !

ఆ తరువాత వారు అమలుపరిచిన చర్య అసోంలో దుర్మార్గమైన జాతీయ పౌర పట్టిక ( నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్-.. ఎన్‌ఆర్‌సి). ఈ ప్రక్రియలో 19, 06,657 మంది వ్యక్తులు ‘భారత పౌరులు కానివారు’గా, ‘దేశ రహిత’ వ్యక్తులుగా మిగిలిపోయారు. 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంపై ఒక వినాశనకర దాడికి బీజేపీ ఉపక్రమించింది. ఇది మన మౌలిక శాసనంపై మున్నెన్నడు జరగని దాడి. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కశ్మీర్ లోయలోని 75 లక్షల మందికి పైగా ప్రజలను గృహ నిర్బంధితులను చేసింది. బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా వారిపై ఆంక్షలు అమలుపరిచింది. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడం ద్వారా భారత గణతంత్రరాజ్యపు మౌలిక సూత్రాలపై బీజేపీ తుది దాడి చేసింది. ఆ బిల్లును ప్రవేశపెట్టడం, పార్లమెంటు ఆమోదం పొందడం కేవలం 72 గంటలలోనే పూర్తయిందంటే నరేంద్రమోదీ, -అమిత్ షా ద్వయం తమ లక్ష్య సాధనలో ఎంత వేగంగా ముందుకు దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకూ ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు చేపట్టవలసిన చర్యలేనా? కావు. కజ్జాకోరుల, బెదిరింపులతో వేధించే వ్యక్తుల చర్యలవి. బలవంతపెట్టడం, బెదిరింపులతో హింసించడం, బలహీనులపై దౌర్జన్య పూర్వకంగా పెత్తనం చెలాయించడం ప్రజాస్వామ్య పాలకులు చేయవలసిన పనులేనా? ప్రజాస్వామ్యంలో నిరంకుశాధికారాలు వహించడమేమిటి? నిరంకుశ పాలకులు వివేక వంతమైన సలహాలను వినరు. విరుద్ధ అభిప్రాయాలను, భిన్న దృష్టికోణాన్ని గుర్తించరు, గౌరవించరు. తమ అభిప్రాయాలతో ఎవరైనా విభేదించడాన్ని వారు సహించరు. తాము తప్పుచేయమని భావిస్తారు. తాము చేసిందే సక్రమమైనదని వారు విశ్వసిస్తారు. ఇటువంటి అతిశయపూరిత వ్యవహారశైలి వారికి పరిపాటి. అది వారి సహజ నైజం. అయితే బెదిరింపులకు లోనవడానికి, దౌర్జన్యాలను సహించేందుకు మిమ్ములను మీరు అనుమతించుకోకూడదు కదా. అలా అనుమతించుకోవడమంటే ఆ నిరంకుశ పాలకులు తమ అప్రజాస్వామిక కార్యకలాపాలలో సఫలమవ్వడానికి దోహదం చేయడమే కాదూ? దురదృష్టవశాత్తు అదే జరిగింది. నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఆరు నెలల్లో ప్రతిపక్షాలకు సంభవించిన విపత్కర పరిస్థితులే అందుకు నిండు నిదర్శనాలు.

నరేంద్ర మోదీ-, అమిత్ షాల నిరంకుశ వ్యవహారశైలికి ప్రతిఘటన తొలి సంకేతాలు పశ్చిమ బెంగాల్‌లో కన్పించాయి. బీజేపీ తనను ఎంతగా సమస్యల పాలు చేసిందో అంతగా ఆ పార్టీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమస్యల పాలు చేశారు, చేస్తున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ అంతకంటే దృఢమైన కృతనిశ్చయంతో వ్యవహరించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికలలో బీజేపీని వెనక్కి నెట్టి వేయడంలో ఘటనాఘటన సమర్థుడు పవార్ సఫలమయ్యారు. తొలుత, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ బీజేపీకి లభించకుండా చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అధికారంలో కొనసాగేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను శరద్ పవార్ తన అసమాన రాజకీయ చాతుర్యంతో పూర్తిగా వమ్ము చేశారు. తనకు తిరుగులేదన్న ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీ పవార్ చేతిలో చిత్తయిపోయింది.

ఇది, గత వేసవిలో లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీకి సంభవించిన మొదటి ప్రధాన ఓటమి.అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒక ప్రధాన రాష్ట్రంలో పరిస్థితులు ఇలా వున్న తరుణంలోనే మోదీ ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను పార్లమెంటులో ప్రవేశ పెట్టి, ఆమోదం పొందడంలో విజయవంతమయింది. పార్లమెంటులో వివిధ పార్టీలను ఆ బిల్లుకు అనుకూలంగా చేసుకున్నది. అయితే, పార్లమెంటు వెలుపల దేశవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనాగ్నులు ఉవ్వెత్తున ప్రజ్వరిల్లాయి. మహారాష్ట్ర విజయం, పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యతిరేకత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్త ప్రభంజనాల అర్థమేమిటో గ్రహించారు. సమైక్యంగా పనిచేసి విజయం సాధించారు. తత్ఫలితంగానే కేవలం పక్షం రోజుల్లో ( డిసెంబర్ 12-24 ) ఈ పురానవ జాతి తన ఆత్మను కనుగొన్నది. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా లేచి నిలబడ్డది.

ఈ దేశం, మన భారత గణతంత్ర రాజ్యం ఇక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళనున్నది? నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి కేవలం ఏడు నెలలు మాత్రమే గడిచాయి. ఆయన ఇంకా 4 సంవత్సరాల 5 నెలలు అధికారంలో వున్నారు. కనుక సమీప భవిష్యత్తులో న్యూఢిల్లీలో కొత్త పాలకులు రాగలరని భావించలేము. అలాంటి భావనలు, ఊహాగానాలు ప్రజాస్వామ్యయుతమైనవి కావు. మరి ఏమి సంభవించనున్నది? కొంత మంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ప్రతిఘటన పెరుగుతుంది. ఫలితంగా మోదీ తన విధానాలను మార్చుకోవడం అనివార్యమవుతుంది. ఈ అభిప్రాయాన్ని నేను తిరస్కరించను గానీ పూర్తిగా అంగీకరించలేను. నా అభిప్రాయం ప్రకారం 2020, 2021 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల ఫలితాలు మోదీ ప్రభుత్వ గమనాన్ని అనివార్యంగా మార్చివేస్తాయి. 2020 జనవరి-–ఫిబ్రవరి నెలల్లో ఢిల్లీ శాసనసభకు, అక్టోబర్–-నవంబర్ నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2021 ఫిబ్రవరి–-మార్చిలో జమ్మూ-కశ్మీర్ లోను, ఏప్రిల్-– మే నెలల్లో అసోం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తావిత రాష్ట్రాలన్నిటిలోనూ భారతీయ జనతా పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు వున్నది. బీజేపీ ఒక అజేయ రాజకీయ యంత్రాంగమనే భావనను ప్రజలలోనూ, రాజకీయ పక్షాలలోనూ అమిత్ షా బలంగా సృష్టించారు. బీజేపీకి కొన్ని బలాలు, అనుకూలతలు వున్నమాట నిజమే(పైగా అవి అపార ధన బలంతో మరింత సుదృఢమయ్యాయి). అయితే, అన్ని రాజకీయ పక్షాల మాదిరిగానే బీజేపీ కూడా సాధారణ బలహీనతలు, ప్రతికూలతలు,- వర్గాలు, ముఠాలు, అసమ్మతిపరులు, తిరుగుబాటు అభ్యర్థుల-తో సతమతమైపోతున్నది. వీటికి తోడు అధికారంలో వున్న రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వుండనే వున్నది. బీజేపీ గత రెండు నెలల్లో చాలా నష్టాలను చవి చూసింది. హర్యానాలో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోగలిగినా ఆ పార్టీ ప్రతిష్ఠ బాగా దెబ్బ తిన్నది. మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయింది. జార్ఖండ్‌లో పరాజయం పాలయింది.

అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళనున్న ప్రతి రాష్ట్రంలోను ప్రజాదరణలో అగ్రగామిగా వున్న పార్టీ వెనుక బీజేపీయేతర పార్టీలన్నీ సమీకృతమయితే ఆ విజయాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళడం సుసాధ్యమవుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే అసోం, కేరళ, పాండిచ్చేరిలో కాంగ్రెస్ వెనుక, తమిళనాడులో డిఎంకె వెనుక బీజేపీయేతర పార్టీలన్నీ సమీకృతమవ్వాలి. బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఆయా రాష్ట్రాలలోని నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా పార్టీల మధ్య సర్దుబాట్లు జరగాలి. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తావిత రాష్ట్రాలు ఏ ఒక్క దానిలోనూ బీజేపీ నిశ్చితంగా విజేత కాబోదు. మన అంతిమ లక్ష్యం 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఓడించడమే. 2024 సంవత్సరంలోగానే హిందూ రాష్ట్ర లక్ష్య సాధన పురోగతిని నిర్ణయాత్మకంగా అడ్డుకొని తీరాలి. మహామనిషి, మహోన్నత నాయకుడు అబ్రహం లింకన్ 1865లో అమెరికా సంయుక్త రాష్ట్రాల సమైక్యతను కాపాడిన విధంగానే సార్వత్రక ఎన్నికల సంవత్సరమైన 2024 ఏతెంచేలోగానే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని, భారత ప్రజాస్వామ్యాన్ని పదిలం చేసుకోవాలి. అది మన విధ్యుక్త ధర్మం.

(Courtesy Andhrajyothi)