అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
వాటిని తొలగించాల్సిన టైమొచ్చింది
జీతాలిచ్చేది అక్రమాలను చూసి నిద్రపోడానికా?
మీకు చేతకాకుంటే కోర్టే రంగంలోకి దిగుతుంది
శామీర్‌పేట చెరువును పూడ్చేసేందుకు యత్నాలు!
మన చెరువుల్ని నాశనం చేసుకుంటామా?
అన్ని సర్కిళ్ల డీసీలను సస్పెండ్‌ చేసి విచారించాలి
తీరు మారకుంటే గ్రేటర్‌ కమిషనర్‌ను సాగనంపండి
ఐదేళ్లకోసారి క్రమబద్ధీకరణ జీవోలు సరికాదు
కమిషనర్‌, మునిసిపల్‌ కార్యదర్శి కోర్టుకు రావాలి

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ  పరిధిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతూంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏంచేస్తున్నారని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు ఇదే రీతిలో కొనసాగితే అందమైన భాగ్యనగరం పీడకలల నగరాలైన ముంబై, పట్నా మాదిరిగా మారడానికి ఎంతో కాలం పట్టదని అభిప్రాయపడింది. ‘‘ఈ పరిణామాలను మీరు ఆహ్వానిస్తుండవచ్చు. కానీ భాగ్యనగరం అలా మారితే నా మనసు గాయపడుతుంది’’ అని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

అక్రమనిర్మాణాలపై దాఖలైన పిల్స్‌, రిట్‌ పిటిషన్లలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు…జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్చి 24న జరిగే విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు చౌహాన్‌ నేతృత్వంలోనిధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తూ నగరానికి చెందిన ఇద్దరు పౌరులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. అక్రమ నిర్మాణాలపట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును ధర్మాసనం ఆక్షేపించింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమించి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఆక్రమణలను నిలువరించడానికి జీహెచ్‌ఎంసీలో ఎలాంటి విభాగం లేనట్లుందని వ్యాఖ్యానించింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే… జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సాగనంపాలని సీజే వ్యాఖ్యానించారు. ముందుగా అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది. అక్రమనిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సిబ్బంది కళ్లుమూసుకోరాదని పేర్కొంది. అక్రమాలు చూస్తూ నిద్రపోవడానికి జీతభత్యాలు చెల్లించడంలేదని, అధికారులు చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లకోసారి తన విధానాలను సవరిస్తూ అక్రమ నిర్మాణాలు క్రమబద్ధీకరించేందుకు వేర్వేరు జీవోలు జారీచేస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది.

ఇలాంటి జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు, పిల్స్‌ కోర్టుముందు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. అక్రమనిర్మాణాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. నల్సార్‌కు తాను వెళ్లినప్పుడు శామీర్‌పేట సరస్సులో పుట్టగొడుగుల్లా వెలిసిన నిర్మాణాలను గమనించానని సీజే గుర్తుచేశారు. ఇదే తీరు కొనసాగితే శామీర్‌పేట సరస్సు మన జ్ఞాపకాల్లో మిగిలిపోవడానికి ఎంతోకాలం పట్టదని అన్నారు. అధికారులు, ఆక్రమణదారులు కలిసి శామీర్‌పేట చెరువును పూడ్చేయడానికి వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరివాహక ప్రాంతాలను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చి మన చెరువులు, సరస్సులను మనమే నాశనం చేసుకుంటామా?అని సీజే ప్రశ్నించారు. సర్కారు భూములకు ప్రభుత్వం ట్రస్టీ మాత్రమేనని, భూములతోపాటు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది.

మీ విధులు మీరు నిర్వర్తించాలి. లేనిపక్షంలో కోర్టే వాటిని చేపడుతుంది. ఆనక ఉద్యోగుల పట్ల కోర్టు కఠినంగా ఉందని భావించవద్దు’’అని పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులను హెచ్చరించింది. కోర్టు ముందున్న అన్ని వ్యాజ్యాల్లో విచారణ పూర్తిచేసి తగిన ఆదేశాలు ఇస్తామని సీజే తేల్చిచెప్పారు. అక్రమ కట్టడాలపై వచ్చే అన్ని ఫిర్యాదులను పరిశీలించి వాటిని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ రోజున చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ చట్టాలు అమలులో విఫలమైనట్లు భావిస్తామని, దాన్ని ఈ కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని తేల్చిచెప్పింది.

Courtesy Andhrajyothi