బస్టాప్‌లో కూర్చునే స్థలం నుంచి భూ హక్కుల వరకు…
సానుకూల ఫలితాలతో ఆందోళనలకు పదును..
చెన్నై: దేశవ్యాప్తంగా దళితులపై దారుణాలు కొనసాగుతున్న తరుణంలో… బస్టాప్‌లో కూర్చునే స్థలం నుంచి మొదలు అంటరానితనం, రెండు గ్లాసుల విధానానికి వ్యతిరేకంగా, ఆలయప్రవేశం, భూ హక్కుల వరకూ తమిళనాడులో వెనుకబడినవర్గాలు నిరంతరం పోరాడుతున్నారు. మొక్కవోని దీక్షతో వారు జరుపుతున్న పోరాటాలు కొన్ని ప్రాంతాల్లో విజయం దిశగా అడుగులు వేశాయి.. వేస్తున్నాయి. పాలనాయంత్రాంగం దిగొచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇస్తున్నది.. ప్రముఖ కమ్యూనిస్టు నేత బి శ్రీనివాసరావు వర్థంతి సందర్భంగా దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) అనుబంధ సంఘం ‘తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్‌ (టీఎన్‌యూఈఎఫ్‌)’ ఇటీవల అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టింది. విరుధునగర్‌, తిరువన్నమలై, పుదుకొట్టయి, ఈరోడ్‌ మరియు ధర్మపురి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
థెమావూర్‌లో బస్‌ షెల్టర్‌ పునరుద్ధరణ
పుదుకోట్టయి జిల్లాలోని థెమావూర్‌లో బస్‌ షెల్టర్‌ను జిల్లా యంత్రాంగం పునరుద్ధరించింది. దళితులు అక్కడ కూర్చుంటున్నారని పెత్తందారులు ఆ బస్‌ షెల్టర్‌ రూఫ్‌, బెంచ్‌లను పదేపదే ధ్వంసం చేస్తూ వచ్చారు. తద్వారా దళితులు ఆ బస్టాప్‌లో కనీసం బస్సు కోసం వేచివుండటాన్ని కూడా పెత్తందారులు అడ్డుకున్నారు. చాలాకాలంగా ఈ దురాగతం కొనసాగుతుండగా, దళితుల ఆందోళన నేపథ్యంలో బస్‌షెల్టర్‌ను అధికారులు ఇటీవల పునరుద్ధరించారు. ‘ఏడేండ్లుగా బస్‌షెల్టర్‌లో దళితులకు చోటులేదు. మా ఆందోళనతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. బస్‌ షెల్టర్‌ను పునరుద్ధరించారు. సీసీటీవీ కెమెరాను అక్కడ ఏర్పాటుచేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని టీఎన్‌యూఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శామ్యూల్‌ రాజ్‌ చెప్పారు. ఈ ప్రాంతంలోని టీ దుకాణాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలులో వుంది. ‘దళితులకు ఇచ్చే గ్లాసుల డిజైన్‌ వేరుగా వుంటుంది. పరీక్షగా చూస్తేనేకానీ.. మామూలు వ్యక్తులకు అర్థంకాదు. సమస్యను మేం ఎత్తిచూపాం. ఆందోళనచేపట్టాం. దాంతో దుకాణాల నుంచి ఆ గ్లాసులను తొలగించారు’ అని రాజ్‌ తెలిపారు.
ధర్మపురిలో భూ పంపిణీ
ధర్మపురి జిల్లాలోని ఉంగరనల్లిలో భూ పోరాటం విజయవంతమైంది. 2011లో మొత్తం 78 మంది లబ్దిదారులకు 2.59 ఎకరాల భూమిని కేటాయించారు, కానీ, ఆ భూమి పెత్తందారుల ఆక్రమణలో ఉండిపోయింది. ఆ గ్రామం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి దగ్గరగా ఉన్నది. పదేపదే అధికారులకు దళితులు మొర పెట్టుకున్నా పాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీఎన్‌ యూఈఎఫ్‌ ఆ దళిత కుటుంబాలకు మద్ద తుగా నిలిచింది. ఆందోళనతో రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దళితులకు ఆ భూమిని అప్పగించారు.
విరుదునగర్‌లో 2011 నుంచి మూతపడిన ఆలయం…
విరుదునగర్‌ జిల్లాలోని పావాలి గ్రామంలో కన్నిమారియమ్మన్‌ కామాచి ఆలయం 2011లో మూతపడింది. పెత్తందారీ కులస్థులకుచెందిన ఓ కుటుంబ నియంత్రణలో వున్న ఆ ఆలయంలోకి దళితులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు గుడినే మూసేశారు. తమను ఆలయంలోకి ప్రవేశించనివ్వటంలేదని దళితులు కోర్టు గడపకెక్కారు. అయితే.. ఆలయం తెరిచినప్పుడు లోపలికి వెళ్లే హక్కు దళితులకు ఉన్నదని కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆలయాన్ని పెత్తందారులు మూసివేశారు. ‘ఆ పెత్తందారీ కుటుంబం వేరే జిల్లాకు వెళ్ళిపోయంది. అయినా ఆలయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని చూసింది. ఆ ఆలయానికున్న 10 ఎకరాల భూమిని వారే వాడుకుంటున్నారు. శాంతి కమిటీ సమావేశాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. అ కుటుంబం సమావేశానికి హాజరుకాలేదు. మేం తిరిగి కోర్టును ఆశ్రయించాం. త్వరలో ఆలయం తెరుచుకుంటుందన్న విశ్వాసంతో ఉన్నాం’ అని శామ్యూల్‌ రాజ్‌ చెప్పారు.
దళితుల భూమి పెత్తందార్ల చేతిలో…
తిరువన్నమలై జిల్లాలోని కదంబంకుట్టెయి గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ‘7.26 ఎకరాల భూమిని పెత్తందారులు స్వాధీనం చేసుకున్నారు. దళితులు తమ వద్ద రుణాలు తీసుకున్నారనీ, వాటిని తిరిగి చెల్లించలేక.. వారే తమకు భూములను అప్పగించారని పెత్తందారులు చెబు తున్నారు. వాస్తవానికి భూమిని వారు బలవంతంగా లాక్కు న్నారు. మా పోరాటంతో దిగివచ్చిన రెవెన్యూ అధికారులు, వారికి ఆ భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారని శామ్యూల్‌ తెలిపారు. హామీ నెర వేరకపోతే.. సీపీఐ(ఎం) నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని టీఎన్‌యూఈఎప్‌ నేత ప్రకటించారు.
దళితుల హక్కుల రక్షణకు అనేక చట్టాలున్నప్పటికీ.. కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా అందని స్థితిలోకి వారు నెట్టబడుతున్నారు. సంఘాల నీడన ఒకపక్క పోరాటాలు పెరుగుతున్నా.. మరోపక్క వారి అణచివేత కూడా అదేవిధంగా పెరుగుతుందనటానికి ఇటీవల వెలుగు చూస్తున్న అనేక ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అనేకసాకులతో వారిపై క్రూరమైన దాడులు, అణచివేత, వివక్ష ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. ఏదేమైనా.. హక్కుల కోసం మొక్కవోని దీక్షతో ఇటీవల ఆందోళనలూ పెరుగుతున్నాయి… కొన్ని అనుకూల ఫలితాలు వస్తుండటంతో టీఎన్‌యూఈఎఫ్‌ వంటి సంఘాలు తమ హక్కుల సాధనకు మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతున్నాయి.

Courtesy Nava telangana…