మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు. జూన్ 19వ తేదీ సాయంత్రం 8.15 వ‌ర‌కు షాపు తెరిచే ఉంచ‌డంతో పెట్రోలింగ్ పోలీసు ఫెనిక్స్‌‌ను బ‌య‌ట‌కు లాగాడు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య‌ వివాదం జ‌రిగింది. ఆ మ‌ర్నాడు షాపుకు వ‌చ్చిన పోలీసులు ఫెనిక్స్‌ తండ్రి జ‌య‌రాజ్‌తో వాద‌న‌కు దిగారు. అత‌డిని స్టేష‌న్‌కి తీసుకెళ్లారు. విష‌యం తెలుసుకున్న ఫెనిక్స్ పోలీస్ స్టేష‌న్‌కి ప‌రుగుపెట్టాడు. అక్క‌డే అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్ద‌రిపై ఐపీసీ 188 (ప్ర‌భుత్వ అధికారి ఆదేశాల‌ను బేకాత‌రు చేయ‌డం), 353 (ప్ర‌భుత్వ అధికారి విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం), 269 (ప్ర‌మాద‌క‌ర వ్యాది సంక్ర‌మ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం), 506(2) బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం లాంటి సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. పోలీసు క‌స్ట‌డీలో జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌‌ల‌ను పోలీసులు తీవ్రంగా హింసించారు.

‘పోలీస్ స్టేష‌న్‌లో జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల‌ను పోలీసులు చిత్ర‌హింస‌లు పెడుతుండ‌డం మేము బ‌య‌ట నుంచి అద్దాల ద్వారా చూస్తూనే ఉన్నాం. ఆగ్ర‌హంతో కూడిన‌ పోలీసుల అరుపుల‌తో పాటు, జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల రోద‌న‌లు మాకు వినిపిస్తున్నాయి. ఉద‌యానికి క‌ల్లా వారిని ఉంచిన ప్రాంతమంతా నెత్తుటిమ‌య‌మైంది. తెల్ల‌వారు జామున జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌లను జీపులో వేసుకొని మెజిస్ట్రేట్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ వాళ్లు అరోగ్యంగా ఉన్నారా లేరా? వాళ్ల‌కేమైనా గాయాల‌య్యాయా అని తెలుసుకోకుండానే జుడిషియ‌ల్ క‌స్ట‌డీకి ఆదేశించార’‌ని ఫెనిక్స్ కోసం పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన అత‌ని న్యాయ‌వాది మ‌ణిమార‌న్ వెల్ల‌డించాడు.

మాట‌ల్లో చెప్ప‌లేనంత హింస‌ను వాళ్లు అనుభ‌వించార‌ని మార‌న్ మాటలు వింటే అర్థ‌మ‌వుతుంది. ‘పోలీసులు తెలివిగా జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల‌ను జైలుకు పంపి చేతులు దులుపుకోవాల‌నుకున్నారు. జైలులో వాళ్ల బ‌ట్ట‌లు పూర్తిగా నెత్తుటిలో త‌డిసిపోయాయి. వాళ్ల‌కు వేరే బ‌ట్ట‌లు తెచ్చిచ్చాను. ఫెనిక్స్ నిల‌బ‌డ‌లేని స్థితిలో ఉన్నాడు. ఫెనిక్స్ వెన‌క నుంచి లాఠీని దూర్చ‌డంతో తీవ్రంగా అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం జ‌రిగింది’ అని చెప్పుకొచ్చాడు. జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల పురుషాంగం నుంచి నెత్తురు కార‌డాన్ని చూసిన‌ట్లు మ‌రికొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు.

కోవిల్ ప‌ట్టి స‌బ్ జైలులో వారిద్ద‌రినీ ప‌రీక్షించిన వైద్యుడు వాళ్ల ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేద‌ని, వాళ్ల శ‌రీర ప్రైవేటు బాగాల్లో తీవ్రమైన గాయాలున్నాయ‌ని రిపోర్టు ఇచ్చారు. వాళ్ల‌కు ఎక్స్‌రే తీయాల్సిన అవ‌స‌రముంద‌ని 20వ తేదీ జైలు అధికారుల‌కు తెలియ‌జేశాడు. 21వ తేదీ నాటికి జ‌య‌రాజ్, ఫెనిక్స్ తీవ్రంగా అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో వారిని కోవిల్‌ప‌ట్టి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 22వ తేదీ సాయంత్రం ఆసుప‌త్రిలో ఫెనిక్స్‌ మృతి చెంద‌గా, మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌య‌రాజ్ మృతిచెందాడు.

లాక్‌డౌన్ సాకుతో లాఠీ‌ పాల‌న‌కు తెర‌తీసిన పాల‌క వ‌ర్గాలు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి త‌మ అధికారాన్ని కాపాడుకోవాల‌ను కుంటున్నాయి. లాక్‌డౌన్ పేరుతో… ప్ర‌జ‌ల ప్ర‌శ్నించే హ‌క్కును సైతం తొక్కిపెట్టి నియంతృత్వాన్ని చ‌లాయిస్తున్నాయి. పోలీసుల‌కు విచ్ఛ‌ల‌విడి అధికారులు ఇచ్చి… నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని కొట్టి చంప‌డం స‌రైందే అనే ప్ర‌చారాన్ని లంఘించాయి. ఇంకేముంది… అధికారాన్ని ప్ర‌శ్నించ‌నంత‌కాలం జార్జి ఫ్లాయిడ్‌, జ‌య‌రాజ్‌, ఫెనిక్స్ ఇలా ఒక్కొక్క‌రుగా ప్రాణాలు కోల్పోవ‌ల్సిందే.
– Kran ti