• సర్కారుకు కార్మిక సంఘాల ప్రతిపాదన
  • హౖకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించాలి
  • అక్టోబరు 4 నాటి పరిస్థితిని కల్పించాలి
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం కాపాడాలి
  • డ్యూటీ చార్ట్‌, హాజరుపట్టికలోనే సంతకం
  • లేదంటే మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి
  • షరతులంటే సమ్మె ఆపం: అశ్వత్థామరెడ్డి
  • కార్మికులను జేఏసీ నట్టేట ముంచింది
  • ధ్వజమెత్తిన ఎన్‌ఎంయూ, హన్మంతు

హైదరాబాద్‌: ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని జేఏసీ ప్రకటించింది. లేదంటే సమ్మెను కొనసాగిస్తామని వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని తెలిపింది. జేఏసీ సమావేశం బుధవారం ఎంజీబీఎ్‌సలో జరిగింది. ఈ సందర్భంగా సమ్మె కొనసాగింపు, హైకోర్టు తీర్పు కాపీలోని సారాంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో సమ్మె గురించి జేఏసీ నిర్ణయాన్ని కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ‘‘ 47 రోజుల పాటు సమ్మె ప్రశాంతంగా సాగింది. కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని సాగిస్తున్నారు.

ఈ రోజే హైకోర్టు తీర్పు కాపీ అందింది. దీనిపై జేఏసీ సమావేశంలో కూలంకషంగా సమీక్ష చేశాం. రెండు వారాల్లోగా లేబర్‌ కోర్టుకు కేసును రిఫర్‌ చేయాలంటూ లేబర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కూడా సమస్యలను సత్వరమే లేబర్‌ కోర్టుకు నివేదించాలి. కార్మికులు సమ్మెకు దిగారంటే… పరిస్థితులను మరింత మెరుగుపర్చుకోవడానికే తప్ప… విధులను వదిలేసినట్లు కాదంటూ సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు ఉటంకించింది. ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని చెప్పింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. హైకోర్టు చెప్పిన ప్రకారం మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది ’’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు.

ఏపీఎ్‌సఆర్టీసీ, టీఎ్‌సఆర్టీసీలకు గొప్ప పేరుందని, ఇవి ఇప్పటికే గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కాయని ఆయన పేర్కొన్నారు. కార్మికులు పోషించిన కీలక పాత్ర వల్ల చాలా అవార్డులు కూడా వచ్చాయన్నారు. 47 రోజులుగా కార్మికులు ప్రశాంత వాతావరణంలో సమ్మెను కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం… హైకోర్టు తీర్పును గౌరవించి, ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమ్మె ప్రారంభానికి ముందు అక్టోబరు 4న ఎలాంటి పరిస్థితి ఉందో… అలాంటి పరిస్థితిని ఇప్పుడు కల్పించి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నామన్నారు. లేదంటే తమను పిలిచి చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి షరతులు విధించినా ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. నేరుగా డ్యూటీ చార్ట్‌లలో, అటెండెన్స్‌ రిజిస్టర్లలో సంతకాలు చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని కల్పించకపోతే యథాతథంగా సమ్మె కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సమ్మెను ప్రశాంతంగా కొనసాగిస్తూ వస్తున్న కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

లేబర్‌ కోర్టుకు వెళితే న్యాయం
ఆర్టీసీ సమ్మె అంశం లేబర్‌ కోర్టుకు వెళితే… కార్మికులకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఉందన్నారు. సమ్మె కాలం నాటి జీతాల విషయాన్ని కూడా లేబర్‌ కోర్టు దృష్టికి తెస్తామన్నారు. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తేనే… ప్రభుత్వం పునరాలోచిస్తుందన్న వార్తల గురించి ప్రస్తావించగా… ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అలాంటి సూచనలేమీ రాలేదన్నారు. షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకోవడంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్లు కె.రాజిరెడ్డి, లింగమూర్తి, ఒ.సుధ, ఇతర నేతలు థామ్‌సరెడ్డి, రాజలింగం, బాబు తదితరులు పాల్గొన్నారు.

జేఏసీ నిర్ణయం సరి కాదు
న్యాయపోరాటం చేస్తాం: ఎన్‌ఎంయూ.. కార్మికులను నట్టేట ముంచారు
పోరాటాన్ని గాలికొదిలేశారు.. జేఏసీ నేతలపై మండిపడ్డ హన్మంతు

షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం సరి కాదని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.నరేందర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెకు తమ యూనియన్‌ సంపూర్ణ సహకారం అందించిందన్నారు. కార్మికుల బలిదానాలు, 47 రోజుల సుదీర్ఘ సమ్మె, రూ.400 కోట్ల ఆర్థిక నష్టాన్ని పక్కన పెట్టి సమ్మెను విరమిస్తామనడం కార్మికుల కోణంలో న్యాయ సమ్మతం కాదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీకి రూ.1000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్మికుల సమస్యల పరిష్కారంలో అపారమైన అనుభవం కలిగిన తమ యూనియన్‌ కార్మిక శ్రేయస్సు, సంస్థ పరిరక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తుందని తెలిపారు. తగిన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. కాగా.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని జేఏసీ గాలికొదిలేసిందని జేఏసీ-1 కన్వీనర్‌ హన్మంతు ముదిరాజ్‌ ఆరోపించారు. జేఏసీ నేతలు కార్మికులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని మధ్యలో వదిలేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకుండానే సమ్మెను ఎందుకు విరమించారో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నేతలు కార్మికుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారని విమర్శించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధంగా లేరని తెలిపారు. సమ్మె కొనసాగింపుపై గురువారం జేఏసీ-1 సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

Courtesy AndhraJyothy…