• 4 రోజులుగా ఉస్మానియాలో మృత్యువుతో పోరాటం
  • సొమ్మసిల్లిన భార్య.. ఆస్పత్రి వద్ద స్వల్పఉద్రిక్తత
  • సజీవదహనం ఘటనలో 3కు చేరిన మృతులు
  • ఇక వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలే కీలకం
  • భూ వివాదం సంగతి వాడికి తెల్వనే తెల్వదు
  • ఆమెను ఎందుకు చంపాడో?: తండ్రి కృష్ణ

హైదరాబాద్‌, ఆబిడ్స్‌, రెడ్‌హిల్స్‌: సంచలనం సృష్టించిన తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్‌ మృతి చెందాడు. 65% కాలిన గాయాలతో నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సురేశ్‌ గురువారం మధ్యాహ్నం 3:25కు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నెల 4న మధ్యాహ్న భోజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని చాంబర్‌లో విజయారెడ్డిపై సురేశ్‌ పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సురేశ్‌కు కూడా మంటలు అంటుకోవడం.. ఛాతీ, పొట్ట, ముఖం, చేతులు, తొడ భాగాలు కాలిపోవడంతో అతడిని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. సురేశ్‌ శరీరం 65 శాతం కాలిపోయిందని, అవయవాలు పనిచేయకపోవడం వల్లే అతడు చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. మృతదేహనికి పోస్టుమార్టం చేసి గౌరెల్లికి తరలించారు. అంతకుముందు ఉదయమే అతడు చనిపోయినట్లు వార్తలు రావడంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మార్చురీ వద్ద 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త చనిపోయాడని తెలిసి ఆస్పత్రి వద్ద సురేశ్‌ భార్య లత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పరిస్థితి మెరుగుపడగానే పోలీసులు ఆమెను గౌరెల్లికి తీసుకెళ్లారు. కాగా విజయారెడ్డి, ఆమె డ్రైవర్‌ గురునాథం ఇప్పటికే మృతిచెండం.. తాజాగా నిందితుడు సురేశ్‌ చనిపోవడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తీవ్ర గాయాలైన అటెండర్‌ చంద్రయ్య మృత్యువుతో పోరాడుతున్నాడు. మరొక వ్యక్తి నారాయణ చికిత్స పొందుతున్నాడు.

ఎందుకు చంపాడో తెలియదు: తండ్రి
తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేశ్‌ ఎందుకు చంపాడో తనకు తెలియదని అతడి తండ్రి కృష్ణ చెప్పాడు. ‘గౌరెల్లిలోని భూ వివాదంపై కోర్టుకు, తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ నేనే తిరుగుతున్నా. అక్కడ మా కుటుంబసభ్యులకు 7 ఎకరాల భూమి ఉంది. అందులో 9 గుంటలు మల్‌రెడ్డి రాంరెడ్డికి నేనే అమ్మిన. ఈ భూమి గురించి సురేశ్‌కు పూర్తిగా తెలియదు. వాడిని సోమవారం చూశా. మళ్లీ చనిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నా’ అని చెప్పాడు. తమ అన్న ఇంత పనిచేశాడంటే నమ్మలేకపోతున్నామని సురేశ్‌ చెల్లెళ్లు శైలజ, స్వప్న వాపోయారు.

Courtesy AndhraJyothy..