•  ఆర్టీసీపై 14 సమీక్షలు నిర్వహించిన సీఎం
  •  మొత్తంగా 44గంటలపాటు చర్చలు
  •  అయినా ఒక్క డిమాండూ పరిష్కారం కాలేదు

సమీక్షలు… దాదాపు 44 గంటలు… రెండు కేబినేట్‌ సమావేశాలు… ఒక కలెక్టర్ల సదస్సు ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ వెచ్చించిన సమయాలు, నిర్వహించిన సమావేశాల వివరాలివి. ఒక్క నెలలోనే రెండు కేబినేట్‌ సమావేశాలు నిర్వహించి, కేవలం ఆర్టీసీ అనే అంశానికే మొత్తం సమయాన్ని వెచ్చించడం కూడా విశేషమే. అంతేకాదు. 10 గంటల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ ఆర్టీసీ బస్సులను నడపడంపైనే ఎక్కువగా చర్చించారు. ఇంతలా చర్చలు, సమీక్షలు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదని పరిశీలకులు చెబుతున్నారు. నిజంగా ఆర్టీసీ సమ్మె ఒక రకంగా ప్రభుత్వ పాలనను స్తంభింపజేసింది. ముఖ్యమంత్రితో సహా ఉన్నతాధికారులు ఇతరత్రా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కల్పించింది. మంత్రుల విషయాన్ని పక్కన పెడితే… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రవాణా, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు సైతం ఆర్టీసీ సమ్మెపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. నిజానికి ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడం పెద్ద కష్టం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని పక్కన పెట్టి, మిగతా డిమాండ్లపై కార్మికుల్లో భరోసా నింపేలా మాట్లాడితే సమ్మె ఉండేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క గంట సమయంలో తేల్చాల్సిన అంశాన్ని ప్రభుత్వం… 44 గంటల పాటు పొడిగించిందని ఓ కార్మిక నేత అన్నారు. వాస్తవానికి సెప్టెంబరులోనే ఆర్టీసీ కార్మికుల యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయి. అక్టోబరు 1న కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌ ఆర్టీసీ డిమాండ్లపై చర్చించింది.ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో త్రిసభ్య కమిటీని వేసింది. 4వ రాత్రి ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సీఎం కేసీఆర్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, త్రిసభ్య కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

కార్మికులు అక్టోబరు 5నుంచి సమ్మెలోకి వెళ్లారు. తర్వాత కూడా కేసీఆర్‌ పలు సమీక్షలు నిర్వహించారు.అక్టోబరు 1న మొదలుకొని… ఈ నెల 6 వరకు 14 సమీక్షలు నిర్వహించారు. వీటి కోసం 44 గంటల సమయాన్ని వెచ్చించారు. ఆర్టీసీ సమ్మె ఉధృతం కావడంతో కేసీఆర్‌, ఆయన ప్రభుత్వం ఇతర సమస్యలపై దృష్టిపెట్టలేకపోయింది. యంత్రాంగం మొత్తం సమ్మెపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను కలెక్టర్లు పర్యవేక్షించాల్సి వచ్చింది. డెంగీ, రైతుబంధు అందకపోవడం, అకాల వర్షాలతో పంటనష్టం,ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా, ఆర్టీసీ సమ్మెపైనే సీఎం ఎక్కువగా దృష్టిసారించడంతో ఈ సమస్యలను సమీక్షలు నిర్వహించలేదని విశ్లేషకులు చెబుతున్నారు

Courtesy Andhrajyothy…