బైడెన్‌ ఆధిక్యం నిలిచేనా?

తటస్థ ఓటర్లతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన రాష్ట్రాలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నాయి? ట్రంప్‌, బైడెన్‌ సహా ఇప్పుడందరి మనసుల్ని వేధిస్తున్న ప్రశ్నే ఇది! మంగళవారం నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులూ తమ చివరి నిమిషం ప్రచారాల్ని ఈ రాష్ట్రాల్లోనే కేంద్రీకరించారు. సోమవారం రాత్రి దాకా ఇద్దరూ సుడిగాలిలా ఈ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శనివారం మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను వెంటేసుకొని మిషిగాన్‌లో పర్యటించి అక్కడి ఓటర్లను తిరిగి డెమొక్రాట్లవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు బైడెన్‌. నిజానికి మిషిగాన్‌ రాష్ట్రం గతంలో డెమొక్రాట్లకే ఓటు వేసేది. కానీ 2016లో ట్రంప్‌ వైపు తిరిగింది. మరోవైపు… పెన్సిల్వేనియాలో నాలుగు ప్రచార సభల్లో పాల్గొన్న ట్రంప్‌… మిషిగాన్‌, ఫ్లోరిడా, జార్జియాలను చుట్టివస్తున్నారు. అమెరికాలో చాలామంది తమ పార్టీని, తమ మద్దతును ముందే వెల్లడించేస్తారు. తద్వారా ఏయే రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, ఏ రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు మద్దతుందనేది తెలిసిపోతుంది (అలాగే ఓటు వేయాలని నియమం ఏమీ లేదు.) కొన్ని రాష్ట్రాల ప్రజలు మాత్రం తటస్థంగా ఉంటూ ఎటూ తేల్చరు. వీటినే కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఈసారి దాదాపు అన్ని కీలక రాష్ట్రాల్లోనూ బైడెనే ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

అయితే… ట్రంప్‌-బైడెన్‌ల మధ్య అంతరం చాలా స్వల్పంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతిమ ఫలితం ఎటువైపైనా మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే ట్రంప్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికిగాను… ఈ రాష్ట్రాల్లో చివరి నిమిషం దాకా పోరాడుతున్నారు.  గత ఎన్నికల మాదిరిగానే తటస్థ ఓటర్ల తథాస్థు దీవెన కోసం యత్నిస్తున్నారు. ఇటీవలి దాకా ఐయోవాలో వెనకబడ్డ ట్రంప్‌ ఆదివారం నాటి సర్వేల్లో బైడెన్‌ను దాటి 7 పాయింట్ల ఆధిక్యం సాధించటం గమనార్హం! ముఖ్యంగా పురుషుల్లో ట్రంప్‌ పట్ల మొగ్గు కనిపిస్తోందన్నది సర్వేలు చెబుతున్న మాట! ఆదివారంనాడే ట్రంప్‌ ఐదు రాష్ట్రాల్లో ఐదు సభల్లో పాల్గొన్నారు. సోమవారం ఏడు సభలతో ముగించబోతున్నారు.

Courtesy Eenadu