రెండు నెలల్లో 49 మందికి వైరస్‌
మెదక్‌లో వైరస్‌ సోకి రిటైర్డ్‌ ఉద్యోగి మృతి
బెంగళూరులో ఇద్దరు ఎస్‌ఏపీ ఉద్యోగులకూ ఫ్లూ
కార్యాలయాలను మూసేసిన ఎస్‌ఏపీ ఇండియా
ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశం
ఒకవైపు కరోనా భయం.. మరోవైపు స్వైన్‌ఫ్లూ
రాష్ట్రంలో నిశ్శబ్దంగా విస్తరిస్తున్న వైరస్‌

హైదరాబాద్‌ సిటీ, సిద్దిపేట : ప్రజలంతా ఒకవైపు కరోనా వైరస్‌ గురించి భయపడుతుంటే.. స్వైన్‌ ఫ్లూ నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతూ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో 49 కేసులు నమోదయ్యాయి.సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది. డిసెంబరు లేదా జనవరి నెలాఖరు వరకూ ఉంటుంది. ‘పుష్యమిలో పూసంత వేసంగి.. మాఘంలో మరింత ఎండ’ అన్న సామెత ప్రకారం.. ఎండలు కాస్త ముదరడం ప్రారంభించగానే వైరస్‌ ప్రభావం తగ్గుతుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరిగినా స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గలేదు. జనవరిలో 17 స్వైన్‌ఫ్లూ కేసులు.. ఫిబ్రవరిలో 32 కేసులు వెలుగుచూశాయి. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యల వంటివాటితో బాధపడుతూ కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు చేస్తుంటే.. స్వైన్‌ఫ్లూగా తేలుతోంది. ఉదాహరణకు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల దగ్గు, జ్వరం, జలుబుతో గాంధీ ఆస్పత్రికి వచ్చారు. కరోనా సోకిందన్న భయంతో వైద్యులను ఆశ్రయించారు. అక్కడ వారికి నిర్ధారణ పరీక్షలు చేయగా, స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. అలాగే, ఖమ్మం నుంచి భార్యభర్తలు, వారి కూతురు కరోనా వైరస్‌ అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో వచ్చి చేరారు. వారిని పరీక్షించగా.. తండ్రికి, బిడ్డకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 12 మంది స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వరంగల్‌ నుంచి వచ్చిన ఒక నిండు గర్భిణి స్వైన్‌ప్లూ వైర్‌సతో మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరి.. బుధవారం పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ధరణీధరస్వామి అనే వ్యక్తి స్వైన్‌ ఫ్లూతో బుధవారం సిద్దిపేటలో చనిపోయారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లకుండా సిద్దిపేటలోని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన సిద్దిపేట వైద్య శాఖ సిబ్బంది.. ధరణీధరస్వామి నివసించిన ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లి చుట్టుపక్కల ఇళ్లను సందర్శించి ఎవరికైనా వ్యాధిలక్షణాలున్నాయేమోనని ఆరా తీశారు. స్వైన్‌ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.

గర్భిణులపై ఎక్కువ ప్రభావం
స్వైన్‌ప్లూ అంటు వ్యాధి. ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకుతుంది. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారికి దగ్గరగా ఉన్నవారికి ఈ వైరస్‌ సోకే ముప్పు ఉంది. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై ఈ వైరస్‌ దాడి  చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కానీ చాలా మంది.. ‘జలుబే కదా.. దగ్గే కదా..’ అని నిర్లక్ష్యం చేసి, వ్యాధి ముదిరేదాకా ఆస్పత్రికి రావట్లేదని, దీనివల్ల ముప్పు పెరుగుతోందని వైద్యులు తెలిపారు.

బెంగళూరులో కలకలం
బెంగళూరులోని ఎస్‌ఏపీ ఇండియాలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ పాజిటివ్‌ రావడంతో ఆ సంస్థ బెంగళూరుతోపాటు, గురుగ్రామ్‌, ముంబైలో ఉన్న తన కార్యాలయాలను మూసేసింది. ఫిబ్రవరి 20 నుంచి 28 దాకా ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.

ఇవీ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు
జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నీటి నుంచి నీటిధార నిరంతరంగా రావడం, గొంతుగరగర, ఒళ్లు నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటే  స్వైన్‌ఫ్లూగా అనుమానించాలి. స్వైన్‌ఫ్లూ ఉందని అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇంకా ప్రభావం ఉంది
హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఏడాది పొడుగునా గాలిలో ఉంటుంది. కానీ.. చలికాలంలో తేమ వాతావరణం వల్ల ఎక్కువ ప్రభావం చూపుతుంది. శక్తిని పుంజుకుని ప్రజలపై దాడి చేస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు తొందరగా స్వైన్‌ఫ్లూ బారిన పడే ప్రమాదముంది. ఈ వైరస్‌ సాధారణంగా 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు బతకదు. వాతావరణం ఇంకా ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్‌ సందీప్‌, పల్మానాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి

Courtesy Andhrajyothi