• అనారోగ్యంతో స్వీడన్‌ రచయిత తుదిశ్వాస
  • భారత్‌లో ప్రజా ఉద్యమాలకు మిత్రుడు

హైదరాబాద్‌ : పీడిత, తాడిత ప్రజల సమస్యలను ఎలుగెత్తిన అరుణతార రాలిపోయింది. స్వీడన్‌ రచయిత యాన్‌ మిర్డాల్‌(93) అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు. ఆయన తల్లిదండ్రులు గున్నార్‌ మిర్డాల్‌, ఇవా మిర్డాల్‌ ఇద్దరూ నోబెల్‌ అవార్డు గ్రహీతలు. గున్నార్‌ భారత తొలి ప్రధాని నెహ్రూకు మంచి మిత్రుడిగా ఉంటూ.. ‘ఆసియాన్‌ డ్రామా’ పేరుతో వలసానంతర ఆసియా దేశాల అభివృద్ధి పథంపై  మూడు సంపుటాల ఉద్గ్రంథాన్ని రాశారు. మిర్డాల్‌ కూడా భారత్‌లో పీడిత ప్రజల గొంతుకను ప్రపంచానికి వినిపించారు. 40 ఏళ్ల క్రితం కరీంనగర్‌, ఆదిలాబాద్‌ రైతాంగ పోరాటంపై ‘ఇండియా వెయిట్స్‌’ అనే పుస్తకం రాశారు.

దండకారణ్యంలో నెలకొంటున్న బీజరూప ప్రజా రాజ్యాధికారం మీద ఎన్నెన్నో వివరణలు, విశ్లేషణలు అందించారు. 2010 ఫిబ్రవరిలో ఆయన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతిని ఇంటర్వ్యూ చేశారు. 84 ఏళ్ల వయసులో దండకారణ్యంలో తిరిగి ప్రజా ప్రత్యామ్నాయ పాలన, విప్లవోద్యమం విస్తరిస్తున్న తీరుపై ‘రెడ్‌ స్టార్‌ ఓవర్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించారు. ఇంగ్లిష్‌, స్వీడి్‌షలో ముద్రితమైన ఆ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. 2012లో ఈ పుస్తకం ‘భారత్‌పై అరుణతార’ పేరుతో ప్రచురితమైంది. ‘‘పాలకులు, పీడితుల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు.. పీడితుల పక్షమే సరైంది’’ అని ఆయన అంటుండేవారు.

Courtesy Andhrajyothi