ప్రతీ సంవత్సరం మాన్యవర్‌ కాన్షీరాం జయంతి (మార్చి 15) నుంచి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి (ఏప్రిల్ 14) వరకు మహనీయులను స్మరిస్తూ స్వేరోలందరూ భీమ్ దీక్ష చేపడతారు.

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల అభివద్ధే ధ్యేయంగా కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనలో ఆయన ఆలోచన విధానం స్ఫూర్తిగా ఉధ్బవించిన ‘స్వేరోస్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వేరోస్‌ ‘భీమ్‌ దీక్ష’లు ప్రారంభమవుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి డాక్టర్ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యలో వెలువడిన సంస్థ ఈ స్వేరోస్‌. ఆకాశమే హద్దుగా నవ సమాజ స్థాపన, విద్యే ఆయుధంగా దూసుకుపోవడం అనేది స్వేరోస్‌ సిద్ధాంతం.

ఈ భీమ్‌ దీక్షలలో దళితులే కాకుండా ఇతర వర్గాల వారు కూడా పాల్గొనేలా స్వేరోస్‌ తమ కార్యాచరణనను చేపట్టింది. సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఇయర్‌ సంక్షేమ వసతి గహాల్లో చదివిన ప్రతి స్వేరో ఫూలే, అంబేద్కర్‌ ఆశయ సాధనకు పాటుపడే ప్రతి వ్యక్తీ మానసిక, శారీరక, సామాజిక అభివద్ధే ఈ సృష్టిలో నిజమైన అభివద్ధిగా భావిస్తారు. నవ సమాజ స్థాపనకే ఈ భీమ్‌ దీక్షలు చేపడుతున్నట్లు స్వేరోస్‌ తెలిపారు. సమాజంతో కలిసి జీవించడానికి ఏర్పాటు చేసిన మహత్తర జీవన విధానమే ఈ స్వేరోదీక్ష అదే ఈ భీమ్‌ దీక్ష. ఈ భీమ్‌ దీక్ష ముఖ్యంగా నాలుగు లక్ష్యాల సాధనకు ప్రారంభించారు.

1). ఇంద్రియ నిగ్రహం 2) జ్ఞాన సముపార్జన 3) శారీరక ధృడత్వం 4) ఆరోగ్య పరిరక్షణ

ఇంద్రియ నిగ్రహం: (ధ్యానం), తమ దేహంపై పరిపూర్ణ అదుపు, మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకోడానికీ చేసే ప్రత్యేక సాధనే ఇంద్రియ నిగ్రహం సముపార్జనగా భావిస్తారు.

జ్ఞాన సముపార్జన : సష్టిలో అజ్ఞాన చీకట్లను తొలగించాలన్నారు. ఏ విషయాన్ని వెలుగులోకీ తేవాలన్నా ఒక్క చదువనే ఖడ్గం ద్వారానే సాధ్యమవుతుంది గనుకే ఇదే జ్ఞాన సముపార్జన.

శారీరక ధృడత్వం: శారీరకంగా ధడంగా ఉన్న వారే ఆరోగ్య జీవితాన్ని కొనసాగిస్తారు. కనుక ప్రతి రోజు ధ్యానం, పుస్తక పఠనం, శారీరక ధడత్వం కోసం యోగాసనాలు, వ్యాయామాలు చేయడమే శారీరక ధ డత్వం.

ఆరోగ్య పరిరక్షణ: సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ఇందులో భాగం. మత్తు పదార్థాలు, ధూమపానం సేవించకుండా నిష్టగా ఉండడమే ఆరోగ్య పరిరక్షణ.

భీమ్‌ దీక్ష చేయు విధానం
1. ఉదయం 5 గంటలకు మేల్కోని చల్లని నీటితో ముఖం కడుక్కుని, ఒక గ్లాసు మంచినీటిని తాగాలి.
2. కాలక త్యాలు తీర్చుకున్న అనంతరం మరొక గ్లాసు నీటిని తాగి దీక్షకు పూనుకోవాలి.
3. దీక్షాపరులు మొదటగా పది ఆజ్ఞలు పఠించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి ఇంద్రియ నిగ్రహణ కోసం 20 నిమిషాలు కండ్లు మూసుకుని ఒక్కో ఆజ్ఞ ఉచ్ఛరిస్తు సాధన చేయాలి.
4. ధ్యానం ముగించిన తర్వాత శారీరక ధ్యానం చేయాలి. వయస్సు తేడాను బట్టి 30, నుంచి 40 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.
5. వ్యాయామం ముగిసిన తర్వాత తలస్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి దీక్ష సమయంలో చేతి బ్యాండ్‌, టీ షర్ట్‌ వేసుకుని దీక్షకు ఉపక్రమించాలి.
6. పూర్వీకుల మనోభావాలకు వందన సమర్పణ చేసి వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి, ధూప దీపాలను వెలిగించి పరిమళమైన వాతావరణాన్ని స ష్టించాలి.
7. మహానీయుల చిత్ర పటాల ముందు ప్రతి స్వేరో కుటుంబ సమేతంగా ప్రతిజ్ఞ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలపాలి.
8. స్వేరోలు ఒక సమూహంగా ఏర్పడి పుస్తక పఠనం చేయాలి. సమయానుకూలంగా అరగంట పాటు మహానీయులు, మేధావుల జీవితాలను తెలిపే పుస్తకాలను చదవాలి.

సాయంకాల దీక్షా సమయం..
1. దినచర్య ముగియగానే సాయంకాల దీక్షలో ప్రతి స్వేరో ప్రత్యేక కార్యక్రమాలు కల్గి ఉండాలి.
2. ఎక్కువగా సాయంకాలం సమయంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరాల్లో సమావేశం జరపడానికీ ప్రయత్నించాలి.
3. స్వేరోలు సమూహంగా ఏర్పడి పిల్లల భవిష్యత్తు, వారి జీవితాల అభివృద్దిపై చర్చించాలి.
4. ఉదయం చదివిన పుస్తకాలను నేర్చుకున్న అంశాలను చర్చించాలి.
5. పిల్లలకు వీలైనంత వరకు చుదువుకు సంబంధించిన విషయాలూ భోధించాలి.
. స్వేరో కార్యక్రమాలు, వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు చర్చించాలి.
7. వీలైనంత వరకు కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేయాలి.
8. పడుకునే ముందు ప్రతి స్వేరో మరుసటి రోజు చేయవలసిన పనులను గుర్తించి చర్చించాలి. అందరు కలిసి పది ఆజ్ఞలను చదివి నిద్రకు ఉపక్రమించాలి.
9. ప్రతి స్వేరో 5 నుంచి 6 గంటల కలతలేని నిద్ర పోవాలి.

దీక్ష వల్ల కలిగే ఫలితం
1. భీం దీక్ష చేసే ప్రతి వ్యక్తి సంపూరర్ణ స్వేరోగా సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధిస్తారు.
2. దీక్ష ద్వారా స్వేరోలుగా మారిన వారికీ సంపూర్ణ మన్ణశాంతి, ఆరోగ్యం, జ్ఞానం, ధడ సంకల్పం, ఖచ్చితమైన లక్ష్యాలు, సానుకూల దక్పథం, విజయ రహస్యాలు చేకూరుతాయి.
3. దీక్ష ద్వారా ప్రతి స్వేరో జీవితానికీ కావాలసిన మానసిక స్థైర్యం, సానుకూల దక్పథం, సమాజంలో సోదరభావం, బలమైన కుటుంబ సంబంధాలు ఏర్పరుచుకుంటారు.

స్వేరోల పది ఆజ్ఞలు
1. నేను ఎవరికంటే తక్కువ కాదు.
2. నేను ఎక్కడ ఉన్నా నాయకుడిగా ఉంటాను.
3. నేను ఇష్టమైన దానిని ఇతరుల కంటే భిన్నంగా చేస్తాను.
4. నేను ఎప్పుడు గొప్పగా ఉన్నత ఆశయాలు కల్గి ఉంటాను.
5. నేను ఎప్పుడు నిజాయితీగా సమయానుకూలంగా కష్టపడతాను.
6. నేను ఎప్పుడు నా వైఫల్యాలకు ఇతరులను నిందించను.
7. నేను ఎప్పుడూ ఇతరులను ఏది అడగను. మోసం చేయను.
8. నేను తీసుకున్న దానిని తిరిగి చెల్లిస్తాను.
9. నేను ఎప్పుడు తెలియని దాని గురించి భయపడను.
10. నేను ఎప్పుడూ వదిలివేయను.