వలస కార్మికులపై లాక్‌డౌన్‌ పిడుగు
92.5 శాతం కార్మికుల ఉపాధికి దెబ్బ
ఆకలి మంటల్లో 80 శాతం కుటుంబాలు
రేషన్‌ కావాలంటున్న 42 శాతం మంది

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ్యవాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలస కార్మికులు, రోజువారీ కూలీల జీవనం దుర్భరంగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కనీస సాయం అందక బడుగుజీవులు ఆగం అవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా 92.5 శాతం కార్మికులు వారం నుంచి మూడు వారాల ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని శ్రామిక వర్గాలు వాపోతున్నాయి.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బడుగు జీవుల వెతలపై ‘జన్‌ సాహస్‌’ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన టెలిఫోనిక్‌ సర్వే చేదు నిజాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు తమకు రేషన్‌ అందలేదని 42 శాతం మంది గోడు వెల్లబోసుకున్నారు. నెలవారీ సాయం కంటే ముందు తమకు వెంటనే రేషన్‌ ఇవ్వాలని వారు అడుగుతున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఉపాధి దొరకదేమోనన్న ఆందోళనతో 83 శాతం మంది కార్మికులు ఉన్నారు. నిర్బంధం ప్రభావంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందన్న భయం 80 శాతం మంది శ్రామికులను పీడిస్తోంది.

సర్వేలో భాగంగా ఉత్తర, మధ్య భారత దేశంలోని 3,196 నిర్మాణ రంగ వలస కార్మికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 94 శాతం మందికి జాబ్‌కార్డులు లేనందు వల్ల ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వీరికి అందదు. 55 శాతం మంది రోజువారి సంపాదన 200 నుంచి 400 రూపాయలు మాత్రమేనని సర్వేలో తేలింది. ఇలాంటి వారి కుటుంబాల్లో కనీసం నలుగురు సభ్యులు ఉంటారని అంచనా. రోజుకు 400 నుంచి 600 సంపాదించే వారు 39 శాతం మంది. దీన్ని బట్టి చూసుకుంటే కనీసం వేతనాల కంటే వీరికి చాలా తక్కువగా చెల్లిస్తున్నారని అర్థమవుతోంది.

దేశ జిడిపిలో నిర్మాణ రంగం వాటా సుమారు 9 శాతం. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో వలస కార్మికులు(5.5 కోట్ల మంది) నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. నిర్మాణ రంగం, కర్మాగారాల్లో ఉపాధి కోసం ప్రతి ఏడాది 90 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో అంతర్గత వలసదారుల సంఖ్య 37 శాతం లేదా 45 కోట్లు. 2001తో పోల్చుకుంటే ఇది 45 శాతం అధికం. కాగా, లాక్‌డౌన్‌తో అనధికారిక వలస కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హైకమిషనర్‌ మిచెల్‌ బాచెలెట్‌ పేర్కొన్నారు. ఎటువంటి గడువు ఇవ్వకుండా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయి, తినడానికి, ఉండటానికి లేక వలస కార్మికులు నగరాలను వదిలివెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.