సుప్రియా శర్మ… ఉత్తరప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. స్క్రోల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ న్యూస్‌ ఛానెల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మన దేశ ప్రధాని దత్తత పట్టణంలోని దారుణ జీవన పరిస్థితులను కళ్లకు కట్టేలా రాశారామె. ప్రభుత్వం ఆమెపై తప్పుడు కేసుల బనాయింపు మొదలెట్టింది! నిజం రాసినందుకు కలంపై కత్తి ఎత్తిపెట్టింది. అయినా, సరే.. బెదరలేదు సుప్రియ. ప్రజాపక్షమే తన అక్షర ప్రస్థానమని గట్టిగా గొంతెత్తి చెబుతోంది!

పదేళ్ల క్రితం ఎన్‌డిటివిలో ముంబయి రిపోర్టరుగా తన ప్రస్థానం ప్రారంభించారు సుప్రియా. ఆమె రాసే కథనాల్లో ప్రజల వాస్తవ స్థితిగతులుంటాయి. ప్రజల దైనందిన కార్యకలాపాలపై కాకుండా విపత్తులపై రిపోర్టింగ్‌ చేసేవారు ఆమె. రైలు ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, వరదలు, సునామీ తరువాత నెలకొన్న పరస్థితులు వంటి వాటిపై సమగ్ర అధ్యయనం ఆమెకే సొంతం. ఒకపక్క మెట్రోపాలిటన్‌ ఇండియా అని ఊదరగొడుతున్న పాలకులు, మరోపక్క ఛిద్రమౌతున్న అట్టడుగు గ్రామీణ జీవితాలు, గిరిజన ప్రాంతాల్లో ఆకలి చావులు, పెరుగుతున్న పిల్లల మరణాలు, కరువు, అప్పులు, వ్యవసాయ సంక్షోభం వంటి వాటిపై ఆమె కథనాలు ఉంటాయి.

2005లో ముంబయిలోని కొన్ని కర్మాగారాల్లో పనిచేసే పిల్లలను పోలీసులు రక్షించి వారి స్వస్థలమైన బీహార్‌కు పంపించడం ఆమె దృష్టికి వచ్చింది. బాలకార్మిక వ్యవస్థ గురించి తెలిసిన వారెవరైనా దీన్ని సాధారణంగా తీసుకుంటారు. కాని సుప్రియా శర్మ అలా అనుకోలేదు. ఈ కథ ఆమెను ఆ బాలల వెంటే అంటే దేశంలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌కు నడిపించింది. అక్కడే ఏడాదిపాటు ఉండి పిల్లల వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేలా చేసింది. ‘ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌’ అంటూ పాలకులు చెప్పుకొస్తున్న కబుర్లలో దాగి ఉన్న వాస్తవాల వైపు అంటే దేశ ప్రజలు, వారు ఉంటున్న ప్రదేశాల వైపు నన్ను నడిపిస్తుంటాయి’ అని ఒక సందర్భంలో చెప్పారు.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఛత్తీస్‌గఢ్‌ కరస్పాండెంట్‌గా కొన్నేళ్లు సుప్రియా విధులు నిర్వర్తించారు. మావోయిస్టుల హింసాయుత ఉద్యమం ద్వారా ప్రభావమైన ఆ ప్రాంతం, నిత్యం సంఘర్షణలకు నెలవై ఉంటుంది. అక్కడ కూడా ఆమె తన పంథా కొనసాగించారు. అక్కడి వాస్తవ పరిస్థితులపై ఎన్నో రచనలు కూడా చేశారు.

ప్రభుత్వ పాలన ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతోంది అనేదానిపై కూడా ఆమె విస్తృత కథనాలు అందించారు. ‘ఆత్మనిర్భర్‌’ గురించి ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలకు సూటిగా తగిలేలా ‘ఆత్మనిర్భర్‌ బెనారస్‌’ : ఒక పురాతన నగరాన్ని ఆధునిక కాలంలో ఎదురైన విపత్తు నుంచి ఎలా రక్షించింది? అంటూ ఒక కథనం రాశారు. ‘మూడు కోట్ల మంది ప్రజలు, ఒక కరోనా పరీక్ష కేంద్రం – ఇదీ తూర్పు ఉత్తరప్రదేశ్‌ సంక్షోభం’ అంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగంపై మరో కథనం ఇచ్చారు. దానికిముందు ‘ఈ లాక్‌డౌన్‌ కాశీలోని ప్రజల జీవితాలనే కాదు, శవాల వ్యాపారాన్ని కూడా దెబ్బతీసింది’, ‘ఈ టెక్స్‌టైల్‌ నగరంలో లాక్‌డౌన్‌ ముగింపుకొచ్చిందంటే పనులకు ప్రారంభం కాదు.. ఎందుకని? అంటూ వరుస రచనలు చేశారు. వలస కార్మికుల వెతలపై ఆమె రాసిన కథనాలు వాస్తవాలను ప్రతిబింబించాయి. ‘వారు నిలబడిన చోటుకు ఆ రైలు రాదని వారికి ఎవరూ చెప్పలేదు. దీంతో 30 కి.మీ నడుచుకుంటూ వచ్చిన ఆ వలస కార్మికులు రైలు కోసం ఆ స్టేషనులో నాలుగు రోజులు వేచి చూశారు.’ అంటూ రాసిన కథనం శ్రామిక రైళ్ల రవాణాలో అవకతవకలకు అద్దం పడుతోంది.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన మొదటి నెల రోజుల వ్యవధిలో ప్రజలు పడిన కష్టాలను కళ్లకు కట్టేలా ఆమె ఎన్నో కథనాలు రాశారు. ‘రైలు లేదు, బస్సు లేదు, కేవలం ఒక సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌ 600 కి.మీ. ప్రయాణించింది ఒక ఖాళీ కడుపు సవారిలో’ అని రాసిన కథనం అప్పటి పరిస్థితికి వాస్తవ రూపం. ప్రధాని మోడీ దత్తత తీసుకున్న ఇటీవల వారణాసిలో ప్రజలు ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఆకలితో అలమటించారంటూ రాసిన కథనం పాలకులకు కోపం కలిగించింది. ఆ ప్రాంతంలోని గ్రామీణులు కనీస సౌకర్యాల కోసం, నిత్యావసరాల కోసం, అలమటిస్తున్నారు. అక్కడ క్షీణించిన ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తూ చేసిన కథనంలో ఎంతోమంది గ్రామీణుల బతుకుచిత్రం మనకు కనబడుతుంది. ఈ కథనం రాసినందుకు ఆమెపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. అవాస్తవాలు, అసత్యాలతో పాలన చేసేవాళ్లు ఒక పట్టాన నిజాలను ఒప్పుకోరు. పైగా నిజాన్ని నిర్భయంగా నిగ్గుతేల్చిన వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తారు. అయితే సుప్రియా శర్మకు ఇవేమీ కొత్తగాదు. ఆమె ఎంచుకున్న మార్గం పూలబాట కాదు. అందుకే ఎన్ని అవాంతరాలెదురైనా నిజాన్ని వెలుగులోకి తెస్తుంది. ”ఈ ప్రయాణంలో ఎంతటి ఆపదనైనా ఎదుర్కోవటానికి సిద్ధమైన తరువాతే – నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను..” అంటారామె ధైర్యంగా.

Courtesy Prajasakti