పి. చిదంబరం

కొంచెం తాత్కాలిక భద్రత కోసం ఆవశ్యక స్వేచ్ఛను వదులుకునేవారు స్వేచ్ఛకు గానీ, భద్రతకు గానీ అర్హులు కారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మీరు ఈ కాలమ్ చదివే వేళకూ జమ్మూ-కశ్మీర్‌లో ఇంటర్నెట్, మనుషుల కదలికలు, బహిరంగ సమావేశాలు, రాజకీయ కార్యకలాపాలు, మాటలు, రాతలు, సందర్శకుల ఆగమనంపై ఆంక్షలు కొనసాగుతూనే వుంటాయి. ఎటువంటి అభియోగాలు లేకుండానే రాజకీయ నాయకులు గృహ నిర్బంధంలో కొనసాగుతూనే వుంటారు. మరి, ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపి, ఈ నెల 10న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం ఆ దుస్తర పరిస్థితుల్లో నిజంగా ఏమైనా మార్పు సంభవించిందా?

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తరుణంలో ఒక సాయంత్రం( 2019 ఆగస్టు 4) జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని మూసివేశారు. ఆ హిమాలయ రాష్ట్రాన్ని, విశాల భారతదేశంతో సంబంధాలు లేని ఏకాకిని చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన కొత్త పాలక బృందం- గవర్నర్, సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తదితరులకు భారత రాజ్యాంగం పట్ల పెద్దగా గౌరవం లేదు. కశ్మీర్ లోయలో అదే సాయంత్రం మొబైల్ ఫోన్ నెట్ వర్క్స్ , ఇంటర్నెట్ సర్వీసెస్, ల్యాండ్ లైన్ కనెక్టివిటీని నిలిపివేశారు. మనుషుల కదలికలపై ఆంక్షలు విధించారు. 2019 ఆగస్టు 5న రాజ్యాంగ ఉత్తర్వు 272ను రాష్ట్రపతి జారీ చేశారు.

జమ్మూ-కశ్మీర్‌కు రాజ్యాంగ 370 అధికరణ కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని ఆ రాజ్యాంగ ఉత్తర్వు తొలగించింది. ఆ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ఉత్తర్వు పేర్కొంది. ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత రాజ్యాంగ నిబంధనలు అన్నీ వర్తిస్తాయని రాజ్యాంగ ఉత్తర్వు 272 తెలిపింది. అదే సాయంత్రం జిల్లా మెజిస్ట్రేట్‌లు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144ని అమలులోకి తెచ్చారు. ప్రజల కదలికలు, బహిరంగ సమావేశాల పైన ఆంక్షలు విధించారు. వందలాది రాజకీయ నాయకులు, కార్యకర్తలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ఎటువంటి అభియోగాలు మోపకుండానే గృహ నిర్బంధంలో ఉంచారు.

అనూరాధా భాసిన్ (ఎక్జిక్యూటివ్ ఎడిటర్, కశ్మీర్ టైమ్స్), గులాం నబీ ఆజాద్(పార్లమెంటు సభ్యుడు) ఆ ఆంక్షలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని పిటిషనర్లు వాదించారు. తమ దినపత్రికను ప్రచురించలేకపోతున్నానని, పత్రికా స్వాతంత్ర్యం కాలరాచివేయబడిందని అనూరాధా భాసిన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘జాతీయ ప్రయోజనాలను, ఆంతరంగిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్‌లో సాధారణ పౌర జీవనం పునరుద్ధరణకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని’ సుప్రీం కోర్టు 2019 సెప్టెంబర్ 16న, ఆ సరిహద్దు రాష్ట్ర కొత్త పాలకులను ఆదేశించింది. భయపడినట్టుగానే కశ్మీర్‌లో సాధారణ పౌర జీవనం పునరుద్ధరణకు నోచుకోలేదు. ‘కొన్ని ఆంక్షలను సడలించినట్టు’ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన నివేదనను సుప్రీం కోర్టు 2019 అక్టోబర్ 10న రికార్డు చేసింది.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా పాటించేలా తాత్కాలిక ఉత్తర్వు ఏదీ సర్వోన్నత న్యాయస్థానం జారీ చేయలేదు. మరి జమ్మూ-కశ్మీర్ లో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో పరిస్థితులు యథాపూర్వంగా వుండిపోయాయని చెప్పవలసిన అవసరమున్నదా?

అనురాధా భాసిన్, గులాం నబీ ఆజాద్ తదితరుల పిటిషన్లపై సుప్రీం కోర్టు చాలా రోజులపాటు విచారణ జరిపింది. 2019 నవంబర్ 27న నిలిపివేసిన తీర్పును 2010 జనవరి 10 న వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం ఐదు వాదనలను పరిగణనలోకి తీసుకున్నది. ఆ అంశాలు, వాటికి కోర్టు సమాధానాలను క్లుప్తంగా చూద్దాం.

(1) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద ఉత్తర్వుల జారీకి మినహాయింపును కోరే అధికారం ప్రభుత్వానికి వున్నదా? సమాధానం: లేదు. (2) వాక్ స్వాతంత్ర్యం, ఇంటర్నెట్ ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రాథమిక హక్కులా? సమాధానం: అవును. రాజ్యాంగ అధికరణ 19 లోని నిబంధనలు (1) ( ఎ), (జి) కింద ఇంటర్నెట్‌ను నిలిపివేసే ప్రతి ఉత్తర్వును, జారీ అయిన 7 రోజులలోగా సమీక్షించాలి(వెనకటి సమీక్ష జరిగిన 7 రోజుల్లోగా నిర్ణీత సమయంలో విధిగా సమీక్షిస్తుండాలి). (3) ఇంటర్నెట్ సదుపాయం ఒక ప్రాథమిక హక్కా? కోర్టు సమాధానమివ్వలేదు. ( 4) సెక్షన్ 144 కింద ఆంక్షలు చట్టబద్ధమేనా?

సమాధానం: అధికారం నిరోధక, ప్రతిక్రియాత్మక స్వభావం కలది కనుక, సదరు ఉత్తర్వులు దామాషా సూత్రం ప్రాతిపదికన హక్కులు, ఆంక్షలు మధ్య సమతుల్యత సాధించే విధంగా జారీచేయాలి. ఆ ఉత్తర్వులను పదేపదే జారీ చేయకూడదు. ఈ దృష్ట్యా సెక్షన్ 144 కింద జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగించవలసిన అవసరాన్ని తక్షణమే సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. (5) పత్రికా స్వేచ్ఛ ఉల్లంఘింపబడిందా? సమాధానం: పత్రికా స్వాతంత్ర్యాన్ని సర్వకాలాలలోను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని కోర్టు విశ్వసిస్తున్నది.

సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలు (కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం పట్ల విముఖత) ఆశ్చర్యం కలిగించడం లేదు. తీర్పు మొదట్లోనే సుప్రీం కోర్టు తన దృక్పథాన్ని స్పష్టం చేసింది: ‘మా పరిధి పరిమితమైనది. స్వేచ్ఛ, భద్రత మధ్య సమతుల్యతను సాధించడం వరకే మాకు అధికారమున్నది. ఒక నిర్దిష్ట పరిస్థితిలో పౌరులకు గరిష్ఠ స్థాయిలో అన్ని హక్కులను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సమకూర్చడం, అదే సమయంలో భద్రతకు ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా చూడడమే మా బాధ్యత.’

జమ్మూ-కశ్మీర్‌లో ‘సాధారణ పరిస్థితుల’ను పూర్తిగా కాపాడుతున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకొంటున్నది. ఏమిటో ఆ ‘సాధారణ’ పరిస్థితులు’? 2019 ఆగస్టు 4– -2020 జనవరి 13 మధ్య కాలంలో కశ్మీర్‌లో 20 మంది పౌరులు, 36 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఎనిమిది మంది భద్రతా సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారు. మీరు ఈ కాలమ్ చదివే వేళకూ జమ్మూ-కశ్మీర్‌లో ఇంటర్నెట్, మనుషుల కదలికలు, బహిరంగ సమావేశాలు, రాజకీయ కార్యకలాపాలు, మాటలు, రాతలు, కశ్మీర్ లోయకు సందర్శకుల ఆగమనంపై ఆంక్షలు కొనసాగుతూనే వుంటాయి. ఎటువంటి అభియోగాలు లేకుండానే రాజకీయ నాయకులు పోలీసు, గృహ నిర్బంధంలో కొనసాగుతూనే వుంటారు. మరి, ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపి, ఈ నెల 10న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం ఆ దుస్తర పరిస్థితుల్లో నిజంగా ఏమైనా మార్పు సంభవించిందా?

ఈ వ్యాసం ఆరంభంలో ఉటంకించిన అమెరికా రాజనీతిజ్ఞుని సుభాషితం ఒక సార్వకాలిక సత్యం. ఆయన ఆ సత్యాన్ని ఒక భిన్న సందర్భంలో చెప్పినస్పటికీ స్వేచ్ఛ, భద్రతకు మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడల్లా వివేకశీలురకు ఆ ప్రామాణిక సత్యం గుర్తుకొస్తూనే వుంటుంది. కశ్మీర్ సంబంధిత పిటిషన్ల విచారణలో సుప్రీం కోర్టు తన మార్గదర్శక సూత్రంగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ సూక్తిని స్వీకరించి వుంటే సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలు భిన్నంగా వుండేవి కావూ?

కశ్మీర్ సమస్యకు నిరంకుశాధికార, సైనిక పద్ధతుల్లో పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఆ పద్ధతుల నుంచి వెనుదిరిగేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఒక మార్గాన్ని కల్పించింది. అయితే ప్రభుత్వం ఆ మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? నాకు నమ్మకం లేదు.

సుప్రీం కోర్టు తీర్పు కశ్మీర్ లోయలోని 70 లక్షల మంది ప్రజలలో ఒక ఆశాజ్యోతిని వెలిగించింది. కోల్పోయిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పునరుద్ధరింపబడతాయనే ఆశాభావాన్ని ఆ తీర్పు వారిలో కలిగించింది. అయితే, ఆ తీర్పు వెలువడి ఇప్పటికే ఏడు రోజులు గడిచిపోయాయి. అంకురించిన ఆశ ఇంకా మోసులెత్తడం లేదు.

ప్రతివాదులు (కేంద్ర ప్రభుత్వం, జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు) సంతోషంగా లేవు. ఎందుకని? తమ నిర్ణయాలు, చర్యలపై నిరంతరం న్యాయ సమీక్ష జరగడం పాలకులకు రుచించడం లేదు మరి. పిటిషనర్లూ సంతృప్తికరంగా లేరు, ఎందుకని? వారికి న్యాయ సంబంధమైన ప్రతిపాదనలే గాని, నిజమైన ఉపశమనం లభించనే లేదు కదా.

ప్రైవసీ కేసు (జస్టిస్ పుట్టస్వామి)లో వలే కశ్మీర్ విషయంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం మరెంతో చేసి వుండవల్సింది. ఒక అవకాశం వ్యర్థమై పోయింది. బహుశా, కశ్మీర్ కేసు తదుపరి విచారణలో కోర్టు మరింత ఉపశమనాన్ని సమకూర్చవచ్చు లేదా తదుపరి కేసు విచారణ సందర్భంగానైనా అది జరగవచ్చు. ఒక్కొక్కప్పుడు న్యాయం నిరుత్సాహపరుస్తుంది సుమా!

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)