• మోదీ సర్కారుకు సుప్రీం కోర్టు క్లీన్‌ చిట్‌
  • ఒప్పందంలో ధరపై సంతృప్తి చెందాం
  • సమీక్ష పిటిషన్లకు విచారణార్హత లేదు
  • దాఖలైన అన్ని పిటిషన్ల కొట్టివేత
  • సీబీఐ తీసుకునే చట్టపరమైన చర్యలకు
  • సుప్రీం అడ్డు కాదన్న జస్టిస్‌ జోసెఫ్‌

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ కంపెనీ దసోతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం రైటేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది! రాఫెల్‌ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించి.. 2018 డిసెంబరు 14న మోదీ సర్కారుకుక్లీన్‌ చిట్‌ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, గురువారం మరోసారి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సహా ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి 2019 మే 10న రిజర్వు చేసిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసె్‌ఫతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం వెలువరించింది. సమీక్ష పిటిషన్లకు విచారణ యోగ్యత లేదని స్పష్టం చేసింది. రాఫెల్‌ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థన సముచితం కాదని అభిప్రాయపడింది. రాఫెల్‌ ఒప్పందంలో నిర్ణయ ప్రక్రియ, ధర, భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపిక అనే మూడు అంశాలపై అన్ని పక్షాల న్యాయవాదులు సమర్పించిన పత్రాలను విస్తృతంగా పరిశీలించామని.. కాబట్టి ఈ విషయంలో ఆదేశాలూ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదని స్పష్టం చేసింది. చూడగానే తప్పు అనిపించేలా ఉంటే తప్ప రివ్యూ పిటిషన్లను స్వీకరించలేమని తేల్చిచెప్పింది.

నిర్ణయ ప్రక్రియపై..
రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించి నిర్ణయ ప్రక్రియలో కొందరు వెలువరించిన అభిప్రాయాలు.. తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఉన్నాయనడంలో సందేహం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, నిర్ణయ ప్రకియ్రలో భాగంగా చర్చలు జరిపి, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాకే సంబంధిత అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని గుర్తుచేసింది. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్‌ ప్రభుత్వ సావరిన్‌ గ్యారంటీ లేకపోవడాన్ని, విమానాల కొనుగోల ధర పెరుగుదలపై భారత చర్చల బృందంలోని ముగ్గురు నిపుణుల అభ్యంతరాలను పట్టించుకోకపోవడం గురించి, భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంచుకోవడం గురించి సుప్రీం ప్రస్తావించింది. ఒప్పందంలోని ప్రతి అంశాన్ని నిర్ణయించే అప్పిలేట్‌ అథారిటీ లాగా పిటిషనర్లు తమను తాము భావించుకుంటున్నట్టుగా.. కోర్టు కూడా తమలాగే చేయాలని భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

ఆ రెండూ ఏవి?
మెజారిటీ తీర్పును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ రాయగా.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ దాంతో ఏకీభవిస్తూనే, తన అభిప్రాయాలను ప్రత్యేక తీర్పులో వివరించారు. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలు, అక్రమాల మీద వచ్చిన ఫిర్యాదులపై సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన తీర్పు అడ్డంకి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న నేరాలు విచారించదగినవనడంలో ఎలాంటి వివాదమూ లేదని స్పష్టం చేశారు. అయితే, సమీక్ష పిటిషన్‌ వేసిన ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌శౌరి, యశ్వంత్‌ సిన్హా కోరినట్టుగా సీబీఐ విచారణ వేసేందుకు కోర్టు ఎలాంటి ఆదేశమూ ఇవ్వజాలదని పేర్కొన్నారు. లలితకుమారి కేసులో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక విచారణ అనంతరం మాత్రమే అవినీతి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ వేయాల్సి ఉంటుందని, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌ ప్రకారం విచారణకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమని ఆ రెండూ ఈ కేసులో లేవని ఆయన స్పష్టం చేశారు. ఆ రెండూ లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశాలు ఇస్తే అది నిష్ఫలమే అవుతుందని పేర్కొన్నారు.

రివ్యూ పిటిషన్లలో ఏం కోరారంటే..
రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ ఏడాది జనవరి 2న సుప్రీంను ఆశ్రయించారు. ‘‘కేంద్రం సంతకం చేయకుండా, తప్పుడు వివరాలతో సీల్డు కవర్లో ఇచ్చిన అఫిడవిట్‌ను ప్రాతిపదికగా చేసుకుని సుప్రీం బెంచ్‌ ఆ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలపై మా వాదన వినేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇది న్యాయ విఘాతమే. తీర్పులో చాలా లోపాలున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీబీఐ చేత విచారణ జరపాలని ఒక పిల్‌లో కోరాం. దాన్ని ధర్మాసనం స్పృశించనే లేదు. ఫలితంగా ఒప్పందంలోని వివాదాస్పద అంశాలపై విచారణ జరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. రాఫెల్‌ ఒప్పందంపై విచారణ జరపాల్సిందిగా అక్టోబరులోనే మేం సీబీఐని సంప్రదించాం. అయితే సీబీఐ ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆ ఎఫ్‌ఐఆర్‌ కోసం కోర్టును ఆశ్రయించాం. సంస్థాగత దర్యాప్తు లేకుండా చేసి కోర్టు తప్పిదం చేసిందని భావించాల్సి వస్తోంది. పిటిషనర్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఏం విచారణ జరిపినదీ సీబీఐ వెల్లడించడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది’’ అని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

రాఫెల్‌ యుద్ధ విమానాల ధర విషయంలో మా ముందున్న వివరాలతో న్యాయస్థానం సంతృప్తి చెందింది. విమానాల ధర నిర్ణయం కోర్టు పని కాదు. మాకు సమర్పించిన పత్రాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత.. యాపిల్‌ పండ్లను నారింజ పండ్లతో పోల్చరాదనే అభిప్రాయానికి వచ్చాం.

– సుప్రీం కోర్టు