సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ప్రతిపాదిత నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల నుంచి ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న నిరసనలపై దాఖలైన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిరసనల కోసం రోడ్లను దిగ్బంధించకూడదని వివరించింది. ఈ విషయంలో సమతూకం పాటించాల్సిందిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజరు కిషన్‌, కె.ఎం జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అలాగే షాహీన్‌బాగ్‌ నిరసనకారులతో మాట్లాడటానికి ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులతో కూడిన మధ్యవర్తిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా సంజరు హెగ్డే, సాధనా రామచంద్రన్‌లు ఉన్నారు. షాహీన్‌బాగ్‌ నిరసనకారులతో మాట్లాడి నిరసన వేదికను అక్కడి నుంచి వేరొక చోటుకు తరలించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలని న్యాయస్థానం సీనియర్‌ న్యాయవాదులకు సూచించింది. ఈ ప్రక్రియకు సహాయం అందించడానికి మాజీ సమాచార ప్రధాన కమిషనర్‌ వజాహత్‌ హబీబుల్లాను నియమించింది. నిరసనకారులతో చర్చలు విఫలమైతే తదుపరి నిర్ణయాన్ని అధికారులకే వదిలేస్తామని న్యాయస్థానం తెలిపింది. అయితే చర్చల్లో మాత్రం తగిన పరిష్కారం లభిస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పింది.
కాగా, ఈ అంశంలో సహేతుకమైన పరిష్కారంతో రావాలని షాహీన్‌బాగ్‌ నిరసనకారులకు కోర్టు సూచించింది. ఆందోళనలను కొనసాగించొచ్చన్న న్యాయస్థానం.. అవి నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ఉండరాదని తెలిపింది. ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయాలని తాము అనుకోవడం లేదని ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, తిరుపతిలో భారీ ర్యాలీ జరిగింది. ఇక్కడ సీతారాం ఏచూరి, విజయన్‌, కేసీఆర్‌, మమతబెనర్జీ, తదితర నేతల ఫోటోలతో కూడిన ప్లెక్సీలను ప్రదర్శించారు. ఇంకా ప్రకాశం, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
సీఏఏ, ఎన్నార్సీలపై ఇంటింటి ప్రచారం ప్రారంభించిన లక్నో క్లాక్‌ టవర్‌ మహిళా నిరసనకారులు
దాదాపు నెల రోజుల నుంచి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా.. షాహీన్‌బాగ్‌ ప్రేరణతో లక్నోలోని క్లాక్‌ టవర్‌(ఘంటాఘర్‌) వద్ద నిరసనలు చేస్తున్న మహిళలు మరో ముందడుగు వేశారు. పౌర నిరసనలపై యూపీ సర్కారు ఉక్కుపాదం మోపి నిరసనకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నప్పటికీ.. మహిళలు మాత్రం భయపడటం లేదు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారి మద్దతును కూడగట్టేందుకు క్లాక్‌టవర్‌ నిరసనకారులు ‘ఇంటింటి ప్రచారం’ను ప్రారంభించారు. వీరి నిరసనలకు మద్దతు తెలుపుతున్న ఆలిండియా డెమోక్రటిక్‌ ఉమెన్‌ అసోసియేషన్‌(ఐద్వా).. ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టింది.

రాష్ట్ర రాజధానిలోని క్లాక్‌టవర్‌ వద్ద కొంత మంది మహిళలతో ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతంగా మారాయి. వేలాది మంది మహిళలు తమ చిన్నారులు, కుటుంబసభ్యులతో కలిసి సీఏఏ ఆందోళనకారులకు మద్దతుగా నిలిచి నిరసనలకు ఊపిరిలూదారు. దీంతో ప్రస్తుతం ఆ నిరసన ప్రాంతమంతా జాతీయ గీతం, రాజ్యాంగ పీఠిక పఠనంతో పాటు దేశభక్తి పాటలు, నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నది. ”గాంధీ కోసం, అంబేద్కర్‌ బాటలో(గాంధీ కె వాస్తే, అంబేద్కర్‌ కె రాస్తే)”, ”పత్రాలను చూపబోం(కాగజ్‌ నహీ దిఖాయేంగే” వంటి నినాదాలు అక్కడ తరచూ వినబడుతున్నాయి.
”మేము ఇక్కడ నెల రోజుల నుంచి దీక్షలో కూర్చున్నాం. తొలుత మా నిరసనలకు టెంట్లు, విద్యుత్‌, టారులెట్‌ వంటి వసతులు, సౌకర్యాలు కల్పించకుండా మమ్మల్ని యోగి సర్కారు ఇబ్బందులకు గురిచేసింది. మా కుటుంబాలకు చెందిన మగవారిని పోలీసులు బెదిరింపులకు గురిచేశారు. అయినప్పటికీ మేము ఏ మాత్రమూ నిరుత్సాహపడలేదు. రోజురోజుకూ మా ఆందోళన మహౌధృతంగా మారుతున్నది” అని క్లాక్‌టవర్‌ నిరసనకారులు తెలిపారు.

జామియా హింసపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
దేశరాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) వర్సిటీలో పోలీసుల హింసాత్మక చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీహైకోర్టు సోమవారం విచారించింది. పోలీసుల లాఠీచార్జి సందర్భంగా తన రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయనీ, తనకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించాలంటూ వర్సిటీ విద్యార్థి షయాన్‌ ముజీబ్‌ ఈ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు న్యాయస్థానం నోటీసులు పంపింది. ఈ కేసుపై న్యాయస్థానంలో వాదోపవాదనలు జరిగాయి. శస్త్ర చికిత్సలకు తాను రూ.2.5 లక్షలు వెచ్చించాననీ ఈ సందర్భంగా బాధిత విద్యార్థి కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో తదుపరి విచారణను న్యాయస్థానం మే 27కు వాయిదా వేసింది. గతడిసెంబర్‌ 15న జామియాలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై వర్సిటీ లోపలికి ప్రవేశించి మరి లాఠీలు ఝుళిపించి రణరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నాటి ఘటనలో పోలీసు దాష్టీకాన్ని బయటపెడుతూ సీసీటీవీ ఫుటేజీలను జామియా విద్యార్థులు రెండు రోజుల క్రితమే బయటపెట్టిన విషయం విదితమే.
చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకూ నిరసనల్లోనే

పూణే షాహీన్‌బాగ్‌మహిళలు
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పూణేలో మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి. షాహీన్‌బాగ్‌ ప్రేరణతో గతనెల 28 నుంచి మోమిన్‌పురలో సీఏఏ, ఎన్నార్సీలపై మహిళలు ఇక్కడ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మోడీ, అమిత్‌షాలు తమ వాదనలు వినాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. ” వివాదాస్పద సీఏఏను మోడీ వెనక్కి తీసుకోవాలి. అప్పటివరకూ మా పిల్లలు, కుటుంబాలతో కలిసి మా నిరసనలను కొనసాగిస్తాం” అంటూ సబేరా అనే మహిళ తెలిపింది. పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ ఢిల్లీలోని నిరసనప్రాంతంలాగానే.. ‘పూణే షాహీన్‌బాగ్‌’ కూడా దేశంలోని మిగతా ప్రాంతాల్లోని నిరసనలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని నిరసనకారులు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలపై మాత్రమే కాకుండా.. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో పౌరనిరసనలపై పోలీసు దమనకాండను పూణే నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ” జామియా, షాహీన్‌బాగ్‌ ప్రాంతాల్లో నిరసనకారులపై కొందరు కాల్పులు జరిపినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పైగా నిరసనకారుల మీద లాఠీచార్జి కూడా జరిపారు. పోలీసులు కనీసం మమ్మల్ని కాపాడే యత్నం కూడా చేయలేదు” అని నిరసనకారుల్లో ఒకరైన అనిస్సా అన్నారు.

సందీప్‌ పాండే అరెస్ట్‌
ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త సందీప్‌ పాండేను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సోమవారం నిర్బంధంలోకి తీసుకున్నారు. లక్నోలోని సిటీ క్లాక్‌ టవర్‌ వద్ద ఠాకూర్‌గంజ్‌ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ.. కరపత్రాలను పంచుతూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారనే ఆరోపణలను మోపారు. జిల్లా మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం.. సందీప్‌ పాండే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆదివారం బెయిల్‌పై విడుదల… సోమవారం అరెస్టు

– ‘సత్యాగ్రహ పాదయాత్రచేస్తున్న ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్నిప్రవేశపెట్టాలి
చెన్నై షాహీన్‌బాగ్‌నిరసనకారుల డిమాండ్‌

ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రేరణతో మూడురోజుల క్రితం చెన్నైలో ప్రారంభమైన పౌర వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు ఈ నిరసనల్లో పాల్గొని వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా నినాదాలను వినిపిస్తున్నారు. ఎన్పీఆర్‌ను రాష్ట్రంలో అమలుచేయబోమని దానికి వ్యతిరేకంగా తమిళనాడు సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. చెన్నైలో నిరసనకారులపై పోలీసులు దాష్టీకాన్ని నిరసిస్తూ గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన ఈ నిరసనలు.. అంతే ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన నిరసనల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. ముస్లిమేతరులైన ఇతర మహిళలు నిరసనకారులకు టీలు అందించిన దృశ్యాలు కూడా దేశంలో ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ప్రతీకగా నిలిచాయి. శనివారం కూడా మహిళా నిరసనకారులు తినడానికి పరోటాలు, చపాతీలను వారు సమకూర్చారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తూ నిరసనకారులు పోస్టర్లు ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా లను నిందిస్తూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ” దేశంలో హిందూ ముస్లింలు కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. బాబ్రీ మసీదు సంఘటన సమయంలోనూ మేమంతా అలాగే ఉన్నాం. నేను, మా కుటుంబసభ్యులు నిరసనకారులకు సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఆర్‌.లలితా అనే స్థానికురాలు తెలిపింది.|

వారిపై యూపీ సర్కార్‌ అణచివేత
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజీపూర్‌ జిల్లా జైలు నుంచి మహిళా జర్నలిస్టు, విద్యార్థులు సహా 12 మంది కార్యకర్తల బృందం బెయిల్‌పై ఆదివారం విడుదలకాగా, పోలీసులు వారిని వెంటనే తిరిగి అరెస్టుచేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ బృందం ‘సత్యాగ్రహ పాదయాత్ర’ పేరుతో ప్రచార ర్యాలీని నిర్వహిస్తున్నది. ఘజిపూర్‌ నగరం నుంచి ఈ బృందం ఢిల్లీకి పాదయాత్రగా ఈ నెల 11న బయలుదేరింది. కాగా, వారిని పోలీసులు అదే రోజు అరెస్టుచేశారు. ఆరు రోజులు జైలులో గడిపిన బృంద సభ్యులు బెయిల్‌పై ఆదివారం విడుదలయ్యారు. తమ యాత్రను తిరిగి కొనసాగిస్తున్న వారిని పోలీసులు వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ‘ఫిబ్రవరి 11న ఘజిపూర్‌ బిర్నో గ్రామంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇద్దరు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ల సమక్షంలో మమ్మల్ని అరెస్టుచేశారు. సెక్షన్‌ 144ను కూడా మేం ఉల్లంఘించలేదు. కేవలం ముగ్గురు సభ్యులతో బృందంగా వెళుతూ సీఏఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. మా యాత్రను కొనసాగిస్తున్నాం. మా యాత్ర చట్టవిరుద్ధమని చెబుతున్నారు. మమ్మల్ని, మా కుటుంబసభ్యులను పోలీసులు పదేపదే బెదిరిస్తున్నారు’ అని బృంద సభ్యుడు మనిశ్‌ చెప్పారు. ‘సీఏఏ, ఎన్నార్సీ నిరసనల సందర్భంగా పోలీసుల దాడిలో చనిపోయినవారి కోసం మేం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. హింసను వ్యతిరేకిస్తున్న మమ్మల్ని చూసి యోగి సర్కార్‌ ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కావటంలేదు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా మా యాత్ర ఆగేదిలేదు’ అని మనీశ్‌ చెప్పారు. ‘సోమవారం మా యాత్ర ప్రారంభం కాగా… పది మంది ప్రజలు మమ్మల్ని చుట్టుముట్టారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించామనీ, శాంతిభద్రతల దృష్ట్యా అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. మమ్మల్ని వ్యానులో ఎక్కించి బీహెచ్‌యూ గేటు వద్ద వదిలివెళ్ళారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకున్న మా బృంద సభ్యులు కొందరు ఘజిపూర్‌ నుంచి ఢిల్లీ వైపుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు’ అని తెలిపారు. మేం కూడా వారితో కలుస్తాం. ‘సత్యాగ్రహ పాదయాత్ర’ కొనసాగుతుంది అన్నారు.

Courtesy Nava Telangana