గుత్తేదారుల హడావుడి
నాసిరకం నిర్మాణాలను దాచే ప్రయత్నాలు
అమ్మవార్ల గద్దెల చుట్టూ పగిలిన గచ్చు
రూ.కోటితో నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసం
పరిహారం లేదు.. పంట కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన
మేడారం నుంచి ప్రత్యేక ప్రతినిధి
జంపన్న వాగులో ఇసుక చదును పనులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి-మేడారం మధ్య రూ.88 లక్షలతో నిర్మించిన తారురోడ్డులో బయటపడిన నాణ్యతలేమిని కప్పిపుచ్చుకునేందుకు గుత్తేదారులు తిప్పలు పడుతున్నారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘నాణ్యత గడ్డిపోచ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు నాసిరకం పనులను పరిశీలించి చర్యలు చేపట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరగడంతో మంగళవారం సాయంత్రం నుంచే గడ్డి తొలగించడం, తారు వేసి కప్పివేసేందుకు నిర్మాణదారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రెండేళైనా మన్నాల్సిన రోడ్లను జాతర పనుల్లో కలిపి దులిపేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేడారం జాతర కోసం చేపట్టిన పనుల్లో ప్రణాళిక లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భక్తుల స్నానాల కోసమని రూ.అరకోటి నిధులు వెచ్చించి జంపన్న వాగులో ఇసుకనుచదును చేస్తున్నారు. నీటి ప్రవాహానికి ఎటువైపు కోసుకుపోతుందో తెలియని చోట చదును పేరుతో నిధులను నీటిలో పోస్తున్నారు. ఇదే వాగులో ఆరు నెలల క్రితమే రూ.కోటి నిధులతో పూర్తయిన చెక్ డ్యాంను ధ్వంసం చేశారు. దీనిపై నీటిపారుదల శాఖ డీఈ గిరిధర్ ను వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకే కూలగొట్టామని.. జాతర అనంతరం షట్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వనదేవత సమ్మక్క కొలువుదీరి ఉండే చిలకలగుట్టపై నుంచి వచ్చే తీర్థాన్ని (జలధార) తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవని, దీని కోసం రోడ్డుపై నుంచి లోయలోకి దిగి, పైకి ఎక్కడం | కష్టంగా ఉందని భక్తులు చెబుతున్నారు. కనీసం తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. – ఈ అంశంపై ‘ఈనాడు’ ములుగు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో మాట్లాడగా జాతర పనుల్లో భాగంగా మంజూరైన వాటినే చేపట్టామని చెప్పారు. ఊరట్టం కాజ్ వే, చిలకలగుట్ట తీర్థం పనులు ప్రతిపాదనల్లో లేవన్నారు.

మేడారం జాతర వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల గద్దెలపై చలువరాళ్లు ప్రమాదకరంగా మారాయి. సారలమ్మ గద్దె మెట్ల బండలు ఊడిపోయాయి. సమ్మక్క గద్దె మెట్టు చలువరాయి బండ పగిలి పదునుగా మారింది. గద్దెల ఆవరణలో మరమ్మతు పనులు నేటికీ ప్రారంభించలేదు. రద్దీలో భక్తులు వీటిపై అడుగేస్తే ప్రమాదమే. జాతర జరిగే మూడు రోజుల పాటు భక్తులను ఎలాగో గద్దెలపైకి అనుమతించరు. కానీ గద్దెలను నేరుగా దర్శనం చేసుకోవాలనుకునే వారు ముందుగానే మేడారం వస్తున్నారు. వారు ఒక్కసారిగా గద్దెలపై చేరితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ఈవో రాజేంద్రం వివరణ కోరగా మరమ్మతులకు ఒక దాత ముందుకు వచ్చారని, కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు.

మేడారం జాతర జరిగే ప్రాంతం చుట్టూ సాగుభూములున్న రైతులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. రెండో పంట వేయొద్దని అధికారులు ఆదేశించగా ఇప్పటికీ పైసా పరిహారం వారికివ్వలేదు. ఎంతమంది
రైతులున్నారనే గణాంకాలు కూడా సేకరించలేదు. ఈ పంట నిల్వలు ఇలాగే ఉంటే జాతరకు వచ్చే భక్తుల – బసకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు పంటను ఎవరూ కొనడం లేదు. స్వర్ణ, 10 75 రకాలను తిరస్కరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మేడారం గ్రామ పరిధిలోనే 1500 ఎకరాల్లో పంట నిల్వలు పేరుకుపోయాయి. కన్నెపల్లి, రెడ్డిగూడెం,

ఊరట్టం, జంపంగవాయి, నార్లాపూర్ తదితర గ్రామాల్లోనూ పొలంలోనే పంట ఉంది. జంపన్నవాగు ఒడ్డున నిల్వ చేసుకున్న రైతుల పంటను వెంటనే తొలగించాలంటూ అధికారులు ఒత్తిడితెస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని పంట కొనుగోలు, పరిహారం విడుదలకు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు శ్రీనివాస్ వివరణ ఇస్తూ కొద్ది రోజుల్లో నిల్వల కొనుగోలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Courtesy Eenadu