– కొన్ని చారిత్రిక కారణాలు

అమరావతి : రాష్ట్ర రాజధాని అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో మాటాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దక్షిణాఫ్రికా మాదిరిగా మూడు రాజధానులు రావచ్చునేమో అనగానే ఆ దేశం గురించి, రాజధానుల గురించీ ప్రజల్లో ఉత్సుకత పెరిగింది. దక్షిణాఫ్రికాకు ప్రిటోరియా పరిపాలన రాజధాని. దేశాధ్యక్షుడు, మంత్రివర్గం, విదేశీ రాయబార కార్యాలయాలు అక్కడ వుంటాయి. కాగా పార్లమెంటు వున్న కేప్‌ టౌన్‌ చట్ట రాజధాని. దేశానికి దక్షిణ కొనన వున్న ఆ నగరంలోనే వలస పాలన నాటినుండీ పార్లమెంటు వుండేది. దేశానికి మధ్యలో న్యాయ రాజధానిగా చెప్పే బ్లొమ్‌ఫొంటెన్‌లో సుప్రీం కోర్టు నెలకొంది. అయితే అత్యున్నతమైన రాజ్యాంగ న్యాయస్థానం జోహెనస్‌బర్గ్‌లో వుంది. కాబట్టి మూడు కాదు నాలుగు రాజధానులు అని ఎవరన్నా పూర్తిగా కొట్టి పారేయలేని పరిస్థితి. పైపెచ్చు ఆ దేశంలోని అతి పెద్ద నగరం కూడా జోహెనస్‌బర్గ్‌ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో తొమ్మిది రాష్ట్రాలున్నాయి. గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ దేశానికి దాదాపు మధ్యలో ‘లెసెథో’ అనే మరో దేశం వుంది.
దక్షిణాఫ్రికా జనాభా 5.87 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్‌ జనాభా 4.93 కోట్లు. ఇది సారూప్యతలా అనిపించవచ్చు. అయితే, దక్షిణాఫ్రికా 12,21,037 చ.కి.మీ విస్తీర్ణం కలిగిన ఒక దేశం కాగా కేవలం 1,60,205 చ.కి.మీ అంటే దాదాపు ఎనిమిదోవంతు విస్తీర్ణం వున్న రాష్ట్రం. ఆ దేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో మగ్గినదే! వలస పాలనను అంతమొందించడానికి, అనంతరం స్వపరిపాలన సాధించడానికీ సుదీర్ఘ పోరాటం సాగింది.

సువిశాల దేశంలో వివిధ ప్రాంతాలు, తెగల ప్రజలమధ్య ఐక్యతను సాధించడం ఒక బృహత్‌ కర్తవ్యం. ఆ క్రమంలోనే చారిత్రకంగావున్న ఆయా నగరాలను రాజధానులుగా ఏర్పాటు చేసుకున్నారు. వలస పాలన అనంతరం చారిత్రకంగా వచ్చిన అలాంటి అంశాలను రాష్ట్రంలో రాజధాని నిర్మించే సందర్భంగా అనుకరించడం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి 1910లో దక్షిణాప్రికా ఆవిర్భవించినప్పుడు నూతన రాజధాని నగరంపై పెద్ద వివాదమే సాగింది. అనేక చర్చలు, వాదోపవాదనల తరువాత అధికారాన్ని దేశ వ్యాప్తంగా పంచడానికి ఒక రాజీ ఫార్ములాను రూపొదించారు. దాని ప్రకారమే మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.

ఇవీ కారణాలు!
.ప్రస్తుతం రాజధానులుగా ఉన్న ప్రిటోరియాతో పాటు, బ్లోమ్‌ఫొంటెన్‌లు గతంలో కూడా రాజధానులే. దక్షిణాఫ్రికా ఆవిర్భావానికి ముందు బ్లోమ్‌ఫొంటెన్‌ ఆరేంజ్‌ ఫ్రీ అనే ప్రాంతానికి రాజధాని. ట్రాన్స్‌వాల్‌ అనే ప్రాంతానికి ప్రిటోరియా రాజధాని. రాజధాని నగరాలుగా గతం నుండి ఉన్న అవి అలాగే కొనసాగాయి.
బ్లోమ్‌ఫొంటెన్‌ దక్షిణాఫ్రికా మధ్య భాగంలో ఉంది. ఈ ప్రాంతాన్ని న్యాయ రాజధానిగా ఎంచుకోవడానికి అదో కారణం. దక్షిణాఫ్రికా ఆవిర్భావానికి ముందు నుండే ప్రిటోరియా విదేశీ రాయబార కార్యాలయాలకు కేంద్రంగా ఉండేది.

Courtesy Prajashakthi