• సుప్రీం సీజేకి లేఖలు
  • ఏజెన్సీ వాసుల నిర్ణయం
  •  వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటం రోజురోజుకు విస్తృతమవుతోంది. నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సలహా సంఘం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో ఉద్యమానికి స్థానికులు సిద్ధమవుతున్నారు. అమ్రాబాద్‌ మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించుకొని యురేనియం వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీకి కన్వీనర్‌గా కల్ముల నాసరయ్య వ్యవహరించనున్నారు.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలోని 83 చదరపు కిలో మీటర్ల పరిధిలో సర్వస్వం కోల్పోతున్న వారంతా ఉద్యమంలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయాలని నిర్ణయించారు. నల్లమల అస్థిత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి శక్తులనైనా అడ్డుకుంటామని ప్రకటించారు. మరోపక్క సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు నేతృత్వంలో పర్యావరణ శాస్త్రవేత్తలు బాబురావు, జీవన్‌కుమార్‌ మంగళవారం నల్లమలలో పర్యటించనున్నారు. యురేనియం తవ్వకాలతో సంభవించే దుష్పరిణామాలపై ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)