అమరావతి : రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణలు తేవాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ పదవీకాలాన్ని ఐదేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టేసింది. ఆర్డినెన్స్‌ దానికి అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటినీ కొట్టేసింది. వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా నిమ్మగడ్డ కొనసాగేందుకు రాజ్యాంగం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిందని స్పష్టం చేసింది. పదవీకాలం పూర్తి అయ్యే వరకూ కమిషనర్‌గా కొనసాగేందుకు నిమ్మగడ్డకు హక్కు ఉందని గుర్తు చేసింది. కాబట్టి కమిషనర్‌గా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ 310 పేజీలకుపైగా తీర్పును వెలువరించింది.

”రాజ్యాంగంలోని 243 (కె)(2) అధికరణ ప్రకారం ఎస్‌ఈసీ పదవికి రాజ్యాంగ రక్షణ ఉంది. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపునకు అనుసరించాల్సిన విధానంలోనే ఎస్‌ఈసీ పదవిలో ఉన్న వారినీ తొలగించాలి. ఆర్డినెన్స్‌ జారీ చేసి ఎస్‌ఈసీగా ఉన్న వ్యక్తిని తొలగింపుకు ప్రభుత్వాలకు అధికారం లేదు. ఆర్డినెన్స్‌ను జారీ చేయాలనే అధికారం మంత్రివర్గానికి ఉంది. దానిని ఆమోదించే అధికారం కూడా గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించింది. అయితే ఎన్నికల సంఘం విషయంలో ఆర్డినెన్స్‌ రాజ్యాంగంలోని 213 అధికరణానికి అనుగుణంగా లేదు. ఆ అధికరణంలోని నిబంధనలకు లోబడి ఆర్డినెన్స్‌ జారీ కాలేదు. పైగా ఇప్పుడేమీ అత్యవసరంగా ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సిన అత్యవసర పరిస్థితులు ఏమీ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. ఎన్నికల సంఘం కమిషనర్‌ పదవీ కాలాన్ని తగ్గించే అధికారం పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వానికి అధికారం ఏమీ లేదు. అందుకే ఆర్డినెన్స్‌తోపాటు ఎస్‌ఈసీ పదవీ కాలం అయిదేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఇచ్చిన జీవో 618, కొత్తగా ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమిస్తూ జారీ అయిన జీవో 619లు చట్ట వ్యతిరేకమని ప్రకటిస్తున్నాం.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆర్డినెన్స్‌ జారీ ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. రాజ్యాంగంలోని 213 అధికరణానికి లోబడి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ జారీ చెల్లదు… ” అని తీర్పులో హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆరువారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతలు చెప్పినట్టుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, దురుద్దేశంతోనే ఎన్నికలను వాయిదా వేశారని హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం జరిగిన పరిణామాలతో తనకు రక్షణ కల్పించాలని కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

కొత్త కమిషనర్‌ను నియమిస్తూ మరో జీఓను తీసుకొచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ, మరికొందరు రాష్ట్ర హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో నిమ్మగడ్డ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే కమిషనర్‌ నిమ్మగడ్డను తొలగించామని ప్రభుత్వం తరుఫు లాయర్‌ హైకోర్టుకు నివేదించారు. దీనిపై హైకోర్టులో పలు విచారణలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత తొలుత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. అయితే ఈ కేసుతో సంబంధం లేని వారు కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడంతో హైకోర్టులో నేరుగా విచారణ జరిగిన తొలి కేసు ఇదే. భౌతిక దూరం పాటిస్తూ సుదీర్ఘ వాదనలు ఈనెల 8న ముగియగా శుక్రవారం 300 పేజీలకుపైగా తీర్పు వెలువడింది. పిటిషనర్ల వాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను తోసిపుచ్చుతూ చారిత్రక తీర్పు వెలువడింది. తీర్పు వెలువడిన తర్వాత రమేశ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

Courtesy Nava Telangana