ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు చారిత్రాత్మక నిర్ణయం

తిరువనంతపురం : కేరళ ట్రావెన్‌కోర్‌దేవస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్‌ తెగకు చెందిన వ్యక్తిని ఆలయ పూజారిగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలి ప్రయత్నమన్నారు. ‘ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డులో పార్ట్‌ టైమ్‌ పూజారులుగా నియామకానికి షెడ్యూల్డ్‌ కులం (ఎస్సీ) నుంచి పద్దెనిమిది మందినీ, షెడ్యూల్డ్‌ తరగతుల (ఎస్టీ) నుంచి ఒకరని సిఫారసు చేశాం. ఎస్టీ వర్గానికి చెందిన ఒక పూజారిని నియమించడం ఇదే మొదటిసారి’ అని సురేంద్రన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టుచేశారు. ఖాళీల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా తయారుచేసిన ర్యాంకుల జాబితాను గురువారం ప్రకటించారు. ఎస్టీ కోటాకు నాలుగు ఖాళీలుండగా.. దరఖాస్తుదారుడు ఒకరు మాత్రమే ఉన్నారు. ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత.. నియామక బోర్డును పునర్వ్యవస్థీకరించామనీ, ట్రావెన్‌కోర్‌, కొచ్చిన్‌, మలబార్‌ దేవస్థానం బోర్డులలో వివిధ పదవులకు 815 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.