‘కంబళ’ పోటీల్లో  రికార్డు వేగంతో పరుగు

బెంగళూరు: జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన రన్నర్‌గా అంతా గుర్తుపెట్టుకుంటారు. 100మీ. రేసును కేవలం 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన ఒకేఒక్క అథ్లెట్‌గా నిలిచాడు. అయితే అతడిని మించిన వేగంతో ఓ అనామకుడు భారత్‌లో రాత్రికి రాత్రే సూపర్‌స్టారయ్యాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూదబిద్రకి చెందిన శ్రీనివాస గౌడ ఇక్కడి సంప్రదాయక ‘కంబళ’ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే అధిగమించాడు. అయితే ఇదంతా మామూలు ట్రాక్‌పై కాకుండా బురద నీళ్లలో.. రెండు దున్నలను కట్టేసి ఉంచిన తాడును పట్టుకుని ఈ పరుగు తీయడం విశేషం. అయితే గౌడ వేగాన్ని 100మీ.ల దూరానికి లెక్కేస్తే అది 9.55 సెకన్లుగా తేలింది. దీంతో అతడు బోల్ట్‌కంటే కూడా .03 సెకన్లు ముందుగానే పరిగెత్తినట్టయింది. కానీ ఈ రికార్డును నేరుగా బోల్ట్‌తో పోల్చలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే శ్రీనివాస గౌడ వేగం అతడి దున్నల నుంచి జనించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపిలో ఈ పరుగు పందేలను ఏటా నిర్వహిస్తుంటారు. ఎవరైతే వాటిని వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే బోల్ట్‌తో పోలిక ఎలా ఉన్నా ఈక్రమంలో అతను కంబళ పోటీల్లో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా నిలిచాడు. ఓ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇతడి ఫీట్‌ గురించి అందరికీ తెలిసింది.

Courtesy Andhrajyothi