•  సీనియర్‌ ఎడిటర్‌ రాఘవాచారి ఇక లేరు
  •  అస్వస్థతతో ఆస్పత్రిలో తుదిశ్వాస
  •  చంద్రబాబు, కేసీఆర్‌, నారాయణ సంతాపం
  •  వైద్య కళాశాలకు భౌతికకాయం అప్పగింత
తాను నమ్మిన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధితో ఆచరిస్తూ, పత్రికా రచనను అసిధారా వ్రతంగా సాగించిన కమ్యూనిస్టు మేధావి కలం ఆగింది. ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర దినపత్రికకు సుదీర్ఘకాలం ఎడిటర్‌గా పనిచేసిన చక్రవర్తుల రాఘవాచారి(81)ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అంతిమశ్వాస విడిచారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నిబద్ధతను కలిగి… జీవితాంతం వాటికే కట్టుబడి, ఒక విజ్ఞాన ఖనిగా ఆయన పేరుగాంచారు. 33 ఏళ్లపాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా పనిచేసిన రాఘవాచారి పత్రికారంగంపై తనదైన ముద్ర వేశారు. ఆయనకు భార్య జ్యోత్స్న, కుమార్తె డాలీ ఉన్నారు. రాఘవాచారికి ఏడేళ్ల క్రితం కిడ్నీలకు కేన్సర్‌ సోకితే శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన్ను స్థానిక సురక్షా ఆస్పత్రిలో చేర్పించారు. 20రోజులుగా చికిత్స పొందిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.
చిన్ననాటే పలు భాషలపై పట్టు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో చక్రవర్తుల వెంకటవరదా చార్యులు-జానకమ్మ దంపతులకు 1939 సెప్టెంబరు 10న రాఘవాచారి జన్మించారు. ఆయనది జమీందారీ కుటుంబం. బాల్యంలో ఇంట్లోనే తెలుగుతోపాటు సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లిషు, తమిళం భాషలు నేర్చుకుని వాటిపై సాధికారత సంపాదించారు. రాఘవాచారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1963లో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడయ్యారు. 1965లో సీపీఐ రాష్ట్రమండలి, రాష్ట్ర కార్యవర్గం, 1986లో జాతీయ కార్యవర్గానికి ఎన్నికయ్యారు. మోటూరి హనుమంతరావు రచనలు రాఘవాచారి వామపక్ష ఉద్యమంలో కార్యకర్తగా రాటుదేలడానికి తోడ్పడ్డాయి. 1965లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు. పలు ఆంగ్ల పత్రికలకు కరెస్పాండెంటుగా పనిచేశారు. 1972 నుంచి 2005 వరకు విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేశారు. రాఘవాచారి ఉమ్మడి ఏపీ సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా, పార్టీ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులుగా సేవలందించారు.
రాఘవాచారి పుట్టింది తెలంగాణలోనే అయినా ఎక్కువకాలం విజయవాడలోనే గడిపారు. ఆయన మృతికి జర్నలిస్టు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్దూం భవన్‌కు తరలించారు. పలువురు ప్రముఖులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. రాఘవాచారి మృతి పాత్రికేయ రంగానికి తీరనిలోటని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన పార్ధివదేహాన్ని సోమవారం విజయవాడలో విశాలాంధ్ర ఆఫీసుకు తీసుకెళ్ళారు. అక్కడ పలువురు నేతలు, ప్రముఖులు నివాళి అర్పించాక, కుటుంబసభ్యుల కోరిక మేరకు భౌతికకాయాన్ని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగించారు.
బ్రాహ్మణీకంపై తిరుగుబాటు!
ఐదు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన రాఘవాచారిని ‘నడిచే విజ్ఞాన ఖని’గా అందరూ భావిస్తారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అణువణువునా నింపుకొన్న ఆయన తాను పుట్టిన బ్రాహ్మణ శ్రీవైష్ణవులలోని సంప్రదాయాలతో ఘర్షణ పడ్డారు. 1969లో ఆయన తండ్రికి చివరిసారిగా ఆబ్దికం పెట్టారు. ఇలాంటి వైదిక క్రతువులు పాటించబోనని శపథం చేసి పిలకను తీసేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన స్థానిక పూజారి గూటయ్య స్ఫూర్తితో రాఘవాచారి 15ఏళ్లలోనే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. తనకు వారసత్వంగా వచ్చిన 400 ఎకరాలను పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. న్యాయశాస్త్రం అభ్యసించిన రాఘవాచారికి రాజ్యాంగ వివాదాలను, రాజకీయ పరిణామాలను విశ్లేషించడంలో, సూటిగా సంపాదకీయాలు రాయడంలో ప్రత్యేక ఒరవడి ఉంది. ఆయన రాసే విశ్లేషణాత్మక సంపాదకీయాలను పాఠకులు ఎంతో ఆసక్తిగా చదివేవారు.
Courtesy Andhra Jyothy..