రాష్ట్ర కార్యదర్శి మధు నివాళులు
విజయవాడ అర్బన్‌ :

కమ్యూనిస్టు సీనియర్‌ నాయకులు, ప్రముఖ వైద్యులు ఆదుర్తి పాండురంగ విఠల్‌(78) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య కమలకుమారి, కుమార్తె సుహాసిని ఉన్నారు. సుహాసిని విస్సన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌. అల్లుడు ఎంఎ. హనుమంతరావు బెల్‌ కంపెనీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఎపి.విఠల్‌గా సుపరిచితులైన ఆయన విజయవాడ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద నివాసం ఉంటున్నారు. 1942లో గుంటూరు జిల్లా వరహాపురంలో జన్మించారు. ప్రాథమిక విద్యను వేమూరులోనే అభ్యసించారు. 1967లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌ చదివారు. వైద్య విద్యనభ్యసించే సమయంలో కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులై సిపిఎంలో చేరారు. విద్యార్థి నేతగా ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో పాల్గొన్నారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట పిహెచ్‌సి లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎంతో మందికి వైద్య సేవలందించారు. అయితే ప్రజా ఉద్యమానికి ప్రభుత్వ ఉద్యోగం ఆటంకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం నెల్లూరు ప్రజావైద్యశాలలో పనిచేశారు. తరువాత నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రజావైద్యశాల ను స్థాపించి అతి తక్కువ ఫీజుతో ఎంతో మంది పేదలకు వైద్యమందించారు. ఆయన ఆస్పత్రిని విఠల్‌ దవాఖానా అని కూడా పిలిచేవారు. 1983లో విజయవాడ వచ్చి ఇక్కడే ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. నగరంలో ప్రాక్టీస్‌ చేస్తూనే ప్రజాశక్తి పత్రికలో కూడా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ, హెన్స్‌ ఇండియా, డెక్కన్‌ క్రానికల్‌ దినపత్రికలకు వ్యాసాలు రాసేవారు. సుందరయ్య ఆత్మకథ, ‘విప్లవ పథంలో నా పయనం’ రచనకు తోడ్పాటునందించారు. ఆయన రాసిన ‘యుద్ధం-హృదయం’ మంచి ఆదరణ పొందింది. 2012 నుండి అనారోగ్యంగా ఉన్నారు. చివరివరకూ ఆయన సాక్షి దినపత్రికకు వ్యాసాలు రాస్తూనే వచ్చారు. విఠల్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శ నార్థం మంగళవారం మధ్యాహ్నం వరకూ పడమటలోని ఆయన స్వగృహంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నగరం లోని సిద్ధార్థ వైద్యకళాశాలకు భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

మంచి కమ్యూనిస్టు : పి.మధు
విఠల్‌ మంచి కమ్యూనిస్టు భావాలతో ఉన్నారని, ఆయన చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విఠల్‌ భౌతికకాయాన్ని మధుతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర రావు, సిహెచ్‌.బాబూరావు, పశ్చిమ కృష్ణా కార్యదర్శి డివి.కృష్ణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ మంచి వైద్యునిగా ఎంతో మందికి సేవలందించి పేరు సాధించార న్నారు. ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాస్తూ చైతన్యవంతం చేశారన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విఠల్‌ భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

(Courtesy Prajashakti)