ఎన్ని భారాలు మోపినా ప్రజలు తిరగబడకుండా సహనంతో ఉండాలని ఊరడింపు మాటలు వల్లివేస్తుంటారు. మరి అదే కార్పొరేట్లకు ఎందుకు భారాలు వేయరు? ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. అయితే, కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కార్‌.. ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనుకోలేం. ఈ విధానాలపై పోరాటం చేయడమొక్కటే ప్రజలముందున్న కర్తవ్యం.

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడుతున్నది. పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. లెక్కలేనంత మందికి ఉపాధి కరువైంది. పనుల్లేక వలసకూలీలు, పేదలు అల్లాడుతున్నారు. తిండి దొరక్క ఎంతోమంది తనువు చాలించారు. ఆస్పత్రిపాలయ్యారు. ఇవన్నీ ప్రతి రోజూ మీడియాలో వచ్చినవే. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటివి చూస్తే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది. ఎంతోమంది తమకు తోచిన రీతిలో రెండునెలల పాటు సాయమందించారు. చాలా ప్రపంచదేశాల్లోనూ అక్కడున్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకున్నాయి. మన పాలకులు మాత్రం పేదప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకోవడానికే ఉన్నారా? అని అనిపిస్తున్నది. ఇటీవలి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతున్నది. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజానీకం తమపై పెట్రో చార్జీల రూపంలో కేంద్రప్రభుత్వం వడ్డన వేస్తుందనుకోలేదు. తన ఖజనాను నింపుకోవడం కోసం జనం నెత్తిన ఈ రకంగా భారాలు మోపడం దుర్మార్గం. పదిరోజుల వ్యవధిలోనే పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5.47, డీజిల్‌కు రూ.6.16 పెరగడం ఆందోళన కలిగించే అంశం.

”అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాం.ఎంత తగ్గితే అంత తగ్గిస్తాం. ప్రజానీకాన్ని మోసం చేయబోం. సబ్సిడీ లాంటివి ఏమీ ఉండవు” ఇదీ మోడీ సర్కార్‌ దేశానికి చెప్పింది. నిజంగా అలా జరుగుతున్నదా? ఈ ఆరేండ్లలో ఏనాడైనా అలా జరిగిందా? అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఆ ఫలితాలను వినియోగదారులకు అందించాల్సిన కేంద్రం.. వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం. అదీ కరోనా మహమ్మారితో ప్రజలంతా అల్లాడుతున్న సమయంలో..! పెట్రో ధరల విషయంలో బీజేపీ ప్రభుత్వం అధికార దోపిడీకి పాల్పడుతున్నది.

ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన ‘అచ్ఛేదిన్‌’ ఇప్పుడు కనుచూపు మేరలో లేదు. 2014లో మోడీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై సుంకం రూ.9.48గా, డీజీల్‌పై రూ.3.56గా ఉన్నది. 2014నాటితో పోల్చుకుంటే మోడీ సర్కారు హయాంలో పెట్రోల్‌పై సుంకం 429శాతం, డీజీల్‌పై 142శాతం పెరిగింది. 2014, 2016 ఏడాదుల్లో పెట్రోల్‌, డీజీల్‌లపై కేంద్రం తొమ్మిది సార్లు ఎక్సయిజ్‌ సుంకాన్ని పెంచింది. నిజానికి 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.16 డాలర్లు. 2018-19కి ఈ థర 64 డాలర్లకు చేరుకోగా, ఈ నెల జూన్‌ 15 నాటికి 41 డాలర్లకు తగ్గింది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో అంతర్జాతీయంగా 20 డాలర్లకు పోయింది. ఒకరోజు మైనస్‌కు కూడా చేరింది. ఇంత జరిగినా ధరలు తగ్గాల్సి ఉండగా, మోడీ సర్కార్‌ పెంచుకుంటూ పోవడం దారుణం.

ప్రపంచ వ్యాపితంగా కొన్ని దేశాల్లో వినియోగదారులందరూ తగ్గిన ధరల ప్రయోజనాన్ని పొందుతుండగా, భారతీయులకు మాత్రం మోడీ రిక్తహస్తం చూపారు. మన దేశంలో ప్రభుత్వం ధరలు తగ్గించకుండా పన్నులు పెంచడం ద్వారా చార్జీలను పెంచేసింది. అంతటితో ఆగకుండా ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు సెస్‌ను కూడా లీటరుకు రూపాయి పెంచేసిన విషయం తెలిసిందే. పగటిదొంగ మాదిరిగా ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత కావలిస్తే అంత సొమ్మును దోచేస్తున్నది. చార్జీలు పెంచడాన్ని వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు వ్యతిరేకిస్తుంటే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న కాషాయవాదులు.. తమకు తాముగా దేశభక్తులుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ప్రస్తుత భారాలపై ఏమి సమాధానం చెప్తారు?

కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ఆత్మనిర్బర్‌ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినా అది ఎవరికి ఉపయోగపడిందో దేశమంతా చూసింది. పెద్దల సేవకే పరిమితమైంది తప్ప పేదలకు చేరింది శూన్యం. మాంద్యం దిశగా వెళుతున్న ఆర్థిక వ్యవస్థలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, రేటింగ్‌ సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకు, కరోనా కాలంలో చమురు సంస్థలు కోల్పోయిన ఆదాయాన్ని ప్రజల నుంచి ఈ రకంగా రాబట్టాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. శవాల మీద పేలాలేరుకోవడం అంటే ఇదేనేమో! ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలపై తాజా పెంపు మరింత భారంగా మారింది. ఈ పెంపు ఒక్కదానితో ముగిసేది కాదు. ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై చూపుతూనే ఉన్నది. ఇది సామాన్యులను మరింత దోపిడీకి గురిచేయడమే.

ఎన్నికల ముందు ప్రజా సంక్షేమంపై మాటలు కోటలు దాటించిన మోడీ అండ్‌కోకు అధికారంలోకి వచ్చిన తరువాత కాసుల లెక్కే ఎక్కువగా కనిపిస్తున్నది. ధరలు పెంచడానికి సిద్ధమవుతున్న సమయంలోనో, ఏదైనా సంక్షోభ సమయంలోనూ మన దేశ ప్రజలు సహనశీలురు అంటూ ప్రధాని మోడీ చెబుతుంటారు. ఈ లెక్కన ఎన్ని భారాలు మోపినా ప్రజలు తిరగబడకుండా సహనంతో ఉండాలని ఊరడింపు మాటలు వల్లివేస్తుంటారు. మరి అదే కార్పొరేట్లకు ఎందుకు భారాలు వేయరు? ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. అయితే, కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కార్‌.. ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనుకోలేం. ఈ విధానాలపై పోరాటం చేయడమొక్కటే ప్రజలముందున్న కర్తవ్యం.

Courtey Nava Telangana