జడ్జి, సిబ్బందితో పాటు నిధుల్లేవు

పెండింగ్‌లో నేతలపై కేసులు

చర్యలకు ఆదేశించండి

గవర్నర్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌): ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సత్వర పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానమది! ఏడాదిన్నరకాలంగా దానికి జడ్జి లేరు. బడ్జెట్‌ కేటాయింపులూ లేవు! సిబ్బంది, నిధుల కొరతతో ఆ ప్రత్యేక కోర్టు సరిగ్గా పనిచేయడం లేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) ఆరోపించింది. దీని వల్ల కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. తెలుగురాష్ట్రాల్లోని మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా సేకరించి ఆమెకు నివేదించింది.

ఆయా కేసుల సత్వర పరిష్కారానికి అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని 2017 డిసెంబరు 14న సుప్రీంకోర్టు ఆదేశించిందని గవర్నర్‌కు రాసిన లేఖలో ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గుర్తుచేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుతో పాటు 30 మంది సహాయక సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రెండు జీవోలను విడుదల చేసిందన్నారు. ఏడాదిన్నరకాలంగా జడ్జి, బడ్జెట్‌ కేటాయింపులేవీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని ఆరోపించారు. అడిషనల్‌ చార్జ్‌ జడ్జి, డిప్యూటేషన్‌పై కొంత మంది సిబ్బందితో ప్రత్యేక న్యాయస్థానం పనిచేయలేకపోతోందని పేర్కొన్నారు.

14 జిల్లాల నుంచి మాత్రమే కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని తెలిపారు. ఏడాది క్రితం ఈ విషయాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ లేఖను ఫిబ్రవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు పంపారన్నారు. సుప్రీం ఉత్తర్వులు రాష్ట్రంలో అమలు కావడంలేదని, కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వివిధ జిల్లాల నుంచి బదిలీ జరగలేదని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక న్యాయస్థానానికి న్యాయాధికారితో పాటు సిబ్బందిని నియమించాలని, బడ్జెట్‌ కేటాయింపులు, కేసుల బదలాయింపునకు చర్యలు తీసుకునేలా సీఎ్‌సను ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

17 కేసులతో రాజాసింగ్‌ టాప్‌! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రత్యేక న్యాయస్థానంలో 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 7 కేసులతో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి రెండో స్థానంలో, 6 కేసులతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మూడో స్థానంలో ఉన్నారు. 5 కేసులతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 4 కేసులతో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Courtesy Andhrajyothy..