అనర్హతలపై స్పీకర్లు నాన్చొద్దు

లోక్‌సభ లేదా అసెంబ్లీల కాలపరిమితి ఐదేళ్లు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు నెలల కాలపరిమితిని నిర్దేశిస్తున్నాం. అనర్హతకు గురయ్యే వ్యక్తి ఒక్క రోజు కూడా పదవిలో ఉండకూడదు.

స్పీకర్లు కూడా రాజకీయ విధేయతలకు లోబడి పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్లు ఏళ్ల తరబడి తేలడం లేదు. పార్టీకి చెందిన వ్యక్తి ఓ న్యాయాధికారితో సమాన హోదాతో ఎలా ఉండగలరు? దీనిపై రాజ్యాంగాన్ని సవరించి, స్పీకర్ల స్థానే ఓ రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి లేదా విశ్రాంత హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లేదా న్యాయనిపుణులతో ఓ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేసే విషయాన్ని పార్లమెంటు ఆలోచించాలి.
సుప్రీం ధర్మాసనం
అరుదైన సందర్భాల్లో మాత్రమే ఎక్కువ టైమ్‌.. సుప్రీం తీర్పు
స్పీకర్లకు ఈ అధికారాలెందుకు..?.. ఆయనా ఓ పార్టీ సభ్యుడే
ఈ పిటిషన్లు తేల్చేందుకు ట్రైబ్యునల్‌!.. పార్లమెంటుకు సూచన

న్యూఢిల్లీ, జనవరి: అధికారాన్ని బట్టి, పదవులను బట్టి పార్టీలు మారుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న రాజకీయ నాయకుల నెత్తిన సుప్రీంకోర్టు సమ్మెట పోటు పొడిచింది. ఎన్నికల్లో గెలిచాక పార్టీలు మారే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయ్యే ిఫిర్యాదులను సభా పతులు (లోక్‌సభ, శాసనసభల స్పీకర్ల్లు) మూడు నెలల్లోగా తేల్చెయ్యాలని కీలక తీర్పు వెలువరించింది. ‘‘అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణీత కాలావధి అంటే ఏంటి…? ఇది కేసును బట్టి మారవచ్చు. ఏదైనా సరే, మూడు నెలల గరిష్ట పరిమితి మాత్రం మించరాదు.

అత్యంత అరుదైన సందర్భాలకు కూడా సహేతుకమైన కారణం ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి, పార్టీలు మారిన వారిపై (ఫిరాయింపుల-నిరోధక చట్టం కింద) స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరినట్లు లెక్క’’ అని జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ వి బాలసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారంనాడు ఇచ్చిన తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది.

మణిపూర్‌కు చెందిన ఓ మంత్రికి సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. టీ శ్యామ్‌కుమార్‌ అనే నేత 2017లో కాంగ్రెస్‌ టికెట్‌పై నెగ్గి ఎమ్మెల్యే అయ్యారు. కానీ బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయన వెంటనే పార్టీ ఫిరాయించి, బీజేపీలో చేరి, అటవీ శాఖ మంత్రి కూడా అయిపోయారు. దానిపై కాంగ్రెస్‌… స్పీకర్‌ను కలిసి ఆయనపై అనర్హత వేటేయాలని పిటిషన్‌ పెట్టుకుంది. యథాప్రకారం సదరు స్పీకరు నేటిదాకా దాన్ని తన వద్దే అట్టేపెట్టుకున్నారు తప్ప తేల్చలేదు. దీనిపై కాంగ్రెస్‌ మొదట మణిపూర్‌ హైకోర్టును ఆశ్రయించింది. కానీ స్పీకర్ల అధికారాలకు సంబంధించిన అంశం ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ముంగిట పెండింగ్‌లో ఉందని అంటూ జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 స్పీకర్ల స్థానే రిటైర్డ్‌ జడ్జిలతో వ్యవస్థ
అనర్హత పిటిషన్లకు సంబంధించి దాదాపుగా ఇదే రకమైన పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఉండడంతో సుప్రీంకోర్టు ఈ దుస్సంప్రదాయానికి చెక్‌ పెట్టాలని నిశ్చయించుకొంది. ‘‘ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఽఅధికారం స్పీకర్లకు ఉండాలా? ఆయన కూడా ఓ పార్టీ సభ్యుడే. పార్టీకి చెందిన వ్యక్తి ఓ న్యాయాధికారితో సమాన హోదాతో ఎలా ఉండగలరు? దీనిపై రాజ్యాంగాన్ని సవరించి, స్పీకర్ల స్థానే ఓ రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి లేదా న్యాయనిపుణులతో ఓ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసే విషయాన్ని పార్లమెంటు ఆలోచించాలి’ అని బెంచ్‌ సూచించింది.

(Courtesy Andhrajyothi)