దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా

దక్షిణ మధ్య పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రయివేటు రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజాసన్‌ మాల్యా తెలిపారు. హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో రైల్వే బడ్జెట్‌పై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు రూ.1.61 లక్షల కోట్లు కేటాయించిందనీ, గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి-వారణాసి, లింగంపల్లి-తిరుపతి, చర్లపల్లి-పర్వేలి, విజయవాడ-విశాఖ, చర్లపల్లి-శాలిమార్‌, ఔరంగాబాద్‌-పన్వెలి, సికింద్రాబాద్‌-గువాహటి, చర్లపల్లి-చెన్నై, గుంటూరు-లింగంపల్లి మార్గాల్లో ప్రయివేటు రైళ్లను నడపనున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు-లింగంపల్లి, చర్లపల్లి-శ్రీకాకుళం, ఔరంగాబాద్‌-పన్వెలి మార్గంలో తేజస్‌ రైళ్లను నడిపే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌కు రూ.170 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

మిగతా కేటాయింపులు ఇలా..
కొత్త లైన్లు, ఇతర వ్యయాలకు రూ.2,856 కోట్లు
డబ్లింగ్‌, మూడో లైన్‌, బైపాస్‌ పనులకు రూ.3,836 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,846 కోట్లు
ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు రూ.40 కోట్లు
చర్లపల్లి శాటిలైట్‌ టర్మినల్‌ స్టేషన్‌కు రూ.5 కోట్లు
మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్తలైన్‌ ప్రాజెక్టుకు రూ.235 కోట్లు
మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి కొత్తలైన్‌ ప్రాజెక్టుకు రూ.520 కోట్లు
కాజీపేట-బల్లార్షా మూడో ప్రాజెక్టుకు రూ.483 కోట్లు
నడికుడి-శ్రీకాళహస్తి కొత్త ప్రాజెక్టుకు రూ.1,198 కోట్లు

Courtesy Nava Telangana